బాల్యం - విద్యాభ్యాసం
కలాం మధ్యతరగతి తమిళ కుటుంబంలో 15, అక్టోబరు 1931న రామేశ్వరంలో జన్మించాడు. ఆ కాలంలో రామేశ్వరం మద్రాసు రాష్ట్రంలో ఉంది. కలాం తండ్రి జైనులాబ్దీన్, తగినంత విద్య, ధనం లేకపోయినా చాలా ప్రతిభ గలవాడు, ఉదార హృదయుడు. వారిది పేద కుటుంబం. కలాం తల్లి ఆశియమ్మ. ఆమె ఆదర్శ గృహిణి, వారి యింట్లో చాలామంది సందర్శకులు భోజనం చేసేవారు. కలాం తల్లిదండ్రులు ఆదర్శ దంపతులు.
అతని తల్లి తరఫున పూర్వీ కులలో ఒకరికి బ్రిటీష్‌వారు “బహదూర్” అనే బిరుదునిచ్చి సత్కరించారు.
కలాం పొట్టిగా ఉంటాడు. కలాం కుటుంబం వారి పూర్వీకులు 19వ శతాబ్దంలో కట్టించిన యింట్లోనే ఉంటుంది. వారు పేదవారైనా ఆహారానికి కొరతలేదు.
భారతీయ పద్ధతిలో కలాం తన తల్లివద్ద కూర్చునే భోజనం చేసేవాడు. అంటే నేలమీద కూర్చునే తినేవాడు. రామేశ్వరం దేవాలయం వారింటికి పదినిముషాల నడక. కలాం కుటుంబం ఉన్నది ముస్లిం పరిసరాలలో అయినా అక్కడ కూడా కొన్ని హిందువుల కుటుంబాలు నివసిస్తున్నాయి. కలాం తన తండ్రితో కలసి మసీదుకి పోయి ప్రార్థన చేసేవాడు. తన తండ్రి ప్రార్ధన పూర్తికాగానే మసీదు బయట చాలామంది జైనులాబ్జీన్ కోసం వేచి ఉండేవారు. వారి చేతుల్లో నీటితో నిండిన పాత్రలుండేవి. జైనులాబ్టీన్ తన ప్రేళ్లను ఆ నీటిలో ముంచి ప్రార్థన చేసేవాడు. వారు ఆ నీటిని తమ యిళ్లకు తీసుకునిపోయి బాధితులకు యిచ్చేవారు. బాధితులకు వారి బాధలు నయమయ్యేవి. వారు జైనులాబ్దీన్ వద్దకు వచ్చి కృతజ్ఞతలు తెలియజేసేవారు. వారి రోగాలు ఎలా నయమయ్యేవని కలాం తండ్రిని అడిగాడు. తాను బాధితుడికీ, భగవంతునికీ మధ్యవర్తిననీ, భగవంతుని దయే వారికి వారికి నయం చేసేది అని తండ్రి చెప్పేవాడు.
రామేశ్వరం దేవాలయం యొక్క ప్రథానార్చకులు పక్షి లక్ష్మణశాస్త్రి, జైనులాబ్టీన్ స్నేహితులు. ఆధ్యాత్మిక విషయాల్ని గురించి వారు చర్చించుకుంటూ ఉండేవారు. అన్ని పూజలకంటే ప్రార్థన ఎక్కువ పలితాన్నిస్తుందని నిర్ణయానికి వచ్చేవారు.
ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు తోడు కావాలనుకుంటాడు. అలాగే ఒక వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తే బాగుండుననుకుంటాడు. ఆ సహాయం ప్రార్థన వల్ల జరుగుతుంది. ప్రార్ధన భగవంతునికీ, బాధితునికీ మధ్యవర్తిగా ఉంటుంది. బాధలనుండి తప్పించడానికి భగవంతుడు తప్ప యింకెవరూ ఆ పని చేయలేరనేది కలాం యొక్క నమ్మకం. భగవంతుడే మనకి దారి చూపిస్తాడంటాడు. కలాంకి ఆరేళ్ల వయస్సున్నప్పుడు అతని తండ్రి పడవని నిర్మించడం మొదలు పెట్టాడు. రామేశ్వరం నుండి ధనుష్మోటికి యాత్రికులను చేరవేయడం అతని ఉద్దేశ్యం. అతని బంధువైన జలాలుద్దీన్ పడవ నిర్మాణంలో సాయపడేవాడు. తరువాత అతడు కలాం సోదరిని వివాహం చేసుకున్నాడు. ఆ పడవ ద్వారా జైనులాబ్దీన్‌కి ఆదాయం బాగానే వచ్చేది. కాని తుఫాను వచ్చి ఆ పడవ కొట్టుకుని పోయింది. వయస్సులో తేడా ఉన్నా జలాలుద్దీన్‌కి కలాంకి మంచి స్నేహం ఏర్పడింది. వారిద్దరూ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకునేవారు. జలాలుద్దీన్ తన సందేహాల్ని నేరుగా భగవంతునికే చెప్పేవాడు. జలాలుద్దీన్ యొక్క ప్రార్థన, యాత్రికుల ప్రార్థన భగవంతునికి తప్పకుండా చేరతాయని కలాం నమ్మేవాడు. బాగా చదువుకోమని జలాలుద్దీన్ కలాంకి చెప్పేవాడు. రామేశ్వరంలో ఇంగ్లీషు తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి ఒక్క జలాలుద్దీనే. అతడు కలాంకి బాగాచదువుకున్న వారి గురించి, శాస్త్రపరిశోధనల గురించి, సాహిత్యం గురించి చెబుతూ ఉండేవాడు. ఆ కాలంలో పుస్తకాల కొరత ఉండేది.
శంసుద్దీన్ కలాంకి పినతండ్రి కొడుకు. అతని ప్రభావం కలాం మీద పడింది. ఆ రోజుల్లో రామేశ్వరంలో అతడు వార్తాపత్రికలు సరఫరా చేసేవాడు. ఉదయం వచ్చే రైలులో పత్రికలు రామేశ్వరం స్టేషన్‌కి వచ్చేవి. శంసుద్దీన్ ఒక్కడే పత్రికల్ని సరఫరా చేసేవాడు. ఆ రోజుల్లో చదువుకున్న వాళ్లు రాజకీయాలను గురించి చర్చించేవారు. కలాంకి యింకా చదవడం రాదు కాబట్టి పత్రికలలో ఉన్న బొమ్మల్ని చూసి తృప్తిపడేవాడు.
కలాంకి ఎనిమిదేళ్ళ వయస్సున్నప్పుడు 1939లో రెండవ ప్రపంచయుద్ధం మొదలయింది. ఆ రోజుల్లో చింతగింజలకి చాలా గిరాకీ ఉండేది. కలాం వాటిని సేకరించి దుకాణాలకి అమ్మేవాడు. దానివల్ల అతనికి ఒక అణా ఆదాయం వచ్చింది. ఆ కాలంలో అదే గొప్ప. అదే సమయంలో ఎమర్జన్సీ విధించబడింది. రామేశ్వరం స్టేషన్లో రైలు ఆపడంలేదు. వార్తాపత్రికల్ని రైలునుండి గిరాటు వేసేవారు. వాటిని అందుకోవడానికి శంసుద్దీన్‌కి ఒక సహాయకుడు కావలసివచ్చింది. ఆ లోటుని కలాం భర్తీ చేశాడు. దాని ద్వారా కలాం తన మొదటి జీతం తీసుకున్నాడు.
కలాంకి క్రమశిక్షణ, నిజాయితీ తండ్రి నుండీ, మంచితనం, దయ తల్లి నుండీ అలవడ్డాయి. కలాంకి శంసుద్దీన్, జలాలుద్దీన్ అనేక విధాలుగా తోడ్పడ్డారు. కలాంకి 'రామనాథశాస్త్రి, అరవిందన్, శివప్రకాశన్ అనే ముగ్గురు ప్రాణస్నేహితులుండేవారు. వారంతా హిందూ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. వాళ్లలో మత విషయికంగా ఎటువంటి భేదాలు రాలేదు. రామనాథశాస్త్రి పక్షి లక్ష్మణ శాస్త్రి కుమారుడు. అరవిందన్ వ్యాపారం చేసేవాడు. శివప్రకాశన్ రైల్వే కేటరింగ్ పెట్టాడు.
