దానధర్మాలు
విదర్భ దేశాన్ని విష్ణుదత్తుడు పరిపాలించేవాడు. విష్ణుదత్తుడు ప్రజలను కన్నబిడ్డల వలే చూసే వాడు. ప్రజలకు ఏ కష్టనష్టాలొచ్చినా తీర్చేవాడు అంతకుమించి విష్ణు భక్తుడు. విపరీతంగా దానధర్మాలు చేసేవాడు. విష్ణుదత్తుడి దానధర్మాలకు కోశాగారంలో ఉన్న ధనమంతా కరిగిపోతుంది. ఇది గ్రహించిన మంత్రి విశ్వత్సేనుడుదానధర్మాలను ఆపుచేయమని, దానినల్ల ప్రజలంతా సోమరిపోతుల్లా తయారైపోతున్నారని చెప్పి చూశాడు. కాని విష్ణుదత్తుడు మంత్రి మాటలను పెడచెవిన పెట్టాడు.
ఒకరోజు విష్ణు దత్తుడు కొలువు తీరి వుండగా ఓ బ్రాహ్మణుడు అతని వద్దకు వచ్చి తను తెచ్చిన ఓ కుండకు సరిపడినన్ని వరహాలిమ్మనమని అడిగాడు. ఆ కుండకు ఓ పక్క చిల్లు వుంది.
ఇది గ్రహించని విష్ణుదత్తుడు కుండలో వరహాలు వేసి అతనికివ్వబోయాడు. కాని అతడికివ్వబోయే లోపే కుండలోని నాణాలన్నీ చిల్లునుంచి కిందకి జారిపోయాయి. ఇలా పలుసార్లు జరిగింది.
విష్ణుదత్తుడు జరిగింది తెలుసుకునే లోపే బ్రాహ్మణుడి రూపంలో వున్న విశ్వత్సేనుడు"నన్ను మన్నించండి' అన్నాడు.విష్ణుదత్తుడు ఆశ్చర్యపోతూ విషయం అడిగాడు.
అప్పుడు విశ్వత్సేనుడు "రాజా చిల్లుకుండలో ఎన్ని వరహాలు వేసినా ఎలా తరిగి పోతుందో. అలాగే మితిమీరిన మీ దాన ధర్మాలవల్ల కోశాగారంలో ఉన్న డబ్బు సరిపోదు, దానధర్మాలు.
చేసుకుంటూ పోతే కొండలు కూడా కరిగిపోతాయి. మీ దాన ధర్మాల అలవాటుని ఆసరాగాతీసుకుని ప్రజలు సోమరిపోతుల్లా అయిపోయారు. కష్టపడి పనిచేసే వారంతా పనులు..మానేసి మీరిచ్చే దాన ధర్మాల కోసం పోటీలు పడుతున్నారు" అన్నాడు.
విషయం తెలుసుకున్న విష్ణుదత్తుడు అప్పటినుంచి అడిగిన వారందరికీ దానధర్మాలు చేయడం మానేసి అవసరం వున్న వారికి మాత్రమే సహాయపడుతూ మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు.