చిత్రాంగుడి కథ
చల్లగా ఉంది ఆ రోజు. సరదాగా కబుర్లలో పడ్డాయి, ఎలుక, తాబేలు, కాకి. ఎలుక చెప్పిన మాటకి తాబేలూ, కాకీ పడి పడి నవ్వాయి. అంతలో అటుగా పరుగున లేడి ఒకటి వచ్చింది. చెట్టు చాటుగా దాగుంది. దాన్ని వేటాడేందుకు బోయ కూడా పరుగున వచ్చాడక్కడికి. అయితే చాటున దాగున్న లేడి కనిపించలేదతనికి. వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. లేడినీ, బోయనీ మిత్రులు ముగ్గురూ ఎలుకా, తాబేలూ, కాకీ గమనించాయి. పరుగున వచ్చిన లేడిని చూసి అవి కూడా చాటుకి తప్పుకున్నాయి. ఏదో ప్రమాదం పొంచి ఉన్నదనుకున్నాయి. అనుకున్నట్టుగానే బోయ రావడాన్ని చూశాయవి. గుండెలు గుప్పిట్లో పెట్టుకుని కూర్చున్నాయి. బోయ అటూ ఇటూ చూసి, అసహనంగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాయి. చాటు నుంచి తప్పుకున్నాయి. బయటపడ్డాయి. లేడిని పలకరించాయి.‘‘ఎవరు నువ్వు?’’ అడిగాయి. చాటు నుంచి తప్పుకుని వచ్చింది లేడి. చెప్పసాగిందిలా.‘‘నా పేరు చిత్రాంగుడు. నా దురదృష్టం, వేటగాడి కళ్ళల్లో పడ్డాను. కాపాడుకునేందుకు పరిగెత్తుకుని వచ్చాను. చూశారుగా, ఇదిగో ఇలా దాగుని నన్ను నేను రక్షించుకున్నాను.’’‘‘మంచిపని చేశావు’’ మెచ్చుకున్నది మిత్రబృందం. మనసారా నవ్వాయి. వాటి నవ్వును చూసి, తెరిపిన పడింది లేడి. ఇలా అంది.‘‘దయచేసి, మీరు నాతో స్నేహం చేస్తారా? చేస్తే చెప్పండి! మీతో పాటు నేనూ ఈ అడవిలో ఉండిపోతాను.’’హిరణ్యకుడు, మంథరుడు, లఘుపతనకుడు ‘ఏమంటావు’ అన్నట్టుగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. తర్వాత ఒకరికొకరు సైగలు చేసుకున్నారు. ఆ సైగలకు అర్థం చిత్రాంగుడి అభ్యర్థనను ఒప్పుకోవడమే!‘‘నువ్వు మంచివాడివని నిన్ను చూస్తూనే తెలిసింది. దానికేం భాగ్యం. నీతో తప్పకుండా స్నేహం చేస్తాం. ఈ రోజు నుంచీ మేం ముగ్గురమే కాదు, మనం నలుగురం స్నేహితులం. సరేనా’’ అన్నాడు మంథరుడు. ‘సరే’నని ఆనందించాడు చిత్రాంగుడు.రోజులు గడుస్తున్నాయి.
ఒకరోజు మేతకు వెళ్ళిన చిత్రాంగుడు తిరిగి రాలేదు. ఆ సమయానికి తిరిగి వచ్చేయాలి. రాలేదంటే...మిత్రబృందం అనుమానించింది.‘‘కొంపదీసి ఏదేని ప్రమాదంలో చిక్కుకున్నాడా?’’ భయపడ్డాడు మంథరుడు.‘‘ఏం జరిగిందో చూసి వద్దామంటే నేను తాబేలుని. నా సంగతి మీకు తెలియంది కాదు. వెళ్ళేందుకు, వచ్చేందుకు నాకు చాలా సమయం పడుతుంది. హిరణ్యకుడు నాకంటే నయంకాని, ఈ వేళలో అడవిలో ఒంటరిగా ఓ ఎలుక ప్రయాణించడం ప్రమాదకరం. అందుకని...’’ ఆగాడు మంథరుడు. లఘుపతనకుడి వైపు నువ్వే దిక్కు అన్నట్టుగా చూశాడు.‘‘మిత్రులు బలహీనతలు చెప్పుకుని బాధపడకూడదు. బలవంతుని ఆజ్ఞాపించాలి. అందులో తప్పులేదు.’’ అన్నాడు లఘుపతనకుడు.‘‘కాకిని కదా! ఇట్టే వెళ్ళి అట్టే వస్తాను. కంగారు పడకండి. జాగ్రత్త’’ అని హెచ్చరించి రివ్వున గాలిలోకి ఎగిరిపోయాడు లఘుపతనకుడు. ఆ మూలా ఈ మూలా వెదికాడు. చిత్రాంగుడు కనిపించలేదెక్కడా. ఏమయ్యాడబ్బా? అనుకుంటూ వెదుకుతుంటే...అడిగో...అప్పుడు కనిపించాడు చిత్రాంగుడు. వలలో చిక్కుకుని కనిపించాడు. అయ్యయ్యో! అనుకున్నాడు లఘుపతనకుడు. ఏం చేయాలిప్పుడు అనుకున్నాడు. ముందు చిత్రాంగుణ్ణి పలకరించేకంటే వెళ్ళి హిరణ్యకుణ్ణి వెంటపెట్టుకుని రావడం అవసరం అనుకున్నాడు. ఎగిరి వచ్చి మంథరుడు-హిరణ్యకుల ముందు వాలాడు.
