బ్రాహ్మణుడు, రాక్షసుడు మరియు దొంగ
ఒక బ్రాహ్మణుడు అడవికి సమీపాన తన నివాసాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. బ్రాహ్మణుడి నివాసానికి కొంచెం దూరంలో ఒక రాక్షసుడు నివాసం ఉంటున్నాడు. ఎర్రగా నిగనిగలాడుతున్న బ్రాహ్మణుని తినాలని రాక్షసుడికి ఎప్పటి నుండో కోరిక. అయితే సమయం దొరకడంలేదు. ఒకరోజు బ్రాహ్మణుని మింగాలని అతడి ఇంటి ప్రక్కనే రాక్షసుడు ఎదురుచూస్తూ కూర్చున్నాడు. అదే సమయంలో ఒక దొంగ ఒంటినిండా నల్లని రంగు పూసుకుని బ్రాహ్మణుని ఇంటిలో ఉన్న విలువైన వస్తువులను దోచేయాలని వచ్చాడు. రాక్షసుడు దొంగ కంటపడ్డాడు. దొంగ భయపడి అరవబోయాడు.
“అరవకు” అని రాక్షసుడు అన్నాడు. “నువ్వెందుకు వచ్చావు” దొంగ ప్రశ్నించాడు. దొంగ ప్రశ్నకు బదులిస్తూ “అడవిలోకి ఎవరూ రావడం లేదు. ఆహారం దొరక్క ఆకలితో మలమల మాడి పోతున్నాను. అడవి సమీపాన ఈ బ్రాహ్మణుడు నివాసం ఏర్పరచుకున్నాడు. ఇతడ్ని మింగేయాలనేది నా కోరిక. ఇంతకాలానికి ఒంటరిగా చిక్కాడు. అయినా ఇక్కడికి నువ్వెందుకొచ్చావు?” అడిగాడు రాక్షసుడు.
“ఊళ్ళో దొంగతనాలు ఎక్కువ కావడంతో జనమంతా మెలకువతో ఉండి కాపలా కాస్తున్నారు. వాళ్ళ కంటపడితే కొడతారని భయపడి ఇక్కడికి వచ్చాను. ఇక్కడైతే నన్ను ఎవరూ పట్టుకోలేరు. అందువల్ల నేను ఈ బ్రాహ్మణుడి ఇంటికి దొంగతనం చేయాలని వచ్చాను” అన్నాడు దొంగ. “ఈరోజు నుండి మనిద్దరం మిత్రులం. ముందుగా నేను వెళ్ళి బ్రాహ్మణుని మింగేస్తాను. ఆ తరువాత నువ్వు రా” అన్నాడు రాక్షసుడు. “నేను నిన్నెలా నమ్ముతాను. బ్రాహ్మణుని నువ్వు మింగేస్తే ఆతరువాత నన్ను వదులుతావని ఎలా అనుకుంటాను? కాబట్టి ముందుగా నేను వెళ్ళి బ్రాహ్మణుని ఇంట దొంగతనం చేసి వెళ్ళిపోతాను. ఆ తరువాత నువ్వు వెళ్ళి బ్రాహ్మణుని మింగి వెళ్ళిపో” అన్నాడు దొంగ.
నేను ముందు వెళతాను అంటే నేను ముందు వెళతాను అని వారిద్దరూ వాదించుకున్నారు. ఈ వాదన పెరిగి పెద్ద గొడవైంది. దాంతో బ్రాహ్మణుడు ఇంటి నుండి బయటకు వచ్చి చూస్తే రాక్షసుడు, ఒంటినిండా నల్లని రంగును పూసుకున్న గజదొంగ కనిపించారు. వెంటనే ఇంట్లోకి వెళ్ళి అందరినీ నిద్రలేపాడు. జనాన్ని చూసి దొంగ పారిపోగా, అందరూ ఆంజనేయస్వామి దండకం చదివారు. ఆంజనేయస్వామి పేరు వినగానే రాక్షసుడు కూడా పారిపోయాడు. దొంగ, రాక్షసుడి తగువు వల్ల బ్రాహ్మణుడు తప్పించుకోవడానికి మేలు జరిగింది.
నీతి కథలు : మనము ఏదైనా పని అనుకుంటే, బాగా ఆలోచించి వెంటనే అమలు చేయాలి.