బ్రాహ్మణుడు మరియు నల్లమేక



ఒక గ్రామంలో నివసించే బ్రాహ్మణుడు ఒక మేకను పెంచుకోవడం కోసం సంతలో ఒక నల్ల మేకను కొని తీసుకుని భుజాలపై పెట్టుకొని తన ఊరికి బయలుదేరాడు. దారిలో నలుగురు దొంగలు అతడ్ని అనుసరించారు. ఎలాగైనా ఈ మేకను తాము కాజేయాలని పథకం వేశారు. తొలుత ఒకడు దొంగ బ్రాహ్మణుడి వేషంలో ఎదురయ్యాడు. “అయ్మా! తమరు బ్రాహ్మణోత్తముల్లా ఉన్నారు. నల్లకుక్కను భుజాలపై పెట్టుకుని వెళుతున్నారేమిటి” అని ప్రశ్నించాడు.



“ఓ అమాయకుడా! నా భుజాలపై ఉంది నల్లమేక, నల్లకుక్క కాదు. మేకను పట్టుకుని కుక్క అంటావేంటి, పనిచూస్కో” అని బ్రాహ్మణుడు అతడితో అని ముందుకు సాగాడు. కొంతదూరం పోయాక రెండవ దొంగ ఎదురై “బ్రాహ్మణోత్తమా! మీ భుజాలపై నల్ల కుక్కను మోసుకుని వెళుతున్నారేమిటి?” అన్నాడు. “నీకు పిచ్చిగాని పట్టిందా? నల్లమేకను పట్టుకొని నల్లకుక్క అంటున్నావు” అని తిట్టి ముందుకు సాగాడు.

వీళ్ళంతా కావాలని అలా అంటున్నారని బ్రాహ్మణుడు భావించాడు. ఇంకొంత దూరం పోయాక మూడవ దొంగ ఎదురై అదే విధంగా అన్నాడు. మరికొంత దూరం పోయాక నాల్గవ దొంగ ఎదురై “నల్ల కుక్కను తీసుకుని వెళుతున్నారేమిటి? కుక్కంటే శని.

భుజాలపై శనిని మోసుకుని వెళుతున్నారా? దాన్ని విడిచిపెట్టండి” అని అన్నాడు. ఇంతమంది అలా చెప్పేపాటికి బ్రాహ్మణుడికి అనుమానం వచ్చింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు నలుగురు అదే విధంగా అన్నారు. కాబట్టి వారు చెప్పిందే నిజమని బ్రాహ్మణుడు భావించి, అది నల్లమేక కాదు నల్లకుక్క అని భావించాడు. వెంటనే ఆ నల్లమేకను వదిలేశాడు.

నీతి కథలు : కొన్ని సందర్భాలలో నలుగురు చెప్పింది కూడా నిజం కాకపోవచ్చు. వాళ్ళూ, వీళ్ళూ చెప్పారు కదా అని మనం నిర్ణయాలు తీసుకోకూడదు. అందులోని నిజానిజాలు అవగాహనతో తెలుసుకున్న పిదపే మనం ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి.

Responsive Footer with Logo and Social Media