‘‘చిత్రాంగుడు కనిపించాడా’’ అడిగారు.‘‘కనిపించాడు. అడవిలో వలలో చిక్కుకున్నాడు.’’ చెప్పాడు లఘుపతనకుడు.‘‘పద’’ అంటూ హిరణ్యకుణ్ణి వీపు మీద ఎక్కించుకుని మళ్ళీ ఆకాశంలోకి ఎగిరాడు. ప్రాణాపాయం తప్పదనుకుని విలపిస్తూన్న చిత్రాంగుని ముందు వాలాడు. హిరణ్యకుణ్ణి చూస్తూనే ప్రాణం లేచి వచ్చినట్టుగా ఆనందించాడు చిత్రాంగుడు.‘‘అసలు ఏం జరిగిందంటే...’’ అని ఏదో చిత్రాంగుడు చెప్పబోతుంటే వద్దని వారించి, వల తాళ్ళను పట పటా కొరకసాగాడు హిరణ్యకుడు. కాస్సేపటికే చిత్రాంగుణ్ణి విడిపించాడు.‘‘పదండి, పదండి’’ లఘుపతనకుడు తొందర చేయడంతో అక్కణ్ణుంచి గబగబా బయల్దేరారంతా. తిరిగి వస్తుంటే చెప్పసాగాడిలా చిత్రాంగుడు.‘‘ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలా వలలో చిక్కుకుంటున్నాను.’’‘‘ఇంతకు ముందు కూడా చిక్కుకున్నావా’’ అడిగాడు లఘుపతనకుడు.‘‘చిక్కుకున్నాను. ఆరు నెలల వయసప్పుడోసారి చిక్కుకున్నాను. నేను వలలో చిక్కుకోవడం చూసి భయపడి గుంపులో లేళ్ళన్నీ అక్కణ్ణుంచి పారిపోయాయి. దిక్కులే కపోయింది. వేటగాడొచ్చాడు. వలలో నుంచి తప్పించి, నన్ను భుజమ్మీద వేసుకుని బయల్దేరాడు. రాజాంతఃపురానికి తీసుకొచ్చాడు. రాకుమారునికి నన్ను కానుకగా ఇచ్చేశాడు. నన్ను చూసి రాకుమారుడు ముచ్చటపడ్డాడు. ప్రేమగా చూసుకోసాగాడు. నేను ఆడింది ఆటగా పాడింది పాటగా జరిగింది. ఒకరోజు రాకుమారుని పడకగది పక్కగా వసారాలో పడుకున్నాను. అంతలో మెరుపు మెరిసింది. ఉరుము ఉరిమింది. సన్నగా వాన ప్రారంభమయింది. ఆ వాన చూస్తూంటే నాకు నా చిన్నతనం, నా చిన్ననాటి స్నేహితులు, లేళ్ళ గుంపూ గుర్తొచ్చింది. కన్నీళ్ళొచ్చాయి.‘హాయిగా ఆనందంగా సాటి లేళ్ళతో కలసి అడవిలో ఎప్పుడు తిరుగుతానో! మళ్ళీ నాకు ఆ అదృష్టం ఉందో లేదో’ అనుకున్నాను. ఆ మాటలు మనసులో అనుకుంటే ఏ గొడవా ఉండేది కాదు, బయటికే అనేశాను.
