దురాశ ఫలితం
ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. అతడు పేదవాడు, ఎంతో దారిద్య్రంతో బాధపడుతున్నాడు. ఇంత పేదరికం అనుభవిస్తూ కూడా ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు తన ఇంటికి సమీపంలో ఉన్న పాము పుట్టలో పాలు పోసేవాడు. బ్రాహ్మణుని పేదరికానికి పాము జాలిపడింది. బ్రాహ్మణుడు తనకు పాలుపోసిన ప్రతిరోజు అతనికి ఒక విలువైన వజ్రాన్ని ఇచ్చేది. దాంతో బ్రాహ్మణుడి పేదరికం దూరమైంది.
కొంత కాలంలోనే అతడు సంపన్నుడయ్యాడు. ఊళ్ళో వాళ్ళందరూ బ్రాహ్మణుకి ఏవో లంకెబిందెలు దొరికాయని చెప్పుకున్నారు. ఒకరోజు పనిపై బ్రాహ్మణుడు వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. అతడు తన కుమారుడ్ని పిలిచి “నాయనా! నేను ఊరికి వెళుతున్నాను. కొద్దిరోజుల పాటు అక్కడే ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి నువ్వు ప్రతిరోజు ఈ పుట్టలోని పాముకు పాలు పొయ్యి. ప్రతిరోజు ఆ సర్పం నీకు ఒక వజ్రాన్ని ఇస్తుంది. దాన్ని ఇంట్లో భద్రంగా దాచిపెట్టు” అని చెప్పి బ్రాహ్మణుడు ఊరికి వెళ్ళిపోయాడు.
తండ్రి చెప్పినట్టే కుమారుడు పాము పుట్టలో పాలు పోశాడు. పాము ఒక వజ్రాన్ని ఇచ్చింది. పాము వల్లే తమకు ఇంత సంపద వచ్చిందని బ్రాహ్మణుడి కుమారుడు గ్రహించాడు. ‘ప్రతిరోజూ ఒక వజ్రం ఇస్తుందంటే పుట్టలో ఎన్ని వజ్రాలు ఉన్నాయో? అన్ని వజ్రాలను ఒక్కసారి దక్కించుకుంటాను’ అని బ్రాహ్మణుని కుమారుడు మనస్సులోనే ఆలోచించుకున్నాడు. ఆలస్యం చేయకుండా ఊళ్ళోవాళ్లకు విషయం చెప్పాడు. గ్రామస్తులందరికి దురాశ కలిగింది. వజ్రాలను సొంతం చేసుకోవాలని అందరూ కలసి పుట్టను తవ్వారు. పుట్టలో ఎటువంటి వజ్రాలు దొరక్కపోగా పాము మాయమైపోయింది. ఏం చేయాలో పాలుపోక గ్రామస్తులంతా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఊరి నుండి వచ్చిన బ్రాహ్మణుడు తన కుమారుడి ద్వారా విషయాన్ని తెలుసుకుని బాధపడ్డాడు. కొద్దిరోజులు పాముకోసం వెతికాడు. ఒకరోజు వేరొక పుట్టలో పాము కనపడింది.
“సర్పరాజమా! నా కుమారుడి వల్ల పొరపాటు జరిగింది. నువ్వు మా ఇంటికి వస్తే వేరొక పుట్టను నిర్మిస్తాను. దయచేసి మా ఇంటికి రా” అని బ్రాహ్మణుడు ఆహ్వానించాడు. “బ్రాహ్మణోత్తమా! నీ కుమారుడి వల్ల నాకు ప్రాణహాని ఉంది. అందువల్ల నీ ఆహ్వానాన్ని మన్నించి నీ ఇంటికి రాలేను. జరిగిన విషయాన్ని నీకు తెలియజేసి వెళ్ళిపోవాలని ఇక్కడ ఉన్నాను” అని చెప్పి పాము శాశ్వతంగా బ్రాహ్మణునికి దూరమైంది. తన కుమారుడు తెలియనితనం, అతనితోపాటు ప్రజల దురాశ ఫలితంగా తాను ప్రతిరోజుసర్పం నుండి పొందుతున్న సంపదను కోల్పోవలసి వచ్చినందుకు బ్రాహ్మణుడు బాధపడ్డాడు.
నీతి కథలు : మనం ఒక పనిని వేరే వాళ్ళకి చెప్పినప్పుడు, ఆ వ్యక్తి ఆ పనిని సరిగ్గా చేస్తాడో లేదో మనం ఆలోచించాలి. అప్పుడు ఆ వ్యక్తికి పని చెప్పాలి.