ఆషాడభూతి కథ



పింగళకుడు, సంజీవకుడు స్నేహితులయిపోయారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు. కలిసి ప్రయాణిస్తున్నారు. కలిసి తింటున్నారు. కలిసి కబుర్లాడుకుంటున్నారు. వారి మధ్యకు ఇంకొకరు చొరుకునే అవకాశమే లేకుండా పోయింది.దమనకుణ్ణి ఇద్దరూ పట్టించుకోవడం మానేశారు. దానిని భరించలేకపోయాడు దమనకుడు. కరటకుణ్ణి కలిశాడు. దమనకుణ్ణి చూస్తూనే కరటకుడు అంతా గ్రహించాడు. ఇలా అన్నాడతనితో.‘‘చూశావా, నువ్వు ఒకటి అనుకున్నావు. ఇంకొకటి అయింది. అదే నేను చెప్పింది. రాజుల తీరే వేరు. వారు ఎవరిని చేరదీస్తారో, ఎందుకు చేరదీస్తారో ఎవరికీ అంతుచిక్కదు. చెబితే విన్నావు కాదు. పైగా ఆ సంజీవకుణ్ణి తీసుకుని వెళ్ళి పింగళకునికి స్నేహితుణ్ణి చేశావు. ఏమయిందిప్పుడు? అక్కడ నీకే చోటు లేకుండా పోయింది.’’‘‘అవును. తప్పు చేశాను. ఒప్పుకుంటున్నాను.’’ అన్నాడు దమనకుడు.‘‘ఒప్పుకోక తప్పుతుందా?’’‘‘ఇదిగో! ఈ మాటలే వద్దు. బాధపడుతున్న వాణ్ణి మరింత బాధపెట్టకు. అయినా నిన్నని ఏం లాభం? దేవుడి దయ లేకపోతే ఏ పనీ జరగదు. నమ్మి మోసపోవడం రాసి పెట్టి ఉంది. జరిగింది. ఆషాఢభూతి కథ గుర్తొస్తోంది.’’‘‘ఏంటా కథ?’’చెప్పసాగాడు దమనకుడు.

‘‘అనగనగా ఒక ఊరిలో దేవశర్మ అనే సన్యాసి ఉండేవాడు. అతడేం నిజం సన్యాసి కాదు, దొంగసన్యాసి. డబ్బు మీద ఆశ లేదంటూనే డబ్బు కోసం రకరకాల వేషాలు వేసేవాడతను. ఊరూరా తిరుగుతూ వేదాంతాన్ని బోధించేవాడు. ఆ వేదాంతాన్ని వినడానికి జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు. దేవశర్మ చెప్పిన వేదాంతానికి ముగ్ధులై జనం అతనికి దోసిళ్ళతో దక్షిణలూ, కానుకలూ ఇచ్చేవారు. వద్దు వద్దంటూనే అన్నిటినీ స్వీకరించేవాడతను. పట్టించుకోనట్టుగా పక్కన పడేసేవాడు. చీకటి పడ్డాక, భక్తులంతా వెళ్ళిపోయిన తర్వాత తలుపులు వేసుకుని, వచ్చిన కానుకల్నీ, దక్షిణల్నీ లె క్కపెట్టుకుని మరీ జాగ్రత్త చేసేవాడు. కొంతకాలానికి దేవశర్మ దగ్గర చెప్పలేనంత సొమ్ము పోగయింది. దానిని ఒక బొంతలో దాచి, ఆ బొంతను ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకునేవాడు దేవశర్మ. దీనిని ఓ దొంగ కనిపెట్టాడు. దేవశర్మ దాచుకున్న సొమ్మును ఎలాగయినా కాజేయాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం ఆ దొంగ పరమభక్తుడి వేషం వేసుకుని, దేవశర్మను దర్శించాడు. ఆ సమయానికి దేవశర్మ భక్తులకు వేదాంతాన్ని బోధిస్తున్నాడు. బోధించి బోధించి ఊపిరి తీసుకునేందుకు ఆగాడో లేదో, దేవశర్మ కాళ్ళ మీద పడ్డాడు దొంగ.‘‘ఎంత అద్భుతంగా సెలవిచ్చారు’’ అని మెచ్చుకున్నాడు. తర్వాత లేచి, చేతులు కట్టుకుని వినయ విధేయతల్ని కనబరిచాడు. దేవశర్మ వేదాంతాన్ని బోధిస్తూంటే ‘ఆహా ఓహో’ అంటూ చప్పట్లు కొడుతూ, తన్మయత్వంగా కళ్ళు మూసుకుంటూ, అంతలోనే చేతులు జోడిస్తూ పదే పదే దేవశర్మ కళ్ళల్లో పడే ప్రయత్నం చేశాడు. భక్తులు మాట్లాడుకుంటుంటే, దేవశర్మ వేదాంతబోధకి అది అడ్డంకి అన్నట్టుగా భక్తులని మాట్లాడవద్దన్నట్టుగా సైగలు కూడా చేశాడు. బోధ ముగిసింది. అయినా భక్తులు కదల్లేదు. గురువుగారి పట్ల భక్తితో ఇంకా అక్కడే కూర్చున్నారు. అప్పుడు కలుగజేసుకున్నాడు దొంగ.