ఆ మాటలు విన్నాడు రాకుమారుడు. మనిషి మాట్లాడినట్టుగా నేను మాట్లాడడం విని ఆశ్చర్యపోయాడతను. వెంటనే ఆస్థాన జ్యోతిష్కుణ్ణి పిలిపించాడు.జరిగింది చెప్పాడు.‘జంతువులు మనిషిలా మాట్లాడడం శుభమా? అశుభమా?’ అడిగాడు.‘అశుభమే! అందులో అనుమానం లేదు. రాజ్యానికే అరిష్టం. వెంటనే జపాలూ తపాలూ చేయండి’ చెప్పాడు జ్యోతిష్కుడు. మనిషిలా మాట్లాడిన నన్ను రాజ్యంలో ఉంచకూడదంటూ అడవిలో వదిలేయమన్నాడు. దాంతో నన్ను అడవిలో వదిలేశారు. అదిగో అప్పుడు వేటగాడి కంట నేను పడడం, పరిగెత్తుకుని రావడం, దాగోవడం, మీరు స్నేహితులు కావడం...ఇవన్నీ జరిగాయి.’’ చెప్పుకొచ్చాడు చిత్రాంగుడు.‘‘నాటికి నేడు మళ్ళీ వలలో చిక్కుకున్నావన్నమాట.’’ అన్నాడు లఘుపతనకుడు.‘‘అవును! ఏ రోజు ఏం జరుగుతుందో తెలియట్లేదు.’’ బాధపడ్డాడు చిత్రాంగుడు.చిత్రాంగుణ్ణి తీసుకుని వస్తామని చెప్పి వెళ్ళిన లఘుపతనకుడూ, హిరణ్యకుడూ ఎంత సేపటికీ రాకపోయేసరికి, కంగారు పడి వారిని వెతుక్కుంటూ బయల్దేరాడు మంథరుడు. చేతనయింతగా గబగబా నడవసాగాడు. అలసిపోతున్న క్షణంలో కన్పించింది మిత్రబృందం. ముగ్గురూ క్షేమంగా కనిపించడంతో ముచ్చటేసింది మంథరుడికి. ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నాడు.
‘‘నువ్వెక్కడికి బయల్దేరావు’’ అడిగాడు హిరణ్యకుడు.‘‘మీ కోసమే బయల్దేరాను. ఎంతకీ రాకపోయేసరికి కంగారు పడ్డాను. ఏమయ్యారేమోనని భయపడ్డాను. క్షేమంగా కనిపించారు. ఆనందంగా ఉందిప్పుడు.’’ అన్నాడు మంథరుడు.‘‘దీన్నే తొందరపాటుతనం అంటారు. ముందు వెనుకలు ఆలోచించకుండా, మనం ఎక్కడున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం అన్నది తర్కించుకోకుండా బయల్దేరడం తప్పు. అక్కడయితే చెరువు ఉంది. ప్రమాదం అనిపిస్తే చెరువులోకి దూకేస్తావు. ఇప్పుడిక్కడ ఈ అడవిలో ఏం ఉంది? అంతా నేలే! ప్రమాదం కాదూ? పైగా పరిగెత్త గలవా అంటే అది నీవల్ల కాదు. తప్పు చేశావు. రాకూడదిలా’’ కోపగించుకున్నాడు హిరణ్యకుడు.‘‘అయిపోయింది కదా, ఊరుకో’’ అన్నాడు చిత్రాంగుడు. మిత్రుల మధ్య సయోధ్య కోసం సర్దిజెప్పజూశాడు. అంతలో గోల గోల చేశాడు లఘుపతనకుడు.‘‘పరిగెత్తండి! పరిగెత్తండి! అడిగో వేటగాడొస్తున్నాడు.’’తిరిగి చూశారంతా. లఘుపతనకుడు చెప్పింది నిజమే! చిత్రాంగుణ్ణి వలలో బంధించిన వేటగాడే తమని వెతుక్కుంటూ పెద్ద పెద్ద అంగలతో వస్తున్నాడు. లేడి పరిగెత్తి పారిపోయింది. ఎలుక దగ్గరల్లోని కలుగుని చూసి అందులోకి దూరిపోయింది. పాపం తాబేలే! అటు పరుగెత్తలేక, ఇటు ఎందులోనూ దూరలేక దిక్కులు చూడసాగింది. వేటగాడు వచ్చేశాడు. దగ్గరగా వచ్చేశాడు. ఏ జంతువూ కనిపించలేదతనికి. తాబేలు కనిపించింది. అందుకున్నాడు దాన్ని. ఇదయినా దొరికిందనుకున్నాడు. వలలో బంధించి, భుజాన్న వేసుకుని ఇంటి దారి పట్టాడు.భుజాన్న వేలాడుతున్న మంథరుణ్ణి చూస్తూ వేటగాణ్ణి అనుసరించింది మిత్రబృందం. తాబేలుని రక్షించడం ఎలా అన్నది ఆలోచించసాగారు. ఆలోచనేదీ ఓ కొలిక్కి రాకపోయేసరికి, లఘుపతనకుడూ, చిత్రాంగుడూ కళ్ళు చెమర్చుకున్నారు. దుఃఖించసాగారు.‘‘ఎందుకేడుస్తున్నారు?’’ లోగొంతులో అడిగాడు హిరణ్యడు.‘‘ఇంకేముంది? అయిపోయింది. మంథరుడు మనం దూరం అయిపోయాడు.’’ అన్నారిద్దరూ.‘‘దూరమేమీ కాలేదు.