కలాంకి చిన్నతనంలో అతని తల్లి, అమ్మమ్మ అతనికి రామాయణం నుండీ, ప్రవక్త యొక్క జీవితచరిత్ర నుండీ కథలు చెప్పేవారు. కలాం రామేశ్వరంలోని ఎలిమెంటరీ స్కూలులో చదివాడు, అతడు అయిదవ తరగతిలో ఉండగా, వారి స్కూలుకి కొత్త టీచరు వచ్చాడు. కలాం టోపీ పెట్టుకునేవాడు. దానివల్ల అతడు ముస్లిం అని తెలుస్తుంది. అతడు రామనాథ శాస్త్రితోపాటు మొదటి వరుసలో కూర్చునేవాడు. ఆ దృశ్యాన్ని చూసి కొత్త టీచరు భరించలేకపోయాడు. వెనక బెంచీమీద కలాంని కూర్చోమన్నాడు. అతని చర్యకి కలాం, రామనాథశాస్త్రి బాధపడ్డారు.
స్కూలు విడిచిపెట్టిన తరువాత వాళ్లు యింటికి వెళ్లి ఆ సంఘటనని చెప్పారు. లక్ష్మణ శాస్త్రి ఆ టీచర్ని పిలిపించాడు. పిల్లలఎదుటే సాంఘిక అసమానతల గురించి పిల్లలకు చెప్పి, వారి మనస్సులు పాడుచేయవద్దని హెచ్చరించాడు. క్షమాపణ చెప్పడమో, స్కూలుని విడిచి వెళ్లడమో ఏదో ఒకటి చేయమని ఆ టీచరుకి చెప్పాడు. ఆ టీచరు తానుచేసిన పనికి విచారాన్ని తెలియజేశాడు.
కలాం సైన్సు టీచరు శివసుబ్రమణ్య అయ్యర్. అతని భార్య ఛాందస బ్రాహ్మణ స్త్రీ, అతడు ఒక సంస్కర్త. సాంఘిక అసమానతలు లేకుండా చేయాలనేదే అతని సంకల్పం. బాగా చదువుకోమని అతడు కలాంకి చెప్పేవాడు. ఒకరోజు శివసుబ్రమణ్య అయ్యర్ కలాంని తన యింటికి భోజనానికి ఆహ్వానించాడు. అది విని అతని భార్య భయపడింది. ఒక ముస్లిం బాలుడు తన వంట యింట్లోకి రావడానికిగాని, అతనికి వడ్డన చేయడానికి గాని ఆమె సమ్మతించలేదు. శివసుబ్రమణ్య అయ్యర్‌కి భార్యమీద కోపం రాలేదు. తానే స్వయంగా కలాంకి వడ్డించి, అతని ప్రక్కనే కూర్చుని భోజనం చేశాడు. కలాం భోజనం చేసే తీరుని ఆమె గమనించింది. అతడు కలాంని మళ్లీ భోజనం చేయడానికి మరుసటి వారం రమ్మని ఆహ్వానించాడు. విచిత్రం ఏమంటే, అతని భార్య స్వయంగా వంటింట్లోకి తీసుకుని వెళ్లి వడ్డించింది.
ఎలిమెంటరీ విద్య పూర్తయిన తరువాత రామనాథపురంలో చదవడానికి కలాం తన తండ్రి అనుమతిని కోరాడు. తల్లి అక్కడకు పంపడానికి సంకోచించింది. కాని అతని తండ్రి, “నీ ప్రేమను కలాంకి యివ్వు. నీ ఆలోచనల్ని కాదు” అన్నాడు భార్యతో. తన కుమారుడు కలెక్టరు కావాలని జైనులాబ్దీన్ కోరిక. తండ్రి అనుమతి తీసుకుని కలాం రామనాథపురం వెళ్లాడు.
శంసుద్దీన్, జలాలుద్దీన్లు కూడా కలాంతో రామనాథపురం వెళ్లారు. షాట్స్ హైస్కూలులో అతనిని చదివించాలని వాళ్లు అతనితో వచ్చారు. అంతేకాక తగిన భోజన వసతి కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు. కాని కలాం అక్కడ ఉండలేకపోయాడు. అతనికి యింటి గాలి మళ్లింది. చదువుకోసం ఎటువంటి పరిస్థితినైనా తట్టుకోవాలని, తన తండ్రి ఆశయం నెరవేర్చాలని, నిశ్చయించుకున్నాడు. అప్పుడతనికి పదిహేను సంవత్సరాలు.
