దెబ్బకిదెబ్బ! చెల్లుకి చెల్లు!
బంధు మిత్ర సపరివారంగా సూర్యోదయానికి ముందే కోతి వెంట బయల్దేరాడు రాజు.సరస్సును చేరుకున్నాడు.‘అంతా సరస్సులో స్నానం చెయ్యండి. మునగండి’ అంది కోతి. మునిగారంతా. ఒక్కరూ తేలలేదు. అంతా ఏమయిపోయారో తెలియలేదు. ఆందోళన చెందాడు రాజు. కోతి కోసం చూశాడు. అది సరస్సు దగ్గరగా ఉన్న చెట్టుకొమ్మ మీద కూర్చుని ఉంది. కిచకిచమని నవ్వుతూ ఉంది.‘నవ్వడం ఆపు. ముందు నా బంధు మిత్రులు ఏమయ్యారో చెప్పు?’ అడిగాడు రాజు.‘చెబుతా! చెబుతా! మునిగిన వారంతా కోనేటిలో కాపేసి ఉన్న రాక్షసుడికి ఆహారమయిపోయి ఉంటారు? ఆపైన పరలోకానికి చేరుకుని ఉంటారు. అక్కడ నా వాళ్ళను కలుసుకుని ఉంటారు.’ అంది కోతి. అప్పుడు అర్థమయింది రాజుకి. తను కోతిమూకను చంపించానని, ఈ కోతిరాజు, తన పరివరాన్నంతా ఈ రకంగా మట్టుబెట్టింది. మాయచేసి, మోసం చేసింది. తట్టుకోలేకపోయాడు రాజు.‘దుర్మార్గుడా! ఎంత దారుణానికి ఒడిగట్టావు.’ అన్నాడు.‘ఎవరు ఒడిగట్టారు? ముందు నువ్వు ఒడిగట్టావు. నా పరివారాన్నంతా చంపావు. దాంతో నేను నీ మీద కసి తీర్చుకున్నాను. నీ దుర్మార్గానికి నా దుర్మార్గం సరి. చెల్లుకి చెల్లు. నాకిప్పుడు చాలా హాయిగా ఉంది. నీకూ ఎవరూ లేరు. నాకూ ఎవరూ లేరు. ఇద్దరం ఏకాకులుగా ఏడుస్తూ తిరుగుదాం.’ అంది కోతి.’’ కథను ముగించాడు మిత్రుడు.
‘భూపతికి తగిన శిక్షే పడింది. నేను మాత్రం నీ మాట విన్నానా? వినకే ఈ శిక్షను తలకి చుట్టుకున్నాను.అత్యాశ అత్యంత ప్రమాదకరం! నూరున్న వాడు వెయ్యి కావాలంటాడు. వెయ్యి ఉన్నవాడు లక్ష కావాలంటాడు. లక్ష ఉన్నవాడు కోటి కావాలంటాడు. కోటి ఉన్నవాడు ఆ పైన కావాలంటాడు. దానికి అంతూ పొంతూ ఉండదు.’ అని బాధపడ్డాడు తల మీద చక్రం తిరుగుతున్న వ్యక్తి.‘మనకు రాగిరేకులను ఇచ్చి, ముందు దొరికిన రాగితోనే సంతృప్తి చెందండన్నాడు భైరవానంద యోగి. వినలే దెవరూ. నేను అసలు వినలేదు. ఆశ పరుగుదీసింది.
