చత్వారం
పూర్వం ఒకప్పుడు హత్యలు, దారి దోపిడీలేకాక, చిన్న చిన్న దొంగతనాలను చేసేవాళ్ళనుగ్రామాధికారులు మెడలో ఒక కొయ్యగుదిబండ కట్టి ఎండలో కూర్చోబెట్టేవారు. ఒకసారి ఎల్లయ్య అనేవాడు గ్రామం బయట పొలిమేరలో మేస్తున్న ఎద్దునొక దాన్ని దగ్గర్లో దొరికిన తాడును మెడకు కట్టి, దొంగిలించుకుపోవాలని చూశాడు. అయితే ప్రాంతాల కాపలాదారుడొకడ అది చూసి గ్రామాధికారికి చెప్పాడు. గ్రామాధికారి నౌకర్లను వంపి ఎల్లయ్యనుపట్టుకుని సూర్యాస్తమయం వేళ వరకూ శిక్షగా మెడలో ఒక గుదిబండ తగిలించి, ఎర్రని ఎండలో కూర్చోబెట్టాడు.
కొంతసేపు తర్వాత ఎల్లయ్య ఊరివాడు పుల్లయ్య అటుగాపోతూ ఎల్లయ్యను చూసి ఆశర్యంగా "ఏమిటిది, మెడలో గుదిబండా నువ్వు?" అని అడిగాడు. "ఏం చెప్పేది. అంతా నా దురదృష్టం?" అన్నాడు ఎల్లయ్య "అసలేం జరిగిందేంటి?" అన్నాడు పుల్లయ్య తమ ఊరివాడి పరిస్థితకి జాలిపడుతూ.
"మరేంలేదు. అలా గ్రామందాటి పోతుంటే ఒక పచ్చిక బయల్లో పెద్ద తాడొకటి కంటబడింది. తీసుకున్నానంతే" అన్నాడు ఎల్లయ్య"దారిలో కనబడిన త్రాడు తీసుకున్నందుకు ఇంత శిక్షా?" అంటూ నివ్వెరపోయాడు.
పుల్లయ్య "ఆ త్రాడు వెనక ఎంతలేదన్నా ఐదారు వందల విలువచేసే ఎద్దు ఒకటి వున్నది. నా చత్వారం పాడుగానూ, దాన్ని నేను గమనించలేదు" అన్నాడు ఎల్లయ్య ఉస్సురుమంటూ.