భయం
సీతయ్య రావుబహుద్దూర్ గారింట్లో పనివాడు చాలా పిరికివాడు. ప్రతీ విషయానికి భయపడుతూ వుండేవాడు. సీతయ్య పిరికితనాన్ని ఆసరాగా తీసుకుని ఊర్లో కొందరు తమ సరదాలకు తెగ ఏడ్పించేవారు తిరిగి ఎదిరిస్తే చితకబాదుతారన్న భయంతో వనికిపోయేవాడు.
ఓ రోజు జమీందారుగారి భార్య అరటిగెలకోసం తోటకు సీతయ్యని పంపించింది. సీతయ్య తోటకెళ్ళి అరటిగెలను తీసుకుని వస్తుండగా దార్లో చెట్లకొమ్మల పైనుండి కొన్ని కోతులు చూశాయి. చటుక్కున ఎగిరి సీతయ్యముందు నిలబడ్డాయి. సీతయ్య భయంతో పరుగుతీశాడు. కానీ కోతులు వదలకుండా అరటిగెలకోసం తరమసాగాయి. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి నిలబడిపోయాడు. అటువైపు వెళ్తున్న స్వామిజీ దగ్గరకెళ్ళి “స్వామి! నన్ను రక్షించండి. ఆ కోతులు ఈ అరటిగెల కోసం చాలాసేపు తరుముకొస్తున్నాయి” అని చెప్పాడు సీతయ్య, స్వామీజీ ఓ నవ్వు నవ్వి "చూడు నాయనా! నువ్వు భయవడేకొద్దీ నిన్ను తరుముకుంటూ వస్తాయి. ప్రతీ విషయంలో కూడా ఇంతే. భయపడేకొద్దీ ఇలానే వుంటుంది. నువ్వు ఒకసారి వాటిని తరిమికొట్టు అవి నీ జోలికి రావు” అన్నాడు స్వా.మీజీ పక్కనే పడివున్న కర్రని తీసుకుని కోతులను తరిమి తరిమి కొట్టాడు. సీతయ్య అన్ని కోతులూ పారి పోయాయి. ఆ రోజునుండి సీతయ్య అన్ని విషయాల్లో ధైర్యంగా వుండసాగాడు చూశారా బాలలూ. కష్టం వచ్చినపుడు భయపడిపోకూడదు. ధైర్యంగా ఎదుర్కోవాలి.