గోతిలో పడ్డాను. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం?’ అన్నాడతనే మళ్ళీ. మిత్రుడతన్ని జాలిగా చూశాడు.‘నాకీ చక్రబాధ తప్పదు. నాలాగే ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చేవరకు నాకు దీని నుండి విముక్తి లేదు. నువ్వెందుకు ఇక్కడ? వెళ్ళిరా, అవంతీ నగరానికి చేరుకుని హాయిగా ఉండు.’ అన్నాడు. తల మీద తిరుగుతున్న చక్రాన్ని అదుపు చేయలేక, దానితో పాటే తిరగనారంభించాడతను. గిర్రుగిర్రున తిరుగుతున్న మిత్రుణ్ణి చూసి, కన్నీళ్ళతో కదిలాడక్కణ్ణుంచి అతని మిత్రుడు.’’ముగించాడు న్యాయాధికారి.మణిభద్రుడు అప్పుడిలా అన్నాడు.‘‘మీరు చెప్పినట్టుగానే మా ఇంటి క్షురకుడు, నాకు బంగారం ఎలా లభించిందీ పూర్తిగా తెలుసుకోలేదు. కనబడిన భిక్షువు బుర్ర బద్దలు కొట్టాడు. వారంతా బంగారు నాణెలుగా మారిపోతాడనుకున్నాడు. మారలేదు. పైగా మరణించారు. ఆఖరికి హంతకుడయి, శిక్షను అనుభవిస్తున్నాడు. అందుకే అంటారు, ఏ పని చేయడానికి అయినా కాస్తంత ముందు వెనుకలు ఆలోచించాలని.’’‘‘అవును, ముందు వెనుకలు ఆలోచించకపోతే మొదటికే మోసపోతాం.’’ అన్నాడు న్యాయాధికారి. సభ ముగిసింది.-ఇలా అపరీక్షిత కారిత్వాన్ని ముగించాడు విష్ణుశర్మ.‘‘రాకుమారులారా! నేటితో పంచతంత్రం పూర్తి అయింది.’’ అన్నాడు.
రాకుమారులు లేచి నిలుచున్నారు. చేతులు జోడించి నమస్కరించారు.‘‘గురుదేవా! మీరు చెప్పిన కథలతో, బోధలతో మేము విజ్ఞానవంతులమయ్యాం. మాకిప్పుడు మంచి చెడులూ, మాయమర్మాలూ అన్నీ తెలుసు. ప్రజలను ఎలా పాలించాలో, శత్రువులను ఎలా తుదముట్టించాలో అర్థమయింది. ధన్యులమయ్యాం.’’ అన్నారు. ఆనందించాడు విష్ణుశర్మ.‘‘చెప్పండి గురుదేవా, గురుదక్షిణగా మీకేం కావాలో చెప్పండి. సమర్పించుకుంటాం.’’ రాకుమారులు వేడుకున్నారు.సన్నగా నవ్వాడు విష్ణుశర్మ. ఇలా అన్నాడు.
‘‘రాకుమారులారా! నేనీ విద్యను మీకు అమ్మలేదు. అందించానంతే! మీరందుకున్నారు. అదృష్టవంతుణ్ణి. దేవుడి దయవల్ల నాకు ఏ లోటూ లేదు. హాయిగా ఆనందంగా ఉన్నాను. కాకపోతే నాకో కోరిక ఉంది. దాన్ని నెరవేర్చాలి మీరు. నెరవేరుస్తామని ప్రమాణం చెయ్యాలి.’’‘‘తప్పకుండా! చెప్పండి గురుదేవా’’‘‘ప్రజలను మీరు కంటికి రెప్పలా కాపాడాలి. తల్లిదండ్రులనూ, గురువునూ ప్రత్యక్ష దైవాల్లా పూజించాలి. ధర్మాన్నీ, న్యాయాన్నీ ఏనాడూ వీడక, నా శిష్యులుగా, భావితరం రారాజులుగా మీరు రాణించాలి. రాణిస్తారు కదూ!’’ అడిగాడు విష్ణుశర్మ.‘‘మీ కోరిక నెరవేరుస్తాం. ఇదే మా ప్రతిజ్ఞ.’’ అన్నారు రాకుమారులు. ప్రమాణాలు చేశారు. విష్ణుశర్మ దగ్గర సెలవు తీసుకున్నారు. రథాలెక్కి రాజధానికి బయల్దేరారు.