చక్రధరుని కథ
భైరవానందుడు ఇచ్చిన రాగిరేకుల్ని పట్టుకుని, నలుగురు మిత్రులూ ఉత్తరదిశగా ప్రయాణించారు. అందులో ఒకరికి రాగి దొరికింది. దానితో తృప్తి చెందాడతను. మరొకరికి వెండి దొరికింది. దానితో అతను తృప్తి చెందాడు. మిగిలిన ఇద్దరూ బంగారం కోసం ముందుకు నడిచారు. కొంత దూరం ప్రయాణించారో లేదో, అందులో ఒకని చేతిలోని రాగిరేకు అప్రయత్నంగా కిందపడి, శరవేగంతో భూమిలోనికి చొచ్చుకుపోయింది. అక్కడ తవ్వి చూశారిద్దరూ. అనుకున్నట్టే వారికి అక్కడ బంగారం దొరికింది.‘దొరికిన కాడికి రాగి, వెండితో మన మిత్రులిద్దరూ తొందరపడి వెను తిరిగారు. కొంచెం ఓపిక పట్టి ఉంటే బంగారాన్ని చేజిక్కించుకునేవారు. ఏం చేస్తాం? ఎవరి అదృష్టం వారిది. రా, మనిద్దరం బంగారాన్ని పంచుకుందాం. సమానంగా వాటాలు వేసుకుని, మూటలు మోసుకుని పోదాం.’ అన్నాడో మిత్రుడు.‘ఈ బంగారం మనకే కాదు, మన పిల్లలకీ, వారి పిల్లలకీ, వారి వారి పిల్లలకీ అందరికీ సరిపోతుంది. మనం సర్వ సంపన్నులం. అనుమానం లేదు.’ అన్నాడు మళ్ళీ.
అతని మాటలు పట్టించుకోక ఏదో ఆలోచనలో ఉన్నాడు రెండో మిత్రుడు. ఇంకొంచెం శ్రమ తీసుకుని ముందుకు నడిస్తే రత్న నిక్షేపం లభిస్తుంది. వెల కట్టలేని ఆ నిక్షేపం ముందు ఈ బంగారం ఎంత? దీనిని వద్దనుకోవడమే శ్రేయస్కరం.‘ఏమిటి మిత్రమా! ఏంటాలోచిస్తున్నావు? రా, బంగారాన్ని పంచుకుందాం.’ఆలోచన నుంచి తేరుకున్నాడు రెండో మిత్రుడు. ఇలా అన్నాడు.‘నాకీ బంగారంలో వాటా వద్దు. మొత్తం అంతా నువ్వే తీసుకో! నాకింకా ముందుకు వెళ్ళాని ఉంది.’అతని అత్యాశకి ఆశ్చర్యపోయాడు మొదటి మిత్రుడు.‘చూడు మిత్రమా! మనకు రాగిరేకుల్ని ప్రసాదించిన యోగి, మొదటి నిధితోనే తృప్తి చెందండన్నాడు. నలుగురికీ అది సరిపోతుందన్నాడు. మనం వినలేదు. బంగారం కోసం వచ్చాం. దొరికింది. చాలిది! రా, పంచుకుని హాయిగా ఇళ్ళకి పోదాం.’‘రాను’‘అత్యాశ మొదటికే మోసం అంటారు. నా మాట విను. రా.’ బతిమలాడాడు. వినలేదతను.‘ముందు రత్నరాసులు ఉన్నాయి. ఉంటాయి. బంగారం తర్వాత రత్నాలే దొరికేది. వాటి ముందు ఈ బంగారం ఎంత? ఈ బంగారాన్ని వదిలేయ్! నాతో పాటు రా, రత్నాలు చేజిక్కుంచుకుందాం.’ అన్నాడు రెండో మిత్రుడు.‘నాకీ బంగారం చాలు! నాకెలాంటి రత్నాలూ వద్దు. నేను రాను.’‘నీ కర్మ’‘నా కర్మకేంగాని, నిన్ను ఒంటరిగా వదలి వెళ్ళిపోతున్నానని బాధగా ఉంది.’ అన్నాడు మొదటి మిత్రుడు.
‘నువ్వేం బాధపడకు. వస్తాను.’ అంటూ పరుగుదీశాడు అక్కణ్ణుంచి రెండో మిత్రుడు. చూస్తూండగానే కనుమరుగయిపోయాడు. పరుగుదీస్తోన్న మిత్రుణ్ణి చూసి ఇలా అనుకున్నాడు మొదటి మిత్రుడు.‘ఎవరి కర్మకి ఎవరు కర్తలు?’పరుగుదీస్తూన్న యువకుని చేతిలోంచి అప్రయత్నంగా రాగిరేకు కింద పడింది. అక్కడ తవ్వనవసరం లేకపోయింది. రేకు పడగానే భూమి రెండుగా చీలి దారి చేసింది. ఆ దారంట నడవసాగాడా యువకుడు. రత్నరాసుల కోసం వళ్ళంతా కళ్ళు చేసుకుని చూడసాగాడు. అలా చూస్తూంటే ఒక చోట ఓ వ్యక్తి కనిపించాడతనికి. రక్తం చిమ్ముతోన్న శరీరంతో ఉన్నాడా వ్యక్తి. పెద్ద చక్రాన్ని తల మీద మోస్తున్నాడు. అతని తలని ఇరుసుగా చేసుకుని, ఆ చక్రం తిరుగుతోంది.
