చెరపకురా చెడేవు



తాళ్ళను కొరికి తనని వల నుంచి నక్క రక్షిస్తుందనుకున్నది జింక. అయితే ఆ తాళ్ళను తాను కొరకరాదని, కొరికితే వ్రతభంగమవుతుందంటూ నక్క సన్నాయి నొక్కులు నొక్కింది. దాంతో జింకకు ప్రాణాల మీద ఆశలు అడుగంటాయి.‘‘ఇంకో విధంగా అనుకోకు! ఈ పని తప్ప నువ్వు ఇంకే పని చేయమన్నా చిటికెలో చేస్తాను. మోమాట పడకుండా చెప్పు, నేను ఆ మూల ఉంటాను’’ అంటూ తనలో తాను సన్నగా నవ్వుకుంటూ చాటుగా దాగుంది నక్క. జింకకు కొద్దిదూరంలో కూర్చుంది. పొలం యజమాని తొందర గా వస్తే బాగుణ్ణు! జింక ఎంచక్కా చస్తుంది. అప్పుడు దాని కండలు నోటి నిండుగా తినొచ్చుననుకుంటూ నాలికను చప్పరించింది నక్క. వలలో నుండే నక్కను గమనించసాగింది జింక. నక్క జిత్తులమారితనం అర్థమయిపోయింది తనకి. అనుమానం లేదు, అది తన చావును కోరుకుంటోం దనుకుంది జింక. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు. జరగాల్సింది జరుగుతుందననుకున్నది జింక. తన దురదృష్టానికి చింతిస్తూ తలను నేలకు వాల్చింది.ఎప్పుడనగానో మేతకు వెళ్ళిన జింక ఇంకా రాలే దే మిటి? ఏమయి ఉంటుంది? అనుకుంటూ జింకను వెతుక్కుంటూ వచ్చిన కాకికి, పొలంలో వలలో చిక్కుకున్న జింక కనిపించింది. జింకను చూస్తూనే ‘అయ్యయ్యో’ అనుకుంది కాకి. జింకను వల నుంచి తప్పించాలి. ఎలా? తనకు వలను కొరకడం రాదే! అన్నట్టు నక్కకి వచ్చు. నక్కబావను కేకేస్తే సరి అనుకుంది. అరబోయింది.‘‘ఎవరిని కేకేద్దామనుకుంటున్నావు’’ అడిగింది జింక.‘‘నక్కబావని’’ అంది కాకి.‘‘కేకేయడం ఎందుకు, అదిగో అక్కడే ఉన్నాడు చూడు’’ చూపించింది జింక.

తనని జింక-కాకి చూస్తున్నారన్నది గమనించి వాళ్ళను చూడక ఇటుగా ముఖం తిప్పుకుంది నక్క.‘‘నా చావుకోసం చూస్తున్నాడు. నా మాంసం కోసం కాచుక్కూర్చున్నాడు.’’ బాధపడుతూ చెప్పింది జింక. అంతా అర్థమయింది కాకికి.‘‘నేను ముందే చెప్పాను. విన్నావా? చూడిప్పుడు ఏం జరిగిందో! చెడ్డవాడు చెడ్డవాడే! వాడు మంచివారికి కూడా కీడే తలపెడతాడు. నేను వాడికి కీడు తలపెట్టలేదు, వాడు నాకు కీడు తలపెట్టాడనుకోవడం తప్పు.’’ అంది కాకి.జింక కళ్ళు చెమర్చుకుంది.‘‘మృత్యుముఖంలో ఉన్నవారు, కమ్ముకొస్తోన్న చీకటిని గుర్తించలేరు. ఆకాశంకేసి చూడలేరు. బంధు మిత్రుల మాటలు వినిపించుకోరని పెద్దలు వూరకనే అనలేదు’’ అంది కాకి.తలొంచుకుంది జింక.‘‘ఎదురుగా ఉండి పొగుడుతూ వెనుక గోతులు తీసే స్నేహితులు, పాలబిందెలనిపించే విషపు కుండల్లాటివారు. వాళ్ళతో స్నేహం పనికిరాదు.’’ అన్నది కాకి.‘‘నీ మాటలన్నీ నిజాలే! మంచివారితో స్నేహం చేస్తే అన్నీ లాభాలూ, ఆనందాలే! చెడ్డవారితో స్నేహం చేస్తే అన్నీ నష్టాలూ కష్టాలే! నక్క మాటలు విని మోసపోయాను. అది తేనె పూసిన కత్తి అని తెలుసుకోలేక పోయాను’’ అన్నది జింక. అంతలో పొలం యజమాని అక్కడికి రాసాగాడు. అతని చేతిలో దుడ్డుకర్ర ఉంది. ఆ కర్రనూ, కోపంగా పెద్దపెద్దగా అంగలు వేసుకుంటూ వస్తోన్న యజమానినీ కాకితో పాటుగా చూసి చావు భయంతో వణికిపోయింది జింక.