కలాం టీచరు అయ్యాడురై సాల్మన్. అతడు ఒక ఆదర్శంతమైన మార్గదర్శకుడు. 'రామనాథపురంలో ఉన్న కాలంలో మూడుశక్తుల్ని కోరిక, నమ్మకం, ఊహ అనేవాటిని లోబరచుకోవాలని కలాంకి అయ్యాదురై చెప్పాడు. “కోరిక బలంగా కోరుకో, అది తప్పకుండా జరుగుతుందని బలంగా ఊహించు” అనేవాడు ఆ టీచరు. నిజంగా కలాం జీవితంలో అదే జరిగింది. చిన్నతనంలో ఆకాశంలో ఎగురుతూన్న కొంగల్ని చూసి, తాను కూడా ఆ కొంగల్లాగే ఆకాశంలో ఎగరాలనుకునేవాడు. అలా ఎగిరిన వ్యక్తి రామేశ్వరం నుండి వచ్చిన కలామే మొదటి వ్యక్తి. “విశ్వాసంతో నీ అదృష్టాన్నే మార్చుకోగలవు” అనేవాడు ఆ టీచరు.
ఒకనాడు కలాం ఫోర్త్‌ఫాంలో ఉండగా పక్కన లెక్కలు చెబుతూన్న క్లాసులోకి వెళ్లాడు. ఆ టీచరు కలాంని పట్టుకుని చెవి మెలిపెట్టి, బెత్తంతో కొట్టాడు. తరువాత కలాం లెక్కల్లో మొదటి వాడిగా వచ్చినపుడు అటీచరు, “నేనెవరినైతే కొడతానో వారు గొప్ప వారవుతారు ఈ అబ్బాయి తన స్కూలుకీ, టీచర్లకీ గౌరవం తెస్తాడు” అన్నాడు.
ష్వార్డ్ న్కూలులో చదువు పూర్తయి నప్పటికి కలాంలో దేనినైనా సాధించ గలననే ఆత్మవిశ్వాసం స్థిర పడింది. పై చదువులకు వెళ్లాలనుకున్నాడు. ఆ కాలంలో వృత్తి విద్య గురించి పెద్దగా అవగాహనలేదు. కాలేజీకి వెళ్లడం, రావడం అని మాత్రమే అనుకునేవారు. దగ్గర్లో తిరుచిరాపల్లి కాలేజి ఉంది. కలాం తిరుచిలో ఉన్న సెయింట్ జోసెఫ్స్ కాలేజీలో ఇంటర్ చదవడానికి వచ్చాడు. పరీక్షల గ్రేడుల దృష్ట్వా చూస్తే కలాం క్లాసులో మొదటివాడని చెప్పడానికి వీలులేదు. కాని ఆ కాలేజీలో రివ. ఫాదర్ టి.ఎస్ సెక్వయిరా అనే టీచరు ఉండడం కలాం యొక్క అదృష్టం. అతడు ఇంగ్లీషు చెప్పేవాడు పైగా అతడు హాస్టల్ వార్డెన్ కూడా పిల్లలకు కావలసినవన్నీ సమకూర్చేవాడు. కలాం ఆ కాలేజీలో నాలుగేళ్లు చదివాడు. కలాం గదిలో యింకో యిద్దరుండేవారు. ఒకరు సనాతన బ్రాహ్మణుడు. రెండవ వ్యక్తి క్రిస్టియన్. కలాంను శాఖాహార భోజనానికి సెక్రటరీగా చేశారు. ఒక ఆదివారంనాడు ఫాదర్‌ని లంచికి ఆహ్వానించారు. వారిని అభినందించాడు.
సెయింట్ జోసెప్స్ కాలేజీలో ఉన్న టీచర్లు కంచి పరమాచార్య భక్తులు. ఆచార్యులు వాళ్లకి దానం చేయడంలో ఉన్న గొప్పతనాన్ని గురించి చెప్పేవారు. కలాం చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు అతనికి ఇంగ్లీషు సాహిత్యం మీద మక్కువ ఏర్పడింది. అతడు వేదాంతం గురించి కూడా చదివాడు. తరువాత అతనికి భౌతికశాస్త్రం మీద ఆసక్తి కలిగింది. దానిలో ఉన్న పాఠాలు రేడియోధార్మికత గురించీ యింకా అటువంటి విషయాల గురించీ ఉన్నాయి. ఇవన్నీ చదివిన మీదట, “సైన్సు ఆధ్యాత్మికాభివృద్ధికీ, అత్మజ్ఞానానికీ మార్గం” అని తెలుసుకున్నాడు. అతడా కాస్మాలజీ గురించి చదివి ఆకాశంలో జరిగే వింతలు తెలుసుకున్నాడు. కాని జ్యోతిషశాస్త్రం ఒక విజ్ఞానశాస్త్రం అంటే నమ్మకం లేదు. మానవుల మీద (గ్రహాల ప్రభావం ఉంటుందని ప్రజలు ఎందుకు నమ్ముతారో తనకి అర్ధం కావడం లేదంటాడు. కలాం అభిప్రాయం ప్రకారం భూమి చాలా శక్తివంతమైన (గ్రహం. భూమి మీద (ప్రాణుల కదలిక ఉంది. రాళ్లు, లోహాలు అన్నింటికీ లోపల ఉన్న ఎలక్ట్రాన్ల కదలిక ఉంది.