చిత్రంగా ఉందే అనుకుంటూ అతన్ని సమీపించాడు, రత్నరాసుల్ని కోరుకుంటున్న యువకుడు.‘ఎవరు స్వామీ మీరు? మీ నెత్తిన ఆ చక్రం ఏమిటి?’ అడిగాడు. సమాధానంగా ఆ వ్యక్తి, తన తల మీది చక్రాన్ని తీసి, యువకుడి నెత్తి మీద పెట్టాడు. పెట్టిన మరుక్షణం ఆ చక్ర ం అతని తలని ఇరుసుగా చేసుకుని తిరగసాగింది. భరించలేని నొప్పిని కలుగజేసింది. తట్టుకోలేకపోయాడతను.‘ఏమిటి స్వామీ ఇది? ఇది నా తల మీద పెట్టారేమిటి? ఈ బాధను భరించలేకుండా ఉన్నాను. తియ్యండి స్వామీ, నా తల మీద నుంచి దీనిని తొలగించండి.’ బతిమలాడాడు యువకుడు. సమాధానంగా నవ్వాడు ఆ వ్యక్తి.‘ఎందుకు స్వామీ నవ్వుతున్నారు’ అడిగాడు.
‘ఎందుకంటే నీలాగే రత్నరాసుల మీది ఆశతో ఒకప్పుడు నేనిక్కడికి వచ్చాను. అప్పుడు ఈ చక్రాన్ని నెత్తి మీద మోస్తూ ఓ వ్యక్తి నాకు కనిపించాడిక్కడ. నీలాగే ఆ వ్యక్తిని అడిగాను. సమాధానంగా తను మోస్తున్న చక్రం నా మీద పెట్టి, ‘బతుకుజీవుడా’ అనుకుంటూ వెళ్ళిపోయాడిక్కణ్ణుంచి. బాధనలా తప్పించుకున్నాడు. నేనూ ఇప్పుడు చేసిందదే! సెలవు.’ అన్నాడా వ్యక్తి. ముందుకు నడిచాడు. తల తిరిగి నొప్పి పెడుతున్నా రత్నాల మీది ఆశ చావలేదు యువకుడికి. వెళ్ళిపోతున్న వ్యక్తిని కేకేశాడు.‘ఇదిగో! అసలిక్కడ రత్నరాసులు ఉన్నాయా? ఇంకో మాట, నువ్వెప్పటి నుంచి ఈ బాధను భరిస్తూ ఉన్నావిక్కడ?’ అడిగాడు.‘నేను త్రేతాయుగం నాటి వాణ్ణి. శ్రీరాముడు రాజ్యం చేస్తున్నప్పటి వాణ్ణి. రామరాజ్యంలో ఏ లోటూ లేకపోయినా అత్యాశతో ఇక్కడికి వచ్చాను. కుబేరుడు ఇక్కడ దాచి ఉంచిన రత్నరాసుల్ని చేజిక్కించుకుందామనుకున్నాను. అయింది కాదు.’ అన్నాడా వ్యక్తి.తిరుగుతున్న చక్రంతో పాటుగా తిరుగుతున్న తన తలని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూ, యువకుడు ఇలా అడిగాడు.‘రత్నరాసుల సంగతి చెప్పలేదు.’‘అదిగో, అటు చూడు’ చూపించాడా వ్యక్తి.
చూశాడు యువకుడు.‘కోటి సూర్యబింబాల్ని కుప్పపోసినట్టుగా మెరుస్తున్నాయి చూడు, అవి వజ్రాలు. వాటి పక్కనున్నవి వైడూర్యాలు. అదిగో అవి పుష్యరాగాలు. వాటి పక్కనున్నవి అవే మరకత మాణిక్యాలు. వాటిని చూస్తూ ఆనందించు. అంతే! ముట్టుకున్నావో మరింతగా హింస పడాల్సొస్తుంది. ఎవరూ వాటని చేజిక్కించుకోకుండా ఉండేందుకే ఈ చక్రాన్ని ఇక్కడ కాపలాగా పెట్టాడు కుబేరుడు.’ చెప్పాడా వ్యక్తి.‘త్రేతాయుగం. శ్రీరాముని కాలం నాటి వాడినంటున్నావు. ఇప్పుడేమో, ఇది కలియుగం. వత్సరాజు ఉదయనుడు పాలిస్తున్న రోజులివి. ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఎలా ఉన్నావిక్కడ? నీకు మరణం లేదా?’ అడిగాడు యువకుడు.‘లేదు. చక్రభ్రమణంతో అనుక్షణం మరణయాతన అనుభవిస్తూ బతకాల్సిందే! నాకే కాదు, నీకూ మరణం ఉండదిక్కడ. మరణమే కాదు, ఆకలిదప్పులు కూడా ఉండవు.’ చెప్పాడా వ్యక్తి.