‘‘అయిపోయాను మిత్రమా, యజమాని వచ్చేస్తున్నాడు.’’ అంది.‘‘అవును. ఏం చేద్దాం? ఏం చెయ్యాలి’’ ఆలోచనలో పడింది కాకి. శరవేగంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది.‘‘మిత్రమా! ఇప్పుడు నువ్వు ఈ వల నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక ఉపాయం ఉంది. అదేంటంటే...నువ్వు ఊపిరి బిగిబట్టి, కాళ్ళు చాచి బిర్రబిగుసుకుని చచ్చినట్టు పడి ఉండు. నువ్వు చచ్చిపోయావని యజమానికి మరింత నమ్మకం కలిగేలా నేను, నీ కళ్ళ మీద నా ముక్కుతో పొడుస్తూ ఉంటాను.’’‘‘అమ్మో’’ అంది జింక.‘‘పొడుస్తున్నట్టుగా నటిస్తాను. అంతే! అది చూసి నువ్వు నిజంగానే చచ్చిపోయావనుకుని, యజమాని నీ మీది వల తొలగిస్తాడు. సమయం చూసి అప్పుడు నేను కావు మని అరుస్తాను. అదే గుర్తు. వెంటనే లేచి నువ్వు పారిపో’’ అంది కాకి.‘‘బలే బలే’’ అంది జింక. కాకి చెప్పినట్టుగానే ఊపిరి బిగబట్టింది. కాళ్ళు చాచి బిర్రబిగుసుకుంది. చచ్చినట్టు పడి ఉంది. జింక కళ్ళను ముక్కుతో పొడుస్తూ కాకి నిలుచుంది.పొలం యజమాని జింక దగ్గరగా వచ్చాడు. అతన్ని చూస్తూనే ఎగిరి పోయింది కాకి. దగ్గరగా ఉన్న చెట్టుకొమ్మ మీద వాలింది. జింకను తేరిపార చూశాడు యజమాని. కదలిక లేదు జింకలో. దాంతో ఇది చచ్చినట్టుందే అనుకున్నాడు. జింక మీది వలను తొలగించాడు. అదే అవకాశంగా కాకి కావుమంటూ అరిచింది. అంతే! జింక పరుగందుకుంది. జరిగిందాన్ని నమ్మలేక పోయాడు యజమాని. కోపం వచ్చిందతనికి. చేతిలోని దుడ్డుకర్రను జింక మీదికి గురిపెట్టి విసిరాడు. జింక తప్పించుకుంది. అయితే ఆ కర్ర చాటుగా నక్కి ఉన్న నక్కకి తగిలింది. బలంగా తగిలింది దెబ్బ. ఆ దెబ్బకి నక్క ప్రాణాలు పోయాయి. చచ్చిపోయిందది.- కథ ముగించాడు హిరణ్యకుడు.‘‘స్నేహం నటించి, ఎదుటి వ్యక్తికి హాని చేద్దామనుకుంటే ఆ ఆలోచన కలిగిన వాడే ఆఖరికి అంతమయిపోతా డన్నది ఈ కథలో నీతి’’ అన్నాడు హిరణ్యకుడు.‘‘అవును, నిజం’’ అన్నాడు లఘుపతనకుడు.కాకికీ, ఎలుకకీ స్నేహం అసాధ్యమని పదేపదే హిరణ్యకుడు అనడాన్ని లఘుపతనకుడు తట్టుకోలేక పోయాడు. బాధ కలిగింది.‘‘పావురాలకు నువ్వు చేసిన సాయాన్ని చూసి, నీ మంచితనాన్ని గమనించి, నీతో స్నేహం కోరుకున్నాను. అంతేకాని, నాకు వేరే దురుద్దేశం లేదు. నిన్ను తిన్నంత మాత్రాన నా ఆకలి తీరిపోదు. నీలాంటి వాణ్ణి మోసగించలేను.

