అపూర్వ చింతామణీ

మరుద్వతీ నగరం మణిద్వీపంలో ఉన్నది. అది అతి సుందరంగా ఉంది. దానిని పాలించే రాజు పేరు ధీమంతభూపాలుడు. ధర్మపాలన కోసం పెట్టిన పేరు ఇది. మిన్ను విరిగి మీదపడినా చలించే మనిషి కాదు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి, వారికి సుఖశాంతులు కలిగినంత వరకు కన్ను మూయడు. వెన్నువాల్చడు. ధీమంతభూపాలుని దేవేరి పేరు సుగుణాదేవి.

ఆ పేరు సార్ధకమైంది. వారికి నమ్మదగిన మంత్రి విశారదుడు. ధీమంతునికి ధనం, దర్పం, పేరు, ప్రతిష్టలలో ఎలాంటి లోపమూ లేదు. ఎక్కేటందుకు మేడలున్నా, ఏలేటందుకు వాడలున్నా, కులం నిలిపేటందుకు కొడుకులేని కొరత వారికి తీరలేదు. ఆ రాజదంపతులు దాన ధర్మాలు చేయగా, దివ్యక్షేత్రాలు తిరగగా, నోములు వ్రతాలు నోయగా, వేల్పులకు విపులకు మ్రొక్కగా, చాలాకాలానికి ఒక చక్కదనాల బాల కలిగింది. ఆడపిల్ల అయినా, అదేచాలను కొని పుట్టిన పాపాయికి “చింతామణి” అని పేరుపెట్టి, ముద్దు ముచ్చటలతో మురిపెమును పెంచుకుంటున్నారు తల్లిదండ్రులు.

ఆడంగ, పాడంగ అయినవారందరికి ఆనందాలు పండాయి. అమ్మాయికి ఐదేళ్లు నిండినవి. పెద్దయెత్తున అక్షరభ్యాసం చేయించాలనుకున్నాడు ధీమంతుడు. మహారాజుల మాటకు తిరుగేముంటుంది? ఎక్కడెక్కడి చుట్ట పక్కాలను పిలిపించాడు. ఆ వచ్చినవారిలో ధీమంతుని బావమరుదులైన ఉజ్జయిని పురాధీశ్వరుడు సూర్యవర్మ మహారాజు, వజ్రపురాధీశ్వరుడు చంద్రవర్మ మహారాజులు కూడా వారి బంధుమిత్ర పరివారాలతో కలిసి విజయాన్ని సాధించారు. పాలకులంతా తమ తమ లాంఛనాలతో విచ్చేసిన సమయం కనుక, నాటి మరుద్వతీ నగరం క్రొత్త క్రొత్త హంగులు సంతరించుకొని కలియుగ వైకుంఠంలాగా కళకళలాడుతోంది. దూరదేశాలనుండీ వచ్చిన బ్రాహ్మణులు మొదలైన వారికీ తగిన సన్మానాలు జరిగాయి. కవులకు, గాయకులకు, పండితులకు, శిల్పులకు, కళాకారులకు బహుమతులు అందించబడ్డాయి.

వచ్చిన వారంతా ధీమంతభూపాలుని త్యాగశీలాన్ని పొగిడారు. కుంటి, గ్రుడ్డి, మూగ మొదలైన నిరుపేదలకు అన్నదానం జరిగింది. పెద్దలైన వారంతా రాజకుమారిని వేదమంత్రాలతో ఆశీర్వదించారు. తరువాత ధీమంతుడు తన కుమారిని విద్యావంతురాలిగా చేయునిమిత్తం గురువులకు అప్పగించారు. రాజగురువుల కంటే వసతులు తమ కోటలోనే ఏర్పాటు చేయబడింది. తరువాత వారందరికీ కొంచెం విశ్రాంతి దొరికింది. ఆ సాయంకాలం వేళ రాజదంపతులు తమ బంధువులను వెంటబెట్టుకుని పూలవనంలోకి పోయారు. వారికంటే ముందుగానే యుద్యానవనంలో చేరి ఆటలాడుకుంటున్న చింతామణిని, సుధాకరుని, ప్రభాకరుని చూచి ముచ్చటపడ్డారు.