‘మరి నాకు విముక్తి ఎప్పుడు?’‘నీలాగే అత్యాశతో రత్నరాసుల కోసం ఇక్కడికి వచ్చిన వానికి ఆ చక్రాన్ని కానుకగా సమర్పించి, తప్పుకో! అప్పుడే విముక్తి. అందాకా నీకీ నరకయాతన తప్పదు.’ అన్నాడు వ్యక్తి. తేలిగ్గా చేతులూపుకుంటూ ఆనందంగా వెళ్ళిపోయాడక్కణ్ణుంచి.రత్నరాసుల కోసం పరుగుదీసిన మిత్రుడు, ఆ రాసుల్ని సాధించాడా? సాధించకపోతే, దొరికిన బంగారంలో సగభాగం ఇచ్చి ఆదుకుందామన్న తలంపుతో అతన్ని వెదుక్కుంటూ అక్కడికి వచ్చాడు మొదటి మిత్రుడు. నెత్తి మీది చక్రంతో తిరిగిపోతున్న మిత్రుణ్ణి చూసి, అతని శరీరం మీద ధారలు కడుతున్న రక్తాన్ని చూసి, నిర్ఘాంతపోయాడు.‘ఏమిటిది మిత్రమా?’ జాలిపడ్డాడు.
జరిగిందంతా చెప్పుకొచ్చాడు మిత్రుడు.‘చదువుకున్నావు కాని, వివేకం లేకుండా పోయింది. ‘సింహకారకులు’ అని ఓ కథ ఉంది. ఆ కథలో చదువుకున్నా అవివేకంతో కీడు తెచ్చుకున్న మిత్రబృందంలా తయారయ్యావు నువ్వు.’ అన్నాడు మొదటి మిత్రుడు.‘ఏంటా కథ? దయచేసి చెప్పు. కథ వింటుంటే ఈ బాధ మరచిపోవచ్చు.’ అడిగాడు రెండో మిత్రుడు.మొదటి మిత్రుడు చెప్పసాగాడిలా.‘‘అనగనగా ఓ అగ్రహారం. ఆ అగ్రహారంలో మనలాగే నలుగురు మిత్రులు ఉండేవారు. నలుగురిలో ముగ్గురు బాగా చదువుకున్నారు. విజ్ఞానశాస్త్రం వారికి తెలిసినట్టుగా వేరెవరికీ తెలీదు. నాలుగోవాడు, ఇందుకు భిన్నం. వాడికి చదువబ్బలేదు. ఆటపాటలతోనే కాలాన్నంతా గడిపేశాడతను. అయితే మంచి లోకజ్ఞానం సంపాదించాడు.ఈ నలుగురూ డబ్బు సంపాదించేందుకు దేశాటనకు బయల్దేరారు. తమతో చదువబ్బని వాడు రావడం చదువుకున్న ముగ్గురిలో మొదటివాడికి నచ్చలేదు.‘నీకు చదువు లేదు. చదువు లేనివాడు డబ్బు సంపాదించడం అసాధ్యం. మేము చదువుకున్న వాళ్ళం. డబ్బు సంపాదిస్తాం. మేము డబ్బు సంపాదిస్తే మాతో కలసి వచ్చిన అదృష్టానికి నీకు డబ్బు వాటాగా ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వడం నాకిష్టం లేదు. నువ్వు రావద్దు.’ అన్నాడు.
‘నిజమే! నువ్వు డబ్బు సంపాదించలేవు. మేము సంపాదిస్తే అందులో నీకు వాటా ఇవ్వాలి. ఇవ్వడం మాకిష్టం లేదు. అందుకని, నీకెందుకు శ్రమ? మాతో రాకు.’ అన్నాడు రెండోవాడు.‘తప్పురా! చిన్నప్పటి నుంచీ మన నలుగురం స్నేహితులం. స్నేహితులం అన్న తర్వాత నీకు చదువు లేదు, మేం సంపాదించిన దానిలో నీకు వాటా ఇవ ్వడం మాకిష్టం లేదు లాంటి మాటలు మాట్లాడకూడదు. వాణ్ణీ రానీయండి. తోడుగా ఉంటాడు. తోడుగా ఉన్నందుకైనా సంపాదించిన దానిలో వాడికి వాటా ఇద్దాం.’ అన్నాడు మూడోవాడు. లేదు లేదని ఎంత వాదించినా ఒప్పుకోలేదతను. దాంతో తప్పింది కాదు. నాలుగోవాణ్ణి వెంటబెట్టుకున్నారు. అంతా దేశాటనకు బయల్దేరారు.