బిక్షువు - బంగారునాణెలు



కలలో కనిపించిన భిక్షువు కళ్ళెదుట ఉన్నాడు. ‘భవతీ భిక్షాందేహీ’అంటున్నాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు మణిభద్రుడు.అయితే రాత్రి కలలో కనిపించి, ధనలక్ష్మి చెప్పిందంతా నిజమేనన్నమాట! తనని కరుణించడానికి తల్లి ఇలా భిక్షువు రూపంలో నడిచి వచ్చింది. ఇక మిగిలింది ఒకటే! భిక్షువుని లోపలికి పిలిచి, దుడ్డుకర్రతో తల మీద మోదాలి. మోదితే బంగారు నాణెలే నాణెలు అనుకున్నాడు మణిభద్రుడు.‘‘రండి స్వామీ’’ భిక్షువును లోపలికి పిలిచాడు మణిభద్రుడు. లోపలికి వచ్చాడు భిక్షువు.‘‘కూర్చోండి’’కూర్చున్నాడు భిక్షువు. మణిభద్రుడు మరి కొంచెం లోపలికి నడిచాడు. అక్కడ గోడకి చేరవేసిన దుడ్డుకర్రను అందుకున్నాడు. మెల్లగా నడచి వచ్చి, భిక్షువు వెనుక నిల్చున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. లక్ష్మిని మనసులో ప్రార్థించాడు. తర్వాత దుడ్డుకర్ర బాగా పైకెత్తి దాంతో బలంగా భిక్షువు తల మీద మోదాడు. అంతే! భిక్షువు బంగారు నాణెల రాశిగా మారిపోయాడు.-ఇదంతా చాటుగా చూసిన క్షురకుడు ఒకడు ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయాడు. పొద్దునే క్షురకర్మకు రమ్మని మణిభద్రుడు అతన్ని పిలిచాడు. వచ్చాడతను. అయితే భిక్షువు వ్యవహారంలో పడి, క్షురకుణ్ణి పట్టించుకోలేదు మణిభద్రుడు.‘‘బంగారం! బంగారం’’ అంటూ నాణెల్ని దోసిళ్ళతో తీసి చూసుకుంటున్నాడు మణిభద్రుడు.

‘‘అవును! ఎంత బంగారమో’’ అన్నాడు అతని దగ్గరగా వచ్చి క్షురకుడు. నాణెల కుప్పని కళ్ళ నిండుగా చూడసాగాడు.డబ్బులేక పడ్డ కష్టాలు మరచిపోయాడు మణిభద్రుడు. డబ్బుని చూడగానే మళ్ళీ అతనికి దానధర్మాలు చేయాలనిపించింది.‘‘తీసుకో! నీ దోసిలితో దోసెడు నాణెలు తీసుకో’’ చెప్పాడు మణిభద్రుడు. క్షురకుడు ఆలస్యం చేయలేదు. పెద్దగా దోసిలి పట్టి, పట్టినన్ని నాణెలు ఇంటికి తీసుకునిపోయాడు. తెచ్చుకున్న నాణెలతో జీవితాంతం హాయిగా బతికేయొచ్చు. దేహీ అంటూ ఎవరి ముందు చేయి జాచనక్కరలేదు. అయినా తృప్తి చెందలేదు ఆ క్షురకుడు.కుప్పలు కుప్పలుగా బంగారు నాణెలు కావాలి. కావాలంటే భిక్షువుల తల మీద దుడ్డుకర్రతో మోదాలి. అదే తన తక్షణ కర్తవ్యం అనుకున్నాడతను. తెల్లార్లూ అదే పదే పదే ఆలోచించి, తెల్లారగానే దగ్గరలో ఉన్న మఠానికి చేరుకున్నాడు క్షురకుడు. అక్కడ ఆచార్యునికలిశాడు.

‘‘స్వామీ! మీరు శిష్య సమేతంగా మా ఇంటికి వచ్చి భిక్ష స్వీకరించాలి.’’ అన్నాడు.‘‘పేదవాడివి, నీకెందుకింత కష్టం.’’ ఒప్పకోలేదు ఆచార్యుడు.భిక్షువులు రాకపోతే ఎలా? బంగారు నాణెలు ఎలా వస్తాయి? అమ్మో భయపడ్డాడు క్షురకుడు. ఇలా అన్నాడు ఆచార్యునితో.‘‘నేను పేదవాడిలా కనిపిస్తున్నాను కాని, నిజానికి మీరనుకున్నట్టుగా నేనేమీ పేదవాణ్ణి కాను. నా దగ్గర మా పూర్వులు సంపాదించిన సొమ్ము చాలా ఉంది. అయితే దాన్ని నేను ముట్టుకోదలచుకోలేదు. ఎందుకంటే వారి సంపాదన నాకెందుకని, నేను పట్టించుకోను. నేను సంపాదించిన దానితోనే బతకాలన్నది నా తాపత్రయం.’’క్షురకుణ్ణి మెచ్చుకోలుగా చూశాడు ఆచార్యుడు.‘‘ఈ రోజేదో పండగ అని విన్నాను.