‘‘గురువుగారు అలసిపోయారు. వారు విశ్రాంతి తీసుకోవాలి. అంతా వెళ్ళి రండి.’’ అన్నాడు. అందర్నీ సాగనంపాడు. దేవశర్మ, దొంగ ఇద్దరే ఉన్నారప్పుడు. విసనకర్రతో దేవశర్మకు విసరసాగేడు దొంగ. అతని భక్తికీ, వినయ విధేయతలకీ పొంగిపోయాడు దేవశర్మ. అడిగాడిలా.‘‘ఎవరు నువ్వు? నన్నెందుకు ఇంతలా సేవిస్తున్నావు?’’‘‘నా పేరు ఆషాఢభూతి. ‘ఎవరు నువ్వు’ అని మీరడిగారే, అది తెలుసుకుందామనే ఇక్కడికి వచ్చాను. మీకు సేవలు చేసి, మీ దగ్గర ఉన్న జ్ఞానధనాన్ని పొందాలని ఆశతో వచ్చాను. నన్ను కాదనకండి. మీ శిష్యుడిగా నన్ను స్వీకరించండి.’’ అన్నాడు దొంగ. వాడి మాటల్ని నమ్మేశాడు దేవశర్మ.‘‘అలాగే’’ అన్నాడు.అప్పటి నుంచీ అవకాశం కోసం ఎదురు చూస్తూ దేవశర్మను అంటిపెట్టుకునే ఉండేవాడు దొంగ. దేవశర్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి నీడలా అతన్ని వెంటాడేవాడు. దేవశర్మతో పాటుగా ఊరూరా తిరుగుతూ, గురువుగారికి ఎప్పుడు ఏది అవసరమో అది తీరుస్తూ ఉండేవాడు. క్షణక్షణం భక్తి, వినయం, వైరాగ్యాల్ని నటించేవాడు. ఒకనాడు గురుశిష్యులిద్దరూ కాలి నడకన ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్తున్నారు. గురువుగారు ఏదో బోధిస్తున్నాడు. వింటున్నాడు దొంగ. వింటూ వింటూ ‘కెవ్వు’న కేకేశాడు.‘‘ఏమయిందయ్యా?’’ అడిగాడు దేవశర్మ.

‘‘మహాపరాధం జరిగిపోయింది. చూడండి.’’ అంటూ తన పంచెకు అంటుకుని ఉన్న గడ్డిపరకను తీసి చూపించాడు దొంగ.‘‘ఈ గడ్డిపరక రాత్రి మనం బస చేసినవారింటి చూరిది. ఎలా అంటుకుందో నా పంచెకు అంటుకుంది. ఇది నాది కాదు. వారిది. వారిది వారికి ఇచ్చి వెయ్యాలి. ఇప్పుడే వస్తాను.’’ అంటూ వెను తిరిగాడు దొంగ.‘‘పర్వాలేదయ్యా, గడ్డిపరకే కదా’’ అని దేవశర్మ నచ్చజెప్పబోయాడు.‘‘వద్దండి. పరుల సొమ్ము పాములాంటిది. మనకెందుకది?’’ అన్నాడు దొంగ.‘‘మీరు నడుస్తూ ఉండండి. నేను ఇట్టే వెళ్ళి అట్టే వస్తాను.’’ అంటూ పరుగుదీశాడు.‘‘అది కాదు ఆషాఢభూతీ! గడ్డిపరక తిరిగి ఇవ్వడమేమిటి, మరీ అర్థం లేకుండా మాట్లాడుతున్నావు?’’‘‘అర్థం ఉంది గురువుగారు. మనది కానిదేదీ మనం ఉంచుకోకూడదు. మీరే ఈ విషయం మొన్న చెప్పారు. మరిచిపోయారు.’’ అంటూ రివ్వున వెళ్ళిపోయాడు. పరుగున వెళ్ళి ఓ చెట్టునీడకి చేరుకున్నాడు. అక్కడ గడ్డిపరక పడేసి, కాసేపు విశ్రాంతి తీసుకుని ఇందాక ఎలాంటి వేగంతో వెళ్ళాడో అలాంటి వేగంతోనే వచ్చి గురువుగారిని చేరాడు. చెమటలు పట్టిపోయాడు ఆషాఢభూతి. వగరుస్తున్నాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు దేవశర్మ. అతని నిజాయితీకి పొంగిపోయాడు. ఆషాఢభూతిని ఇక ఎందులోనూ, ఎప్పుడూ అనుమానించనక్కరలేదనుకున్నాడు. ఎందుకలా అనుకున్నాడంటే...సొమ్ములు దాచిన బొంత రోజురోజుకూ బరువు పెరుగుతూంది. మోయలేకపోతున్నాడతను. పైగా వయసు మీద పడడంతో సత్తువ తగ్గిపోతోందతనికి.‘‘నాయనా ఆషాఢభూతీ, నాకో చిన్న సాయం చేయాలయ్యా’’ అడిగాడు దేవశర్మ.