పిల్లలు దొంగాటలో ఉన్నారు. ప్రభాకరుడు చింతామణి కన్నులకొక గుడ్డతో గంతకట్టాడు. ప్రభాకరుడు, సుధాకరులు ఇద్దరూ చింతామణిని కవ్వించుతూ తప్పుకుంటున్నారు. వారిని కనిపెట్టి గంతకట్టుకున్న చింతామణి వారిలో ఎవరినైనా పట్టుకోవాలి. ఒక వైపునుండి ఇంకొక వైపు పరిగెడుతున్న ప్రభాకరుని పట్టుకుంది. సుధాకరుడు వచ్చి ఆమెకు కట్టిన గంత విప్పాడు. చింతామణి ప్రభాకరుని చేయి పట్టుకొని “నేను దొంగను పట్టుకున్నా" అని చెప్పింది. అంతవరకు ప్రక్కప్రక్కల రాజదంపతులు ఉన్నారు. బంధువులంతా సమీపించి పకపకనవ్వారు. ధీమంతుడు "భలేదొంగను పట్టుకున్నావమ్మా! ఇంతకీ దొంగ ఇంటిదొంగా, బయటిదొంగ!" అన్నాడు. పిల్లలు మువ్వురూ బిడియంతో మారుమాటాడకుండా పారిపోయారు. తరువాత వారంతా వనంలోని శిలావేదికలమీద కూర్చున్నారు. సుగుణాదేవి చిరునవ్వు నవ్వుతూ “చింతామణి, ఈ ఇద్దరు బావలలో ఏ బావను చేసుకుంటుందో!" అన్నది. "ఎవరైనను మాకొక్కటియే.

ప్రభాకరుడు, సుధాకరులిద్దరూ ధీమంతునకు మేనల్లుండ్రేకద!" అన్నాడు సూర్యవర్మ. చంద్రవర్మ అందుకుని "మన ప్రభాకరుడు సుధాకన్న ఆరునెలలు పెద్దయినను పెద్దవాడే" అన్నాడు. నిజానికి నాకన్నగారును. ధీమంతభూపాలునకు పెద్ద బావమరిదియునైన సూర్యవర్మ మహారాజుగారి తరువాతనే నేనుని. కావున ప్రభాకరుడే మరుద్వతీ నగరానికి కాదగినవాడన్నాడు. సూర్యవర్మ యంతట “అది నిజమే తమ్ముడూ! ఒకప్పుడు నీ కుమారుడే బావగారి కల్లు డైతే నేను కాదందునా! నాకు ప్రభాకర సుధాకులలో యెవరైనా ఒకటే గద! అందుగురించి యింతగా చర్చించవలసిన పనిలేదన్నాడు.

“ఎప్పుడో జరగబోయే పెండ్లికి యిప్పుడే ముచ్చటలెందుకులె" మ్మంది సుగుణాదేవి మహారాణి. ధీమంతుడంకట వారలను చూసి “నాకున్న దొక్క కుమారి. ఇద్దరితో నేను వియ్యమందుకోలేను. కాబోయే వియ్యాల వారెవరైనా అనగ మా చింతామణి రేపు ఉజ్జయినీ నగరం కోడలయిన, వజ్ర పురం కోడలయినా మన మువ్వురిలో బేధభావం ఉండకూడదు. ముగ్గురి దొకటే మాట ఒకటే రాజ్యం- ఒకటే కుటుంబం" అన్నాడు. అంతకన్న కావలసిన దేమున్నదన్నాడు సూర్యవర్మ. అదే కావాలన్నాడు చంద్రవర్మ. నాటికందరూ లేచి రాజభవనం ప్రవేశించారు. మరునాటి యుద్ధానికి బంధువులందరికి మర్యాదలు చేసి వీడ్కోలు చెప్పాడు ధీమంతభూపాలుడు.

Responsive Footer with Logo and Social Media