చిలుక పలుకు



శివాపురం అనే గ్రామంలో వుండే సిద్ధయ్య అనే అతను చిలుకను కొందామని బజారుకెళ్ళి ఒక దుకాణంలో అందమైన చిలుకనొకదాన్ని చూసి దాని ఖరీదెంత? అని దుకాణం వాడ్ని అడిగాడు.

“వంద రూపాయలు” అన్నాడు దుకాణంవాడు.

“వంద రూపాయలే!” అంటూ సిద్ధయ్య ఆశ్చర్యపోయాడు.

“ఈ చిలుక సామాన్యమైంది కాదు. కావాలంటే దాన్నే అడగండి. అంత ఖరీదు చేస్తుందో లేదో" అన్నాడు దుకాణం వాడు.

"నువ్వు వంద రూపాయలు ఖరీదు చేసేమాట నిజమేనా?” అని సిద్ధయ్య చిలుకను అడిగాడు.

“అందుకు నందేహమెందుకు?” అన్నది చిలుక.

ఆ జవాబుకు సిద్ధయ్య చాలా సంతోషించి, దుకాణం వాడికి వందరూపాయలు ఇచ్చి "చిలుకను ఇంటికి తీసుకుపోయాడు. ఇంట్లో అతడి భార్యాపిల్లలు అడిగిన ప్రతి ప్రశ్నకు చిలుక “అందుకు సందేహమెందుకు?” అని జవాబివ్వసాగింది.

దానితో సిద్ధయ్య చిలుకకు ఆ మాట తప్ప మరేమి రాదని తాను మోసపోయానని గ్రహించి తలబాదుకుంటూ పెద్దగా "నేను ఒట్టి అమాయకపు వెధవను - మోసపోయాను” అన్నాడు.

ఆ వెంటనే చిలుక అందుకు “సందేహమెందుకు?” అన్నది.

అధి విని సిద్ధయ్యతోపాటు, అతడి భార్యా పిల్లలు పాట్టచెక్కలయ్యేలాగ నవ్వుకున్నారు.

Responsive Footer with Logo and Social Media