ద్రౌపది సత్యభామలు
ధర్మరాజు మార్కండేయ మహర్షి వద్ద అనే విషయాలు తెలుసుకుంటున్న సమయంలో ద్రౌపది సత్యభామలు ఇష్టాగోష్టి సలుపుతున్నారు. సత్యభామ ద్రౌపదిని " ద్రౌపదీ ! నీకు ఐదుగురు భర్తలు. వారియందు నీవు భక్తి కలిగి ఉన్నావు.
వారు నీయందు అనురాగం కలిగి ఉన్నావు. ఇదెలా సాధ్యం నీ వద్ద ఏదైనా మంత్రమూ ఔషధమో ఉన్నదా? ఈ మహిమ నీకు ఎలా చేకూరింది. నీ అలంకరణా సామర్ధ్యమా లేక సంభాషణా చాతుర్యమా నాకు ఎరిగింపుము. ఆ నేర్పరితనంతో నేను నా భర్త అయిన శ్రీకృష్ణుని వశం చేసుకుంటాను " అని అడిగింది. ఆ మాటలకు ద్రౌపదికి కించిత్ కోపం వచ్చింది.
ఆమె సత్యభామతో " సత్యా! నీవు నన్ను దుష్టస్త్రీగా జమకట్టడం తగదు. ఆ పురుషోత్తమునకు నీవు భార్యగా తగవు అని నా భావన. మంత్ర తంత్రములతో భర్తను వశం చేసుకోవాలి అనుకోవడం నీ భ్రమ. అలాంటి పనులు చేస్తే భర్తకు భార్య మీద ఉన్న ప్రేమ కూడా పోతుంది. అలాంటి భార్యతో చెలిమి పాముతో చెలగాటం అని భావిస్తాడు. అలాంటి మందులకు భర్తకు రోగం, భార్యకు అపకీర్తి వస్తుంది. భర్తల పట్ల భార్యలు ఇలాంటి కపటాలతో మోసగించిన నరకం తప్పదు. భర్తకు అనుకూలవతిగా చరించడమే భార్యకు ఉత్తమ ధర్మం.
నేను పాండవుల పట్ల ఎలా ప్రవర్తిస్తానో నీకు వివరిస్తాను. నా భర్తలు పరస్త్రీలతో చరించినా నేను అసూయ చెందను. వారి పట్ల అహంకరించక పూజ్యభావంతో ఉంటాను. నా భర్తలు తప్ప మిగిలిన వారు దేవతలైనా, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులైనా నాకు తృణప్రాయం. స్నానం భోజనం శయనం ఏదైనా భర్తలకు సమకూర్చి నేను అనుభవిస్తాను. భర్తల మనసెరిగి వారికి కావలసినవి సమకూరుస్తాను. భర్తల యొక్క బంధు మిత్రుల ఎడ ఆదరం చూపిస్తాను.
గృనిర్వహణలో పరిశుభ్రత పాటిస్తాను. ఏదీ వ్యర్ధం చేయను. అనవసర ఖర్చులు చేయను. భర్తలు ఇంట లేనప్పుడు పువ్వులు ధరించను. అలంకారం చేసుకోను భర్తలయందు మనసు నిలిపి వారి కోసం నిరీక్షిస్తుంటాను. ఎక్కువ సేపు వాకిట నిలబడటం, అతిగా నవ్వడం, దుష్టులతో స్నేహం చెయ్యడం చేయను. నా భర్తలు ఎంతటి సున్నిత మనస్కులో అంతటి కోపాన్ని ప్రదర్శిస్తారు. వారి పట్ల భయభక్తులతో ప్రవర్తిస్తాను. మా అత్త కుంతికి స్నాపానాదులు నేనే సమకూరుస్తాను. నా భర్త ధర్మరాజు ప్రతి రోజు పదివేల బ్రాహ్మణులకు పదివేల యతీశ్వరులకు అన్న సంతర్పణ చేస్తాడు. ఆ ఏర్పాట్లు నేను స్వయంగా చేసి వారికి ఆనందం సమకూరుస్తాను. అంతఃపురంలో పనిచేసే వేలకొలది సేవకుల బాగోగులు నేనే స్వయంగా చూస్తాను. వారు వారి విధులను క్రమశిక్షణలో నిర్వర్తించేలా చూస్తాను.
భండాగారంలో ఉన్న రత్నాలు, మణులు, ఆభరణాలు, ధనం మొదలైన లెక్కలు నాకు తెలియును. పని వారికి ఇవ్వవలసిన జీతభత్యములు నేనే ఇస్తాను. అందు వలన పాండవులు సంసార భారం నా మీద మోపి నిశ్చింతగా ఉంటారు. నాకు రాత్రి ఒక ఝాము మాత్రమే నిద్రపోవడానికి సమయం ఉంటుంది. భోజనం చేయటానికి సరిగా సమయముండదు. ఇలా ప్రవర్తించి నేను భర్తల ఆదరణ పొందుతున్నాను కాని మందులు ఔషధాలు ఉపయోగించి కాదు. ఇంద్రజాలం అసలే కాదు " అని అన్నది.