పులి-బాటసారి కథ



ఒక చెరువు గట్టున ఉన్న పెద్ద పొదలో ఒక ముసలి పులి నివశిస్తుంది. అది ఆ దారిలో పోవుచున్న బాటసారినొకనిని చూచి "ఓ బాటసారి! ఇదిగో నావద్ద ఒక బంగారు కడియం ఉంది. దీనిని ఏ పుణ్యాత్మునికైనాదానం చేయవలెనని ఎంత కాలం నుండో ఎదురుచూచు చున్నాను. అదృష్టవశమున ఈ రోజు నీవు కనబడినావు. నాయందు దయతలచి ఆ చెరువులో శుద్దిగా స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణము తీసుకో" అని తన వద్దనున్న బంగారు కడియము చూపినది. ధగధగమని మెరుస్తున్న ఆ కడియమును చూడగానే బాటసారికి ఆశ కలిగింది. కాని పులి వద్దకు పోతే అది తనను చంపుతుందేమో అని భయంతో వణికిపోయాడు. ఒకవైపు బంగారం కడియం, మరొకవైపు భయం.

అయినా ధైర్యం తెచ్చుకొని ఆ పులితో "పులిరాజా! నీవు క్రూర జంతువు, నిన్ను నమ్మి నేను నీ వద్దకు ఎలా రాగాలను? బంగారు కడియం కొరకు ప్రాణాలు తీసుకొనువారు ఉన్నారా?" అనగా, అప్పుడు పులి "నేను క్రూర జంతువునే, నీవు భయపడుట న్యాయమే. కాని నేను నీ వయస్సులో ఉన్నపుడు అనేక పాపములు చేశాను. ఎన్నో జంతువులను, ఎందరో మనుష్యులను పొట్టనబెట్టుకున్నాను. ఆ పాపమును పోగొట్టుకొనుటకే ఈ కడియమును దానముచేయదలిచాను. లేవలేని సత్తు పండు ముసలదాన్ని, గోళ్ళు మోద్దువారినవి, పండ్లూడిపోయినవి, కళ్ళు కూడా సరిగా కనపడటం లేదు. మాంసభక్షమే మానివేసి కాయకసరులతో కడుపు నింపుకొనుచున్నాను. కనుక ఎటువంటి అనుమానం పెట్టుకొనక స్నానము చేసి రమ్ము. రేపో మాపో చావనున్న నన్ను చూచి భయపడకు" అని చెప్పింది. దురాశతో బాటసారి పులి మాట నమ్మి స్నానము చేయుటకు చెరువులో దిగి అందులోని బురదలో కూరుకుపోయి పైకి రాలేక "అయ్యో! బురదనేలలో దిగబడిపోవుతున్నాను. రక్షించండీ! రక్షించండీ! అని అరవగా, పులి భయపడకు! నేను వచ్చి నిన్ను రక్షించి పైకి తీయుదును" అని అతని వద్దకు వచ్చి మీదకు దూకి చంపి తృప్తిగా ఆరగించినది. దురాశకు పోయి దుర్మరణం పాలైన బాటసారి వలే మనం కూడా నూకలకై నేల వాలితే ముప్పు తప్పదు" అన్నది.

అంతలో ఒక ముసలి పావురం "నేను మీ అందరికంటే పెద్దవాడను, నా వంటి పెద్దల సలహాలను తప్పక వినాలి. లేని పోనీ అనుమానం పెట్టుకొని, ఆకలితోనున్న మనం ఎదురుగా ఉన్న ఆహారం ఒదులుకొని మరొక చోటుకు పోవటం అవివేకం. చిత్రగ్రీవుని అనుమానం మనకు తెలియదా? అందరం కిందకు దిగి నూకలు తిందాం రండీ!" అని ఆ పావురం నేలవాలింది. ఆకలితో ఉన్న మిగతా పావురములన్నియు కూడా నెల వాలి వలలో చిక్కుకున్నవి. పావురములు చిత్రగ్రీవుని మాటలు విననందుకు విచారించి ముసలి పావురమును తిట్టసాగినవి. చిత్రగ్రీవుడు పావురములతో "మిత్రులారా! మీరు ఇతనిని దూషించినందువల్ల ప్రయోజనం లేదు, తనకు తోచినది చెప్పాడు. అపుడు మన బుద్దులేమైనవి? ఆకలికి ఆగలేక ఆశకు పోయినాము, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని ఆలోచించుకోవాలి గాని, మనలో మనము కీచులాడుకొనిన ప్రయోజనం లేదు. అదిగో వేటగాడు వచ్చుచున్నాడు, నాకొక ఉపాయము తోచుచున్నది. ఐకమత్యమునకు మించిన బలం మరొకటి లేదు, మనమందరం కలిసి ఒక్కసారిగా పైకెగిరనచో వల కూడా మన వెంటే వస్తుంది, అందుకని ఒక్కాసారిగా పైకి ఎగురుదాం" అని చిత్రగ్రీవుడు చెప్పగా, అతని ఉపాయముకు సంతోషించి ఒక్కసారిగా పైకి ఎగిరినవి. ఆ పావురాలతోపాటు వల కూడా పైకి లేచింది.

