చిత్రగ్రీవుడి తెలివి



చిత్రగ్రీవుడు చెప్పిన మేరకు పావురాలన్నీ ఒక్కసారిగా పైకి లేచాయి.వలతో పాటుగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. జరిగిందంతా మొదటి నుంచీ గమనిస్తున్న లఘపతనకుడు అనే కాకి, ఈ పావురాలు ఎక్కడికివెళ్తున్నాయి? వల నుంచి ఎలా తప్పించుకుంటాయి? ఇదేదో చూడదగ్గదే అనుకుని అది కూడా ఆకాశంలోకెగిరి, పావురాలను అనుసరించింది.‘‘ఇలా ఎంత దూరం ఎగరాలి? ఎక్కడికని ఎగరాలి’’ చిత్రగ్రీవుణ్ణిప్రశ్నించాయి పావురాలు.‘‘గండకీనది వరకూ ఎగరాలి. దాని ఒడ్డున విచిత్రవనమనే అడవి ఉంది. అక్కడికి మనం చేరు కోవాలి.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.‘‘అక్కడికి ఎందుకు’’ అడిగింది ఓ పావురం.‘‘ఎందుకంటే...అక్కడ నా మిత్రుడు ఉన్నాడు. హిరణ్యకుడు అని ఎలుకల రాజతను. అతను మనల్ని కాపాడతాడు. లోకంలో తల్లీ, తండ్రీ, స్నేహితుడూ ఈ ముగ్గురే కాపాడతారు. మిగిలిన వారు కాపాడ గలిగే అవకాశం ఉందికాని, వారికి మనతో అవసరం ఉండాలి. ఉంటేనే కాపాడతారు. లేకపోతే కాపాడరు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.‘‘నిజమే’’ అన్నాయి పావురాలు.‘‘హిరణ్యకుణ్ణి కలిస్తే, అతను ఈ వలను కొరికి ముక ్కలు చేస్తాడు. మనం అప్పుడు తప్పించుకోవచ్చు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.‘‘అయితే ఇంకేం! పదండి, పదండి.’’ అన్నాయి పావురాలు. ఎగరడంలో వేగాన్ని పెంచాయి. వారిని వెన్నంటి వస్తున్న లఘుపతనకుడు కూడా వేగాన్ని పెంచాడు. గండకీనది కనిపించింది. విచిత్రవనం కూడా కనిపించింది. ఒక్కసారిగా పావురాలన్నీ కిందికి దిగాయి. హిరణ్యకుడి కలుగు దగ్గర వాలాయి. రెక్కల టపటపలూ, పావురాల గోలకి కలుగులోని హిరణ్యకుడు ప్రమాదమేదో ముంచుకొచ్చిందని భయపడ్డాడు. కలుగులోనికి మరింతగా వెనక్కి జరిగాడు. కూడదీసుకుని కూడదీసుకుని కలుగు ముందుకు వచ్చాడు చిత్రగ్రీవుడు.‘‘మిత్రమా’’ అని పిలిచాడు.

పరిచయమయిన గొంతులా అనిపించి కొంచెం ముందుకు వచ్చాడు హిరణ్యకుడు.‘‘నేను మిత్రమా! నీ మిత్రుణ్ణి. చిత్రగ్రీవుణ్ణి. నీ సహాయం కోరి వచ్చాను. దయచేసి బయటికి రా’’ అన్నాడు చిత్రగ్రీవుడు. అతని మాట పూర్తికానే లేదు. ఆనందంగా కలుగులోంచి బయటకు వచ్చాడు హిరణ్యకుడు. చిత్రగీవుణ్ణి చూసి ఆనందించాడు.‘‘ఎన్నాళ్ళకెన్నాళ్ళకు మిత్రమా! నిన్ను చూడ్డం నాకు చాలా ఆనందంగా ఉంది.’’ అన్నాడు. అంతలోనే మిత్రుడు వలలో చిక్కుకుని ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.‘‘ఇదేమిటిది? వలలో చిక్కుకున్నావు’’ అనడిగాడు. సమాధానం చెప్పే లోపే చిత్రగ్రీవుణ్ణి వల నుండి తప్పించేందుకు ప్రయత్నించాడు. వలను కొరకసాగాడు.‘‘ఆగాగు! నన్ను విడిపించడం కాదు, ముందు నావాళ్ళను విడిపించు. తర్వాత నన్ను విడిపించవచ్చు’’ అన్నాడు చిత్రగ్రీవుడు. రాజుగా తోటి వారిని కాపాడడం ప్రథమ కర్తవ్యం అనుకున్నాడతను.‘‘పూర్వజన్మలో ఏ పాపం చేశామో! అందరం ఇలా వలలో చిక్కున్నాం. పాపం, పుణ్యం కాదుగాని, బుద్ధిగా ప్రవర్తించలేకపోయాం. ఫలితంగా శిక్ష అనుభవిస్తున్నాం’’ అన్నాడు చిత్రగ్రీవుడు. వల కొరక్కుండా ఆలోచిస్తోన్న హిరణ్యకుణ్ణి చూశాడు.

