దురుసుతనం
గంగవరం ఓ చిన్న గ్రామం గ్రామంలో రెక్కాడితే గాని డొక్కాడని జనాభా ఎక్కువ. ఏ బుతువుకాబుతువు పండితే గ్రామంలో ధాన్యలక్ష్మి నిండి సుఖశాంతులతో వుండేది గ్రామం.
ఐతే వరసగా రెండేళ్ళు అనావృష్టివల్ల నేలతల్లి చినుకుకోసం అంగలార్చి బీటలు ఇచ్చింది. పంట దాకా ఎందుకు...నారు మడులు ఎండిపోయి నాట్లే పడలేదు. భూమి తల్లి పచ్చదనంతో నిండితే కడుపులు నింపుకునే పశువులన్నీ అస్థిపంజరాలయ్యాయి.
గ్రామం మీద రాబందులు ఎగరసాగాయి.
అలాంటి సమయంలో గ్రామానికంతా మోతుబరి, పిసినారి రత్తయ్య ఓ పూట గ్రామస్తులకు అన్నదానం చేశాడు.
“చూడు.డొక్కలు మాడిన ఆ బీదా బిక్కీ ఎలా చేతులు నాకుతున్నారో, నేను కాబట్టి పూరందరికీ అన్నదానం చేశాను. నాలాంటి దానకర్ణుడు మరొకడు లేడు” అని స్వస్తుతి చేసుకోసాగాడు రత్తయ్య.
అది విన్న పాలేరు భీమన్న రత్తయ్య పిసినారి బుద్ధి తెల్సినవాడు కనుక గాదుల్లో ధాన్యం తీసి సంతర్పణ చేశాడు. ఆ వడ్లు ప్రసాదించేది భూమాత. భూదేవికి కావాల్సింది నీరు. ఆ నీటినిచ్చేవి మేఘాలు, మేఘానికి పక్షపాత బుద్ధిలేక తన నీటికి పేద గొప్ప తారతమ్యం లేకుండా అందరికీ సమభావంతో త్యాగం చేస్తుంది. ఏనాటికైనా దానంలో చెప్పకోవల్సి వస్తే మేఘాన్నే ముందు చెప్పాలి అన్నాడు.
భీమన్న నోటి దురుసుతనం తెల్సిన రత్తయ్య మౌనం వహించాడు.