దొరికిన దొంగ
ఒక ఊరిలో ఒకతను ఉండేవాడు. అతడు చాలా తిండిపోతూ . ఎప్పుడూ తిండి మీదే ధ్యాస పెట్టేవాడు. అతనికి పెళ్ళి అయింది. ఒకసారి దసరా పండుగకూ అతని అత్తగారు వాళ్ళ ఇంటికి పిలిచారు. ముందుగా భార్యను పంపాడు. రేపు పండుగ అనగా అతను కూడా బయలుదేరాడు.
అతడు అత్తగారి ఇంటికి వెళ్ళేసరికి తలుపు వేసి ఉంది. వెనుక నుండి వెళ్లాలని అనుకుని, వెళ్ళాడు. అక్కడ వంటగది ఉంది. తన భార్య అత్తతో కలిసి గారెలు చేయడం కోసమని పిండిని తయారు చేస్తున్నారు. అప్పుడతడు తన మనసులో "నెప్పుడు వచ్చినా మా అత్త నాకు పది గారెలు మాత్రమే పెడుతుంది. తర్వాత అడిగితే అయిపోయాయి అంటుంది. అసలు ఆమె ఎన్ని గారెలు చేస్తుందో తెలుసుకోవాలి" అనుకుని తలుపు తట్టాడు.
లోపల వాళ్ళు నూనెలో గారెలు వేసినపుడు శబ్దం రావడంతో “ఒకటి... రెండు... మూడు” అంటూ లెక్కపెట్టుసాగాడు. అలా అతడు మొత్తం వంద గారెలు చేసినట్లుగా లెక్కపెట్టుకున్నాడు. తరువాత ముందుగా వెళ్ళి తలుపు తట్టాడు. అత్త, భార్య అతన్ని బాగా ఆదరించారు. మర్యాద చేశారు. ఆ రాత్రి మంచి భోజనం పెట్టారు.
మరునాడు పండుగ. మధ్యాహ్నం కాగానే అందరూ భోజనానికి కూర్చున్నారు. ఎప్పటిలాగే అత్త అతనికి పది గారెలు పెట్టింది. అవి చాలా రుచిగా ఉండడంతో కొద్దిసేపట్లోనే తినేశాడు. అప్పుడు అత్త "అల్లుడు గారూ ఇంకో రెండు గారెలు పెట్టమంటారా?" అని అడిగింది. అందుకు అల్లుడు, "రెండేమిటి? ఇరవై పెట్టినా తింటాను. మీ ఇంట్లో ఇంకా తొంభై గారెలు ఉన్నాయి కదా!" అన్నాడు.
అల్లుని మాటలు విన్న అత్త చాలా ఆశ్చర్యపోయింది. తాము వంద గారెలు చేసిన విషయం అల్లునికి ఎలా తెలిసిందో ఆమెకు అర్థం కాలేదు. తన అల్లునికి మంత్రశక్తి ఉందని అనుకుంది. అందుకే తాము వంద గారెలు చేసిన విషయం తెలుసుకున్నాడని అనుకుంది. సంతోషపడింది. తన అల్లుని దగ్గర మహిమలు ఉన్నాయని ఊరంతా ప్రచారం చేసింది. ఆమె చేసిన పనికి అల్లుడు భయపడ్డాడు. ఎంతోమంది వచ్చి అల్లునికి తమ బాధలు చెప్పుకొని వాటిని పోగొట్టమని అడగసాగారు. వాళ్ళకు తన మాటకారితనంతో ఏదో ఒకటి చెప్పి పంపినాడు.
ఈ విషయం రాజుగారికి తెలిసింది. రాజుగారి ఇంట్లో ఉన్న బంగారాన్ని ఎవరో దొంగ ఎత్తుకుపోయాడు. రాజు అల్లుడిని పిలిచి "ఆ దొంగ ఎవరో వారం రోజులలోపల చెప్పాలి. లేదంటే నీ తల ఎగిరిపోతుంది" అని చెప్పాడు. అల్లునికి అప్పుడే ప్రాణాలు పోయినంత పనైంది. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఆ బంగారాన్ని దొంగిలించిన దొంగ అల్లుడ్ని అనుసరించసాగాడు. రాజుకు తన పేరు చెబుతాడేమోనని దొంగ భయపడసాగాడు. ఆ దొంగ పేరు “దొరకడు”.
ఒకరోజు రాత్రి పడకగదిలో అల్లుడు భార్యతో మాట్లాడుతున్నాడు. దొంగ వాళ్ళ మంచం క్రింద దూరి వాళ్ళ మాటలు వింటున్నాడు. "ఆ దొంగ ఎవరో మీరు కనిపెట్టారా?" అని అడిగింది భార్య. అందుకు అల్లుడు విసుగ్గా "వాడా? వాడు దొరకడు" అన్నాడు. తానిక దొంగను కనుక్కోలేననే ఉద్దేశంతో.
ఆ మాటలు విన్న దొంగ వణికిపోయాడు. అల్లునికి తన పేరు తెలిసిపోయిందని అనుకుని బయటకి వచ్చి అల్లుని కాళ్లమీద పడ్డాడు. క్షమించమని వేడుకున్నాడు. రాజుకు తన పేరు చెప్పవద్దని చెప్పి తాను దొంగిలించిన బంగారాన్ని అల్లుడికి ఇచ్చి వెళ్ళిపోయాడు. అల్లుడు ఆ బంగారాన్ని రాజుకు ఇచ్చాడు. రాజు ఎన్నో కానుకలతో అల్లుడిని గౌరవించాడు.