నన్ను నమ్ము’’ అన్నాడు లఘుపతనకుడు.హిరణ్యకుడు నుంచి జవాబు లేదు.‘‘నువ్వు నాతో స్నేహం చేసేదాకా నేనిక్కణ్ణుంచి కదలను. చూస్కో’’ అన్నాడు లఘుపతనకుడు.

‘‘నేనూ పావురాల రాజు చిత్రగ్రీవుడులాంటి వాణ్ణే! నన్ను నమ్ము మిత్రమా’’ ప్రాధేయపడ్డాడు. అయినా కరగలేదు హిరణ్యకుడు. స్నేహానికి ఒప్పుకోలేదు.‘‘నువ్వు నా శత్రుజాతికి చెందిన వాడివి. నీకూ నాకూ స్నేహం గిట్టదు. నీటి మీద నడిచే పడవలు, నేల మీద నడవలేవు. అలాగే నేల మీద నడిచే బళ్ళు నీటి మీద నడవలేవు. అందని మామిడి పుల్లన అనుకో! వెళ్ళిపో ఇక్కణ్ణుంచి.’’ అన్నాడు హిరణ్యకుడు. లఘు పతనకుడు కదల్లేదు అక్కణ్ణుంచి.‘‘నన్ను అపార్థం చేసుకుంటున్నావు. మంచివాడితో స్నేహం మరపురానిది. నేను మంచివాణ్ణి. నా స్నేహం నీకు బలే ఆనందాన్ని కలిగిస్తుంది. కాదంటావా, తిండీతిప్పలూ మాని కూర్చుంటాను. నిరాహారదీక్ష చేస్తాను’’ అన్నాడు లఘుపతనకుడు.హిరణ్యకుడు నుంచి ఉలుకూ పలుకూ లేదు.‘‘మంచిమనసు, త్యాగం, దయ, స్నేహం మంచి గుణాలు. అవన్నీ నీ దగ్గర ఉన్నాయి.

నీతో స్నేహం నాకు కావాలి. నువ్వొద్దంటే చచ్చిపోతాను.’’‘‘వద్దొద్దు’’ ఆందోళన చెందాడు హిరణ్యకుడు.‘‘నీ మాటలు మంచిగంధంలాగ చల్లగా ఉన్నాయి. పన్నీటి జల్లులాగ హాయిగా బాగున్నాయి. మనసులో ఒకటి, మాటలలో ఒకటి, చేతలలో ఒకటి చేసే బుద్ధి నీది కాదనిపిస్తోంది. నీతో స్నేహం చేస్తాను. నీ స్నేహం నాకు కావాలి. ఈరోజు నుంచీ నువ్వూ నేనూ స్నేహితులం.’’ అంటూ కలుగులోంచి బయటికి వచ్చాడు హిరణ్యకుడు. లఘుపతనకుణ్ణి చూసి నవ్వాడు. అప్పణ్ణుంచీ వాళ్ళిద్దరూ మంచిమిత్రులైపోయారు. తింటే ఇద్దరూ కలిసి తినేవాళ్ళు. ప్రయాణిస్తే కలిసి ప్రయాణించేవారు. కబుర్లే కాదు, కష్టాలూ నష్టాలూ అన్నీ ఇద్దరూ కలబోసుకోసాగారు.