బలహీనుని యుక్తి
ఒక సాలెవాడు తన నేసిన బట్టకు గంజి పెడుతున్నాడు. కొన్ని ఈగలు పదేపదే వచ్చి ఆ బట్టమీద వాలిపోయాయి. ఎన్నిసార్లు తోలినా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. సాలెవాడు కోపంతో వాటిని చేత్తో చరిచాడు. ఒకే దెబ్బకు పది ఈగలు చచ్చిపడ్డాయి. "నేను ఒక్క దెబ్బకు పది ఈగల్ని చంపాను" అని చెప్పాడు సాలెవాడు మరో వ్యక్తితో. అతడు మరో వ్యక్తికి చెప్పాడు. ఇలా ఈ విషయం బాగా పాకిపోయింది. రాజుకు తెలిసింది.
రాజు ఆ సాలెవాడిని పిలిపించాడు. "నువ్వు అంత మొండివాడివైతే మన ఊరి శివాలయంలోకి రోజు ప్రసాదం పెట్టే వేళకు ఒక పెద్ద పులి వచ్చి జనాన్ని చంపి తింటుంది. దాన్ని చంపి అందరినీ కాపాడిపో" అన్నాడు రాజు. సాలెవాడికి భయం పట్టింది. "కాదు అంటే రాజు ఏం చేస్తాడోనని కూడా భయపడ్డాడు." సరేనని ఒప్పుకున్నాడు.
మరునాడు సాలెవాడు శివాలయానికి వెళ్ళి కూర్చున్నాడు. ప్రసాదం పెట్టే సమయం అయ్యింది. అప్పుడే పెద్ద పులి గాండ్రించుకుంటూ వచ్చింది. సాలెవాడు మొండి ధైర్యంతో పెద్దపులికి ఎదురువెళ్ళాడు. చేతికి అందిన రాళ్ళను తీసి దానిమీదకు విసరడం మొదలుపెట్టాడు. చివరకు పులిని చంపివేశాడు. తాను అలాగే రాజు దగ్గరకు వెళ్ళితే నమ్మడేమోనని, తన బట్టలు చింపుకొని ఒళ్ళంతా రక్కిపోయాడు. "పులితో పోరాటం చేసి చంపాను" అని చెప్పాడు.
రాజు చాలా సంతోషించాడు. సాలెవాడిని సైన్యాధిపతిగా నియమించాడు.
ఒకరోజు రాజు మీద ప్రక్కరాజ్యం రాజు యుద్ధానికి వచ్చాడు. రాజు సాలెవాడిని పిలిచి, "సైన్యంతో వెళ్ళి శత్రు రాజ్యాన్ని ఓడించి రమ్మని" చెప్పాడు. సాలెవాడు తెల్లబట్టలు ధరించి, తెల్లని గుర్రం ఎక్కి, కత్తి ధరించి యుద్ధానికి వెళ్లాడు. ఎదురుగా ప్రక్కరాజ్యం సైన్యం నిలబడి ఉంది. సాలెవాడు వెళ్ళే దారిలో దారికి ఇరువైపులా తాళ్ళు కట్టబడి ఉన్నాయి. అవి ఎప్పుడో కట్టబడ్డాయి. ఎండకు వానకు దెబ్బతిని చీకిపోయాయి.
సాలెవాడు గుర్రంమీద వస్తూ ఆ రెండు తాళ్ళను పట్టుకున్నాడు. అవి పుటుక్కున తెగిపోయాయి. శత్రురాజు ఈ దృశ్యాన్ని చూశాడు. సైన్యం లేకుండా ఒక్కడే తెల్లబట్టలు ధరించి రావడం, తాళ్ళను తెంపడం చూసి ఇతనెవరో మహాబలవంతుడిలా ఉన్నాడని భావించాడు. ఇతనితో యుద్ధం చేస్తే తాను ఓడిపోతానని భయపడ్డాడు. వెంటనే తన సైన్యంతో వెనుదిరిగి వెళ్ళిపోయాడు.
సాలెవాడు రాజు వద్దకు వెళ్ళి శత్రురాజు పారిపోయాడని చెప్పాడు. రాజు సంతోషించి ఆ రాజ్యానికి సాలెవాడిని రాజుగా చేశాడు.