బంగారు వెంట్రుకలపిల్లవాడు
ఒక అడవిలో ఎలుక, ఎలుగుబంటి ఉండేవి. అవి కలిసి మొక్కజొన్న చేను వేశాయి. పంట పండిన తరువాత సమానంగా పంచుకోవాలనుకున్నాయి. కొద్ది రోజులకు పంట పెరిగింది. కానీ ఎలుకకు దురాలోచన కలిగింది. రాత్రిపూట మొక్కజొన్న కంకులన్నీ తెంపి తన కలుగులో దాచివేసింది. మరునాడు ఎలుగుబంటి వచ్చి చూసేసరికి ఒక్క కంకి కూడా కనిపించలేదు.
అప్పుడు ఎలుగుబంటి ఎలుకతో గొడవకు దిగింది. "పంట అంతా నువ్వే కాజేశావు" అంది. "కాదు, నువ్వే" అంది ఎలుక. రెండూ వాదులాడుకోసాగాయి. ఆ సమయంలో పదేళ్ళ పిల్లవాడు పశువులు మేపుకుంటూ అక్కడున్నాడు. ఎలుక అతన్ని పిలిచి "మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ కంకులు తింటారు చెప్పు" అని అడిగింది. అందుకా పిల్లవాడు "ఎలుగుబంటి ఎక్కువ కంకులను తింటుంది" అని చెప్పాడు.
అప్పుడు ఎలుగుబంటి కోపంతో "నువ్వు కూడా నన్ను మోసం చేయాలని చూస్తున్నావు కదా! నిన్ను చంపి నా పగ తీర్చుకుంటాను!" అంది. పిల్లవాడు భయపడిపోయాడు. ఇంటికి పరుగెత్తాడు. అతను తన అమ్మకు విషయం చెప్పాడు. "నువ్వేమీ భయపడకు. మంచంమీద పడుకో. నేను క్రింద పడుకుంటాను" అంది తల్లి. పిల్లవాడు మంచం మీద నిద్రపోయాడు. మంచం ప్రక్కన నేలమీద తల్లి పడుకుంది.
అర్థరాత్రి ఎలుగుబంటి వాళ్ళ ఇంటికి వచ్చింది. పిల్లవాడి మంచం క్రింద దూరింది. మంచంతో సహా పిల్లవాడిని వీపుమీద వేసుకుని అడవిలోకి బయలుదేరింది. చాలాదూరం వెళ్ళాక పిల్లవాడికి మెలకువ వచ్చింది. ఎలుగుబంటి తనను చంపడానికి తీసుకువెళ్ళిపోతుందనే దానిని అర్థం చేసుకున్నాడు. ఎలుగుబంటి వెళ్ళినప్పుడు, అతను తన వెంట్రుకలను మంచానికి ముడులుగా వేసి, మర్రిచెట్టు క్రింద నుండి ఊడలు పట్టుకున్నాడు.
ఖాళీ మంచంతో ఎలుగుబంటి ఒక పెద్ద బావి వద్దకు వెళ్ళింది. మంచం మీద పిల్లవాడు ఉన్నాడని భావించి, మంచాన్ని బావిలోకి విసిరింది. కానీ, మర్రి ఊడలు పట్టుకున్న పిల్లవాడు చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. అక్కడనుంచి ఆకలి తీరాక, పాలు పెరుగు ఉన్న కుండల వద్దకు వెళ్ళాడు. అక్కడ కుండల్లో పాలు, పెరుగు తాగాడు.
పాలు, పెరుగు ఎందుకు తగ్గుతున్నాయో తెలుసుకోవాలనుకున్న ఆవులు ఒక దూడను కాపలా ఉంచి వెళ్ళాయి. మూడవనాడు, పిల్లవాడు కుండల వద్దకు రాగానే దూడ కేకలు వేసి ఆవులను పిలిచింది. ఆవులు చుట్టుముట్టి “ఎవరు నువ్వు? ఎందుకు మా పాలు తాగుతున్నావు?" అని ప్రశ్నించాయి.
పిల్లవాడు తన కథ చెప్పాడు. ఆవులు జాలిపడి "నువ్వు మాతో ఉండిపో, పాలు, పెరుగు తాగి ఆకలి తీర్చుకో" అన్నాయి. పిల్లవాడు ఆవులతో సంతోషంగా జీవించసాగాడు.
కొన్ని సంవత్సరాల తరువాత, పిల్లవాడికి ఇరవై సంవత్సరాల వయస్సు వచ్చేసింది. పాలు, పెరుగు తాగడం వల్ల అతని తల బంగారు రంగులోకి మారిపోయింది. ఒకరోజు, పిల్లవాడు నదిలో స్నానం చేస్తుండగా, ఒక బంగారు వెంట్రుక రాలిపోయి, నది ప్రవాహంలో కొట్టుకుపోయింది. రాజు చాకలి ఒకావిడ ఆ నదిలో బట్టలు ఉతుకుతుంది. ఆ వెంట్రుక ఆమె బట్టలకు అంటుకుంది.
యువరాణి ఆ వెంట్రుకను చూసి ఆశ్చర్యపోయింది. ఆమె తండ్రి ఆమెను వివాహం చేయాలనుకున్నాడు. "నీ మనసులో ఎవరైనా ఉన్నారా?" అని అడిగాడు. ఆమె బంగారు వెంట్రుకను చూపించి "ఈ వెంట్రుకలు ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను" అని చెప్పింది.
రాజు అడవికి వెళ్లి పిల్లవాడిని కలిశాడు. "నా కూతుర్ని వివాహం చేసుకుని నా రాజ్యాన్ని పరిపాలించమన్నాడు. "అందుకు పిల్లవాడు "ఆవుల్ని వదిలి రావడం నాకు ఇష్టం లేదు" అన్నాడు. అప్పుడు ఆవులు “నువ్వు పెళ్లి చేసుకుని హాయిగా బ్రతకాలన్నది మా కోరిక” అన్నాయి. పిల్లవాడు సరేనని రాజుతో బయలుదేరాడు. యువరాణిని పెళ్లి చేసుకున్నాడు. తన తల్లిదండ్రులను కలుసుకున్నాడు. రాజ్యాన్ని పరిపాలిస్తూ హాయిగా జీవించాడు.