ఆలోచించండి! వేటగాడు ఈ అడవి దాటేలోపే మనం ఏదయినా చేసి, మంథరుణ్ణి కాపాడాలి.’’ అన్నాడు హిరణ్యకుడు.‘‘ఓ గండం గట్టెక్కిందనుకుంటే ఇప్పుడిదో గండం. మా బుర్రలు పనిచేయడం లేదు. నువ్వే ఆలోచించు.’’ అన్నారిద్దరూ. వాళ్ళ మాట పూర్తి కాకముందే హిరణ్యకుడికి ఆలోచన తట్టడంతో ఆగిపోయాడు. హిరణ్యకుడు ఆగడంతో లఘుపతనకుడూ, చిత్రాంగుడూ ఆగిపోయారు. వారంతా అలా నిలిచిపోవడంతో వేటగాడి భుజాన్న వేలాడుతున్న మంథరుడు ప్రాణాల మీద ఆశలు వదులుకున్నాడు. మిత్రబృందం వెన్నంటి వస్తోంటే తనని ఎలాగయినా కాపాడుతారనుకున్నాడు. రావట్లేదంటే, ఆశలు వదులుకున్నాడు.‘‘ఒక ఉపాయం తట్టింది.’’ చెప్పాడు హిరణ్యడు.‘‘తొందరగా చెప్పు’’‘‘వేటగాడికి కనిపించకుండా మన చిత్రాంగుడు ముందు చెరువుగట్టుకు చేరుకుని కళ్ళు తేల వేసి, కాళ్ళు చాచి చచ్చినట్టు పడి ఉండాలి. అంటే చచ్చినట్టు నటించాలి. అప్పుడు నువ్వు, లఘుపతనకా! నీ సంగతే చెబుతున్నాను, నువ్వు వెళ్ళి, చిత్రాంగుడు కళ్ళు పొడుస్తున్నట్టుగా నటించాలి. ఆ దృశ్యం వేటగాడు చూస్తే, చిత్రాంగుడు చనిపోయాడనుకుని, అందుకే నువ్వు కళ్ళు పొడుస్తున్నావనుకుంటాడు. లేడి కోసం పరిగెత్తుకుని వస్తాడు.
లేడిని అందుకోవాలంటే, దాన్ని తీసుకుని వెళ్ళాలంటే భుజమ్మీది తాబేలును కిందకు దించాలి. మంథరుణ్ణి దించుతాడప్పుడు. వేటగాడు దించడమే ఆలస్యం, నేను వల తాళ్ళను గబగబా కొరికేసి, మంథరుణ్ణి విడిపిస్తాను. విడీవిడిపించగానే మంథరుడు చెరువులోకి దూకేస్తాడు. నేను కలుగులోకి దూరేస్తాను. మమ్మల్ని ఓ కంట కనిపెట్టిన లఘుపతనకుడు అరుస్తూ చిత్రాంగుడు మీద నుంచి ఎగిరిపోతాడు. ఆ అరుపే హెచ్చరికగా చిత్రాంగుడు లేచి పరుగందుకుంటాడు. ఎలా ఉంది ఆలోచన?’’ అడిగాడు హిరణ్యకుడు.‘‘అద్భుతం’’ అన్నారు మిత్రులు. హిరణ్యకుని ఆలోచనని తూచా తప్పకుండా అందరూ పాటించారు. మంథరుడు చెరువులోకి దూకేశాడు. హిరణ్యకుడు కలుగులోనికి దూరేశాడు. చిత్రాంగుడు చెంగు చెంగున పరిగెత్తి పారిపోయాడు. లఘుపతనకుడు ఎగిరిపోయాడు.జరిగిందానికి వేటగాడు ఆశ్చర్యపోయాడు. చిరిగిన వలలో చేతులుంచి భోరుమన్నాడు. కనీసం తాబేలు కూడా మిగల్లేదని తలపట్టుకున్నాడు.