వలలో పైకెగిరిన పావురాలను చూచి వేటగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. పావురాళ్ళు చిక్కకపోయినా పర్వాలేదు, తన జీవనాధారమైన వలైనా దొరుకుతుందేమో అని అతడు ఆ పావురములు పరుగెత్తిన దిక్కుగా కొంతదూరం వెళ్లి ఇక వానిని వెంబడించలేక నిరాశతో ఇంటి దారి పట్టాడు. ఈ వింత చూస్తున్న లఘుపతనకము అనే కాకి పావురములు ఏమి చేయునో, వల నుండి ఎట్లు తప్పించుకొనునో చూద్దామని వాని వెంట ఎగురుతూ ప్రయాణించింది. పావురములు కొంత దూరం పోయిన తర్వాత చిత్రగ్రీవుడు ఆ అడవిలో ఒక చెట్టు చూపి, "మిత్రులారా! మనము ఈ చెట్టు కింద నేలపై వాలుదాము. అచట భూమి కన్నంలో నా బాల్య స్నేహితుడు హిరణ్యకుడను ఎలుక నివశిస్తున్నాడు. అతడు వల త్రాళ్ళు కొరికి మనందరినీ విడిపించగలడని చెప్పింది. ఆ మాటలకు పావురములన్నియు సంతోషించి హిరణ్యకసికుని కన్నం వద్ద వాలాయి. ఆ చప్పుడు విని హిరణ్యకసికుడు భయంతో కన్నంలో దూరాడు. చిత్రగ్రీవుడు మెల్లగా కన్నం దగ్గరకు పోయి "మిత్రమా హిరణ్యకా! నేను నీ చిన్ననాటి స్నేహితుడను చిత్రగ్రీవుడను, భయములేదు బయటకు రమ్మని పిలిచాయి. చిత్రగ్రీవుని గొంతు గుర్తు పట్టి హిరణ్యకుడు కన్నం నుండి బయటకు వచ్చి వలలో చిక్కు పడిన పావురములను చూచి "అయ్యో వలలో చిక్కుకుంటివా! నిన్ను క్షణంలో విడిపించెద"నని అతని వద్దకు వెళ్ళివలను కొరకబోగా చిత్రగ్రీవుడు "మిత్రమా ముందుగా నా మిత్రులందరినీ విడిపించు, ఆ తరువాత నన్ను విడిపించు. తనెంత ఆపదలలో ఉన్ననూ తనవారి కష్టములు తొలిగించువాడు నిజమైన మిత్రుడు, స్వార్థము సర్వనర్థములకు మూలము. స్వార్థపరుడు బతికియున్ననూ చచ్చిన వానితో సమానము. కనుక నీ పంటి బలమున్నంత వరకు నావారిని విడిపించుము. తరువాత నన్ను విడిపించు" అన్నాడు.

ఆ మాటలకు హిరణ్యకుడు పరమానందము చెంది "నీ వంటి మంచి మిత్రుడు లభించుట నా పూర్వ జన్మ సుక్రుతము. నీ వారిపై నీకు గల ప్రేమ సాటిలేనిది. నీవు కోరినవిధంగా ముందు నీ సహచరులనే విడిపించెదను" అని పలికి ఎంతో ఉత్సాహంతో వల త్రాళ్ళు కొరికి పావురములన్నింటిని వలనుండి విడిపించినది. చిత్రగ్రీవుడు హిరణ్యకుని కౌగలించుకుని "మిత్రమా! నీ మేలు మేము ఎన్ని జన్మలకైననూ మరువలేము పోయివత్తుము సెలవిమ్మని" కృతజ్ఞతలు తెలిపి పావురములన్నియు కలిసి బయలుదేరినవి. వారిని సాగనంపి చిత్రగ్రీవుని అభినందించుచుహిరణ్యకుడు కన్నంలోకి పోయాడు.

ఇదంతయు చూసి, లఘుపతనకము అను కాకి హిరణ్యకునితో స్నేహం చేయవలెనని తలిచి కన్నం వద్దకు వెళ్లి, "మిత్రమా హిరణ్యకా! నేను లఘుపతనకమనుకాకిని. నీవు పావురములకు చేసిన మేలు కనులారా చూశాను. నీ వంటి ఉత్తమునితో స్నేహము చేయవలెనని వచ్చితిని. దయ ఉంచి బయటకు వచ్చి నాతో స్నేహం చేయుము" అనగా హిరణ్యకుడు "నీవు చెప్పే మాటలు చాలా బాగున్నవి. స్నేహము ఎవరితో చేయాలో నాకు బాగా తెలుసు. కాకులు ఎలుకలకు ఆజన్మ శత్రువులు. నీతో స్నేహము నా ప్రాణానికే ముప్పు. నీ తీపి మాటలకుమోసపోవునంత అమాయకుడనుకాను. పూర్వము ఒక లేడి నక్క మాటలు నమ్మి మోసపోయి ఆపదలో చిక్కి చివరకు తన మిత్రుడగు కాకి వలన రక్షించబడినది. ఆ కథ చెప్పెద వినుము అని ఈ విధంగా చెప్పసాగింది.