భేతాళుని హితోపదేశం



భేతాళుడు విక్రమార్కుని ఉద్దేశించి యిలా అన్నాడు: "మహారాజా! ఈ సన్యాసి చాలా క్రూరుడు. కాళికాదేవి అనుగ్రహంకొరకు యిప్పటికి 99 మంది రాజపుత్రులను మోసగించి దేవికి బలి యిచ్చాడు. నిన్ను గూడ బలి యిచ్చిన 100 అవుతాయి. దేవి ప్రత్యక్షమై అనుగ్రహిస్తుంది.

కావున నీవే అతనిని దేవికి బలియిచ్చి, దేవి అనుగ్రహము పొందుము. నీవు సాహసుడవు, ప్రజలను పాలించు దయాకరుడవు. కావున, నీ వంటి వాడు బ్రతుకవలెను. నేనుకూడ నీకు వళమై యుందును" అని హితోపదేశం చేశాడు. రాజు విని సంతోషించాడు.

క్రమంగా భేతాళునితో సన్యాసి వద్దకు వచ్చాడు విక్రమార్కుడు. అప్పటికే సన్యాసి, దేవీ విగ్రహం ముందు అలికి ముగ్గులు పెట్టి ఉంచాడు. భేతాళ పూజకు, దేవీ పూజకు అగ్నిహోత్రము కూడ సిద్ధము చేశాడు.

సన్యాసి దగ్గరకు విక్రమార్కుడు వచ్చి, భేతాళుని దించగానే ఎంతో సంతోషించాడు. "మహారాజా! నీ సాహసం మిక్కిలి కొనియాడతగినది. నాకు ఎంతో మేలు చేశావు, దేశానికిని ఎంతో శుభమును చేకూర్చావు. స్నానము చేసి రమ్ము దేవిని పూజింతము" అన్నాడు విక్రమార్కుడు. స్నానము చేసి వచ్చాడు.
రాజును చూచి - సన్యాసి "మహారాజాః నేను నీవు వచ్చులోపల అంతయు సిద్ధము చేశాను. ఇక నమస్కారము చేయుము. సాష్టాంగముగా నమస్కరింపుము" అన్నాడు. విక్రమార్కుడు చుట్టూ పరికించి చూశాడు. దేవీ విగ్రహం దగ్గరనే వాడియైన ఖడ్గం ఉంది. అతడు సన్యాసిని చూచి "మహాత్మా! నేను మహారాజును గదా! ఒకరి వలన నమస్కారములు పొందుటయే గాని, చేసి యెరుగను. కావున తాము ముందుగా సాష్టాంగముచేసి చూపుడు" అని వినయము నటించుతు పలికినాడు.

సన్యాసికి ఏ అనుమానమూ కలుగలేదు. వెంటనే తాను దేవి ముంగట సాష్టాంగపడి "యిలా చేయాలి" అని పలుకుచుండగనే (భేతాళుని ఉపదేశం ప్రకారం) విక్రమార్కుడు ప్రక్కగల ఖడ్గం తీసి ఒక్క వేటున సన్యాసిని ఖండించినాడు. వెంటనే దేవి ముంగటగల గంటలు గణగణ మ్రోగినవి. దేవి కాళికా మాత, భేతాళుడు ప్రత్యక్షమైనారు. విక్రమార్కుని దీవించారు. దేవి యిలా అంది;
"విక్రమార్కా! నీ సాహసం అమోఘం.నికిదివరకే వరాలు నిచ్చాను. యిప్పుడు భేతాళుడు గూడ నీకు వశమైనాడు. భట్టి భేతాళుర సాయంతో నీవు రెండువేల సంవత్సరాలు హాయిగా జీవించు" అంది.

ఈ విధంగా విక్రమార్క చక్రవర్తి భట్టి. భేతాళుర సహాయంతో రెండువేల సంవత్సరాలు రాజ్యపాలన గావించినాడు. అనేక సాహసకార్యాలు చేసి ప్రజలకు మేలు గావించినాడు.
విక్రమార్కుని సాహసమును, ప్రజాపరిపాలనమును గాంచి స్వర్గాధిపతి యింద్రుడు- విక్రమార్కుని స్వర్గానికి ఆహ్వానించాడు. 32 సాల భంజికలుగల ఒక సింహాసనాన్ని కూడ బహుమతి చేశాడు.

విక్రమార్కుడు దేవి అనుగ్రహించిన రెండువేల సంవతర్పముల తరువాత - శాలివాహునుడు అను రాజు కారణంగా దివంగతుడయినారు.
విక్రమార్కుని మరణం తరువాత దేవేంద్రుడు విక్రమార్కుని కొసగిన సింహాసనం- దానిని అధిష్టించు మహారాజు లేనందువలన- భూస్థాపితం అయింది. ఆ తరువాత ఎన్నో సంవత్సరాలకు ఆ విక్రమార్క సింహాసనం - "ధారానగరం" పరిపాలించు భోజమహారాజుకు లభించింది.

Responsive Footer with Logo and Social Media