ఈ పండగ పూటా మా తాతలు సంపాదించిన సొమ్మంతా మీకు దానం చేద్దామనుకుంటున్నాను. కాదనకండి. రండి స్వామీ’’ బతిమలాడాడు.‘‘మఠానికి ఆ సొమ్ముని వినియోగించండి. మా పూర్వీకుల ఆత్మలకు శాంతి కలిగించండి.’’ వేడుకున్నాడు. అప్పుడిక కాదనలేకపోయాడు ఆచార్యుడు. శిష్య సమేతంగా క్షురకుని ఇంటికి భిక్షకు బయల్దేరాడు. ఇంటి లోలోపలికి పిలిచి, అందరినీ కూర్చోమన్నాడతను. కూర్చున్నారంతా. అదే అదనుగా దాచి ఉంచిన దుడ్డుకర్రను అందుకుని, వెనగ్గా వచ్చి భిక్షువులందరి తల మీదా బలంగా మోదసాగాడు క్షురకుడు. దెబ్బకి ముగ్గురు చనిపోయారక్కడే! దెబ్బని తట్టుకుని, కొందరు శిష్యులు పరుగు తీశారక్కణ్ణుంచి. మరి కొందరు దెబ్బ తినలేదు గాని, క్షురకుని అకృత్యాన్ని చూసి మూర్ఛపోయారు.రక్తం కారుతూ దారంట పరుగుదీస్తూన్నభిక్షువుల్ని చూశారు రక్షకభటులు.‘‘ఏమయిందేమయింది?’’ అడిగారు.జరిగిందంతా భిక్షువులు చెప్పారు.

‘‘ఎందుకిలా ప్రవర్తించాడు? పదండి చూద్దాం.’’ క్షురకుని ఇంటికి పరుగు పెట్టారు భటులు. చేరుకున్నారక్కడికి. లోపలికి ప్రవేశించి చాటుగా తొంగి చూశారు.చనిపోయిన భిక్షువుల్నీ, మూర్ఛపోయిన భిక్షువుల్నీ తడిమి చూస్తూ, ఎవరూ ఎంతకీ బంగారు నాణెల రాశిగా మారకపోవడాన్ని అంతు చిక్కక కన్నీళ్ళు పెట్టుకుంటున్న క్షురకుణ్ణి బంధించారు. న్యాయాధికారి ముందు నిలబెట్టారు.‘‘ఎందుకింత ఘోరానికి పాల్పడ్డావు?’’ అడిగాడు న్యాయాధికారి.‘‘చేసింది ఘోరం అని ఇప్పుడు తెలుస్తోంది ప్రభూ! కాని,అప్పుడు అలా అనుకోలేదు. దుడ్డుకర్రతో మోదితే వారంతా బంగారు నాణెల రాశులవుతారనుకున్నాను. మణిభద్రుడింట అలాగే జరిగింది.’’ అన్నాడు క్షురకుడు.‘‘మణిభద్రుణ్ణి హాజరు పరచండి.’’ ఆజ్ఞాపించాడు న్యాయాధికారి.

హాజరు పరిచారతన్ని.‘‘ఏంటయ్యా, నువ్వు భిక్షువు తల మోదావా? ఎందుకలా చేశావు?’’ అడిగాడు న్యాయాధికారి.దానధర్మాల కారణంగా తను పేద వాడు కావడం, చనిపోవాలనుకోవడం, ఆ రాత్రి కలలో ధనలక్ష్మి భిక్షువు రూపంలో కనిపించడం...జరిగిందంతా చెప్పుకొచ్చాడు మణిభద్రుడు. నిజం చెప్పినందుకు అతన్ని మెచ్చుకుని, ముగ్గురిని దుడ్డుకర్రతో మోది హత్య చేసినందుకు క్షురకునికి యావజ్జీవకారాగార శిక్ష విధించాడు న్యాయాధికారి.‘‘మణిభద్రుని గుడ్డిగా అనుసరించాడేకాని, భిక్షువు ఎందుకలా బంగారు నాణెల పోగయ్యాడన్నది తెలుసుకోలేదు క్షురకుడు. ముందు వెనుకలు చూసుకోకపోతే ముప్పు మనకే’’ అన్నాడు న్యాయాధికారి. అంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు.‘‘కోరిక, సాధించాలన్న తాపత్రయాన్ని పెంచుతుందే కాని, దేనినీ దీర్ఘంగా ఆలోచించనీయదు. ఆలోచిస్తే నెత్తికి చక్రం ఎందుకు చుట్టుకుంటుంది?’’‘‘చక్రం చుట్టుకోవడం ఏమిటి ప్రభూ? ఏంటా కథ’’ అడిగారు రక్షకభటులు. న్యాయాధికారి చెప్పసాగాడిలా.