కలాం బి.యస్.సిలో చేరినప్పుడు సైన్సు విద్యార్థికి గల అవకాశాల్ని గురించి తెలియదు. తరువాత భౌతికశాస్త్రం తనకి పడదని తెలుసుకున్నాడు. తన కలలు సాకారం కావాలంటే ఇంజనీరింగు చదవాలనుకున్నాడు. మద్రాసు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీటు కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. అతడు సెలక్టు అయ్యాడు. కాని ఆ చదువు చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది. తండ్రి అంత డబ్బుని సమకూర్చలేడు. కాని అతని సోదరి జొహారా తన ఆభరణాల్ని కుదువబెట్టి డబ్బు సర్దుబాటు చేసింది. తన సంపాదనతో వాటిని విడిపిస్తానని చెప్పాడు. మిగిలిన చదువు పూర్తి చేయాలంటే స్మాలర్‌షిప్పు తెచ్చుకోవడమే మార్గం.
వాళ్ల ఇన్‌స్టిట్యూట్‌లో పాడైపోయిన రెండు విమానాల్ని ప్రదర్శనకి ఉంచారు. అవి కలాంని ఆకర్షించాయి. వాటి దగ్గర కూర్చుని వాటిని పరిశీలించాడు. గాలిలో ఎగరాలనే మానవుని యొక్క తపన ఫలితం యివి అని అబ్బురపడ్డాడు. మొదటి ఏడాది చదువు పూర్తికాగానే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు. తన గమ్యం స్పష్టంగా కనపడుతూంది. అతడు విమానాల్ని ఎగరవేయబోతున్నాడు. విమానాల్ని గురించి చాలామంది వద్ద విశేషాలు తెలుసుకున్నాడు.
ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతూన్న రోజుల్లో ముగ్గురు టీచర్లు అతని భావాలకి మెరుగులుదిద్దారు. ఆ ముగ్గురికీ విద్యార్థుల యెడల అభిమానం ఉంది. వాళ్లకి కావలసినదంతా నేర్పగల సమర్ధత వాళ్లకి ఉంది. వాళ్లలో ప్రొ.స్పాండర్స్‌కి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉంది. భారతీయులు తమకు కావలసిన దానిని ఎంచుకోవడంలో విఫలమవుతూ ఉంటారనేవాడు స్పాండర్స్. వారు ఎంచుకున్నది తమకు తగినదా, కాదా అనేది ముఖ్యం. పండాలా అనే టీచరు కలాంకి ఇంజనీరింగ్ బోధించాడు. నర్సింగరావు ఏరోడైనమిక్స్ బోధించాడు. వారు ముగ్గురూ కలాంలో ఆసక్తిని పెంపొందించారు.
కలాం యొక్క చివరి సంవత్సరం అతనికి సంధి కాలం. తరువాత జీవితం వీటియొక్క ప్రభావం మీద ఆధారపడి ఉంది. అదే సమయంలో రాజకీయంగాను, పారిశ్రామికంగానూ (ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. కలాం భగవంతుని 'యందున్న నమ్మకానికి పరీక్షా సమయం. అందరూ అనుకునేదేమంటే సైన్సు పరిజ్ఞానమే జ్ఞానానికి మూలం అని. కళ్లతో చూసినదే నిజం వారికి. కలాం భగవంతుని మీద నమ్మకంతో పెరిగాడు. అతని ప్రకారం నిజమైన సత్యపదార్థం భౌతిక ప్రపంచం కంటే భిన్నమైనది. అంతర్గత అనుభవాల వల్లనే జ్ఞానం లభిస్తుంది.