‘‘ఏమిటాలోచిస్తున్నావు మిత్రమా’’ అడిగాడు.‘‘ఏం లేదు మిత్రమా! నా పళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. నొప్పెడుతున్నాయి. మొత్తం వలంతా కొరకడం అంటే కష్టమనిపిస్తోంది. ముందు నిన్ను విడిపించనీ! తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం.’’ అన్నాడు హిరణ్యకుడు. చిత్రగ్రీవుడుకి హిరణ్యకుడి మాటలు నచ్చినట్టు లేదు. అదోలా చూశాడతన్ని.‘‘మిగిలిన పావురాలను కూడా విడిపిస్తాను. అనుమానం లేదు. కాకపోతే చెప్పానుగా! పళ్ళు ఇబ్బంది పెడుతున్నాయని. నొప్పి అని. ముందు నిన్ను విడిపించనీ’’ అని చిత్రగ్రీవుడి దగ్గరి వల తాళ్ళను కొరికే ప్రయత్నంలో పడబోయాడు హిరణ్యకుడు. చిత్రగ్రీవుడు అతనికి అందక వెనక్కి జరిగాడు. ఆశ్చర్యంగా చూశాడు హిరణ్యకుడు.‘‘నీకు నొప్పి కలగనంత వరకూ నన్ను తప్పించి ఎంత మందిని నువ్వు విడిపించగలిగితే అంత మందినీ ముందు విడిపించు. అందరూ విడుద లయిన తర్వాతే నా గురించి నువ్వు ఆలోచించు. అంతేకాని, నన్ను ముందు విడుదల చేసి, మిగిలిన పావురాల సంగతి తర్వాతంటే భావ్యం కాదు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు. నవ్వాడు హిరణ్యకుడు.‘‘నువ్వు చెప్పేది చిత్రంగా ఉంది మిత్రమా! తనకు మాలిన ధర్మం అంటారే అలా ఉంది నువ్వు మాట్లాడేది. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో! తర్వాత మిగిలిన వారి సంగతి ఆలోచించవచ్చు. అలా కాదు, వారి సంగతే ముందు ఆలోచించాలి, తర్వాతే నా సంగతి అంటావా, అప్పుడు నీ అంతటి మూర్ఖుడు ఇంకొకడు లేడనుకుంటాను. రాజుగా నువ్వు క్షేమంగా ఉంటేనే కదయ్యా, ఇతరుల క్షేమాన్ని పట్టించుకునేది. నువ్వే క్షేమంగా లేనప్పుడు వాళ్ళెవరు? నువ్వెవరు?’’ ప్రశ్నించాడు హిరణ్యకుడు.‘‘నిజమే! కాని, నా వాళ్ళంతా కష్టంలో ఉండడాన్ని నేను భరించలేను. సాటి వారు కష్టంలో ఉంటే వారిని ఆదుకోవాలి. అందుకు ప్రాణత్యాగం చేసినా తప్పు లేదు. నేనూ వాళ్ళూ ఒకటే! వాళ్ళు లేకుండా నేను లేను. నేను లేకుండా వాళ్ళు లేరు.

ఆపదలో ఉన్న నా వాళ్ళను నేను రక్షించుకోలేనప్పుడు నాకీ రాచరికం ఎందుకు? ఎవర్ని ఉద్ధరించడానికి?’’ అన్నాడు చిత్రగ్రీవుడు. పావురాలన్నీ గొప్పగా చూశాయి, తమ రాజుని. రాజంటే చిత్రగ్రీవుడనుకున్నాయి.‘‘ఏదో రోజు అందరం పోయే వాళ్ళమే! ఈ శరీరం అశాశ్వితం. అది తెలుసుకోవాలి ముందు. తెలుసుకునిఉన్న నాలుగు రోజులూ నాలుగు కాలాల పాటు నిలిచే పనులు చెయ్యాలి. తోటివారికి సాయం చెయ్యాలి. అందుకని చెబుతున్నాను. మరోలా అనుకోకు. ముందు నా వాళ్ళను కాపాడు. తర్వాత నీకు వీలయితేనే నన్ను కాపాడు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.అతని మంచితనానికి ముచ్చటపడ్డాడు హిరణ్యకుడు. మనసులో జేజేలర్పించాడు.

‘‘మిత్రమా! నీదెంత మంచి బుద్ధి. మంచి చెడ్డలు రెండూ నీకు బాగా తెలుసు. ఈ పావురాలకే కాదు, ముల్లోకాలకూ నువ్వు రాజుకావాల్సిన వాడవు. గొప్పవాడవు.’’ అన్నాడు. మెచ్చుకోలుగా మిత్రుని చూసి, తర్వాత వల తాళ్ళన్నీ కొరికి, అందర్నీ బంధవిముక్తుల్ని చేశాడు. పావురాలన్నీ తేలికపడ్డాయి. హిరణ్యకునికి కృతజ్ఞతలు తెలియజేశాయి. రాక రాక వచ్చిన మిత్రునికీ, మిగిలిన పావురాలకీ విందునిచ్చి వారిని సాగనంపాడు హిరణ్యకుడు. ఆకాశంలోకి ఆనందంగా ఎగిరిన పావురాలను చూసి, తన కలుగులోనికి వెళ్ళిపోయాడతను.పావురాలతో పాటుగా వచ్చి అంతా చాటుగా చూసిన లఘుపతనకుడు, పావురాలకు ఎలుక చేసిన సాయాన్ని మనసులో మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు. వల తాళ్ళ నుండి పావురాలను ఎలుక విడిపించిన తీరు బాగుంది బాగుంది అనుకున్నాడు. స్నేహం అంటే ఇది. ఇలా ఉండాలి. స్నేహితులంటే వీళ్ళు, చిత్రగీవుడు-హిరణ్యకుడు అనుకుంది. తను కూడా హిరణ్యకునితో స్నేహం చేయాలనుకుంది. అనుకున్నదే ఆలస్యం చాటు నుంచి తప్పుకుని, హిరణ్యకుని కలుగు దగ్గరకు చేరుకుంది.

Responsive Footer with Logo and Social Media