‘‘పూర్వం అవంతీనగరంలో ఓ మఠం ఉండేది. అందులో భైరవానందుడు అనే యోగి ఉండేవాడు.అడిగిన వారి కోరికలు తీరుస్తాడని అతనికి పెద్ద పేరు. ఓ నలుగురు యువకులు అతన్ని ఆశ్రయించారు.‘మహాత్మా! పేదరికాన్నీ, దరిద్రాన్నీ భరించలేక, పుట్టిన ఊరుని వదిలి మీ దగ్గరకు చేరుకున్నాం. తమ దగ్గర అద్భుతశక్తులు ఉన్నాయని విన్నాం. ఏదో శక్తి ప్రసాదించి, మా పేదరికాన్ని పోగొట్టండి.’ అని వేడుకున్నారు. పదేపదే వారలా వేడుకొనడంతో యోగి అనుగ్రహించాడు. తన దగ్గర బీజాక్షరాలతో ఉన్న నాలుగు రాగిరేకుల్ని తీసి వారికిచ్చాడతను.‘వత్సలారా! వీటిని పట్టుకుని, మీ నలుగురూఉత్తర దిశగా ప్రయాణించండి. అలా ప్రయాణించగా ప్రయాణించగా మీలో అల్పసంతోషి చేతిలోని రేకు ముందు కింద పడుతుంది. రేకు ఎక్కడయితే కిందపడ్డదో అక్కడ తవ్వి చూడండి. మీకు నిధి లభిస్తుంది. దానిని నలుగురూ పంచుకోండి. మీ దరిద్రం పేదరికం పటాపంచలవుతుంది.’ అన్నాడు యోగి.‘మహాప్రసాదం’ అన్నారు యువకులు.‘ఆ నిధి చాలదనుకుంటే మిగిలిన వారు ఇంకా ముందుకు ప్రయాణించి మీ మీ అదృష్టాలను పరీక్షించుకోండి.’ అన్నాడు.‘ఓహో! అద్భుతం’ అన్నారు యువకులు.

రాగిరేకుల్ని తలా ఒకటి పట్టుకుని అక్కణ్ణించి ముందుకు నడిచారు. ఉత్తరాభిముఖంగా ప్రయాణించసాగారు. కొద్దిదూరం ప్రయాణించాక అప్రయత్నంగానే ఒకని చేతిలోని రాగిరేకు కిందపడింది. చిత్రంగా బాణంలా అది నేలలోనికి దూసుకుపోయింది. అక్కడ తవ్వి చూశారంతా. ఎర్రటి రాగి లోహపు ముద్దలతో ఉన్న పెద్ద పాతర బయటపడింది.‘చాలిది, మనకు చాలు! నలుగురం పంచుకుందాం.’ అన్నాడు రాగిరేకును పోగొట్టుకున్న వ్యక్తి.‘దీన్ని అమ్ముకుంటే చెప్పలేనంత డబ్బు వస్తుంది. జీవితాంతం హాయిగా బతికేయొచ్చు.’ అన్నాడు.మిగిలిన ముగ్గురూ వినలేదు.‘రాగితో తృప్తిపడడం అవివేకం. యోగిఏమన్నాడు? ముందుకు ప్రయాణించి ఎవరి అదృష్టం వారు పరీక్షించుకోండి అన్నాడు. పరీక్షించుకుంటాం. మేం ముందుకు వెళ్తాం.’ అన్నారు ముగ్గురూ.

ముందుకు నడిచారు. రాగితో సంతృప్తి చెందిన వ్యక్తి పాతరను తవ్వుకుని సంచుల్లో నింపుకుని వెనుతిరిగాడు.ప్రయాణిస్తూ ఉండగా ముగ్గురిలో ఒకని చేతిలోని రాగిరేకు అప్రయత్నంగా కిందపడి, భూమిలోనికి బాణంలా చొచ్చుకుపోయింది. అక్కడ తవ్వి చూశారంతా. వెండి దొరికింది వారికి.‘వెండి, ముగ్గురం పంచుకుందాం రండి.’ అన్నాడు రాగిరేకుని కోల్పోయిన యువకుడు.‘మన జీవితాలకు ఇది చాలు’ అని మురిసిపోయాడు.‘నువ్వు ఈ వెండితో తృప్తిపడు. మేం ముందుకు నడుస్తాం. బంగారం దొరుకుతుందని ఆశగా ఉంది.’ అన్నారు ఇద్దరు మిత్రులు.‘భోగం అనుభవించాలంటే బంగారమే దొరకాలి.’ అన్నారంతలోనే. వెళ్ళిపోయారక్కణ్ణుంచి. వెండిని నిండుగా సంచులకెత్తుకోసాగాడు, వెండితో సరిపెట్టుకున్న యువకుడు. వెనుతిరిగాడు.