‘‘ఆజ్ఞాపించండి గురువుగారూ’’‘‘ఇక మీదట ఈ బొంతను నువ్వే మొయ్యాలి. ఇది మొయ్యడం నావల్ల కావట్లేదు.’’ అన్నాడు దేవశర్మ.‘‘ఆనందంగా’’ అన్నాడు. అందుకున్నాడు. బొంతను మోస్తూ, దేవశర్మ పరవమన్నప్పుడల్లా పరుస్తూ, శుభ్రం చేస్తూ కొన్నాళ్ళు గడిపాడు దొంగ. మరింత నమ్మకాన్ని కలుగజేశాడు దేవశర్మకి.ఒకరోజు రెండు పొట్టేళ్ళు పోట్లాడుకుంటూ కనిపించాయి. భీకరంగా కొట్టుకుంటున్నాయవి. రక్తాలు కారిపోతున్నా పట్టించుకోవట్లేదు.‘‘అయ్యయ్యో’’ అని, తట్టుకోలేనట్టుగా కళ్ళు మూసుకున్నాడు దొంగ. దేవశర్మ కుతూహలంగా చూస్తూంటే వద్దన్నట్టుగా అతనితో ఇలా అన్నాడు.‘‘రండి గురువుగారూ, మనకెందుకీ పోట్లాట’’‘‘బాగుంది కదయ్యా, కాసేపు చూడనీ’’ అన్నాడు దేవశర్మ. పొట్టేళ్ళ పోట్లాటను ఆసక్తిగా గమనించసాగాడు. పొట్టేళ్ళు నాలుగు అడుగులు వెనక్కి వేసి, తలలు బలంగా నిలబెడుతూ పరుగున వచ్చి కొట్టుకుంటున్నాయి. రక్తం పడి గడ ్డకడుతోంది. ఆ రక్తాన్ని మాంసం ముద్ద అనుకుని, దానిని అందుకునేందుకు అక్కడికి ఓ నక్క వచ్చింది. పొట్టేళ్ళు వెనక్కి వెళ్ళినప్పుడు ఆ రక్తంలో మాంసం కోసం వెతికింది. ఎక్కడా ముక్క అన్నది లేదు. అంతా రక్తమే! గడ్డకట్టిన రక్తం. ఛఛ అనుకుంది. వెనుతిరగబోయేంతలో పరుగున వచ్చాయి గొర్రెపోతులు. తలల్ని డీకొన్నాయి. తలల మధ్య ఇరుక్కుంది నక్క. ఫట్‌! పచ్చడయిపోయింది దెబ్బకి. చచ్చిపోయింది నక్క.‘‘పాపం’’ అన్నాడు దేవశర్మ.

‘‘దీనినే మోసపోవడం అంటారు. దేనినీ చూసీ చూడగానే నమ్మరాదు. రక్తాన్ని మాంసం అని నమ్మి పాపం ప్రాణాలు నక్క ఎలా బలిపెట్టిందో చూశావా?’’ అడిగాడు దేవశర్మ. సమాధానం లేదు శిష్యుడి దగ్గర్నుంచి.‘‘విన్నావా’’ అని ఆషాఢభూతి కోసం చూశాడు దేవశర్మ. ఇంకెక్కడ ఆషాఢభూతి? దేవశర్మ కన్నార్పకుండా పొట్టేళ్ళ పోట్లాటను చూస్తూంటే అదే అదనుగా సొమ్ములు ఉన్న బొంతను చంకన పెట్టుకుని అక్కణ్ణుంచి ఉడాయించేశాడు దొంగ. పారిపోయాడు. కనిపించని ఆషాఢభూతి కోసం కనిపించిన వారందరినీ వాకబు చేశాడు దేవశర్మ. ఫలితం లేదు. ఆషాఢభూతి ఆనవాలు చిక్కలేదు.‘నక్కని చూసి జాలిపడ్డాను. దేనినీ నమ్మరాదన్నాను. నేను చేసిందేమిటి? ఆషాఢభూతిని నమ్మి, సర్వాన్నీ పోగొట్టుకున్నాను’ అని తలపట్టుకున్నాడు దేవశర్మ.’’ అంటూ కథ ముగించాడు దమనకుడు.‘‘అంటే రాజుని నమ్మి నువ్వు మోసపోయానంటావు. ఒప్పుకుంటావు.’’ అన్నాడు కరటకుడు.‘‘అవును. మోసపోయాను. సంజీవకుణ్ణి పింగళకుడికి దగ్గర చేసి నన్ను నేను రాజుకి దూరం చేసుకున్నాను.’’ అన్నాడు. అంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు.‘‘ఎలాగయినా వాళ్ళిద్దరి స్నేహాన్ని చెడగొట్టాలి. ఒకరంటే ఒకరికి పడకుండా చెయ్యాలి. లేకపోతే నాకు బతుకు లేదు.’’‘‘అది నీ వల్ల అవుతుందా?’’ అడిగాడు కరటకుడు.‘‘ఎందుక్కాదు? బుద్ధిబలంతో దేనినయినా సాధించొచ్చు. సాధిస్తాను.’’ అన్నాడు దమనకుడు.

Responsive Footer with Logo and Social Media