అపకారికి ఉపకారము చేయరాదు
ఒకానొక దట్టమైన కీకారణ్యంలో ఒక పాము వుంటుండేది. దానిని చూచి అడవిలోని జంతువులన్నీ ఎంతో భయపడేవి. తనపట్ల జంతువులు చూపుతున్న భయం కేవలం తన గొప్పతనం వల్లనేనని ఆ పాముకెంతో గర్వంగా వుండేది. అందువల్ల అది కన్నుమిన్ను కానకుండా ఆ అడవిలో ఎంతో పాగరుబోతుతనంగా తిరుగుతుండేది. అది వస్తున్న చడి వినిపించేసరికి జంతువులు దాని త్రోవనుండి తప్పుక పోతుండేవి.
అసలే విష జంతువు అందులోనూ గొప్పదానినన్న గర్వంతో ఎంతో పొగరుగా తిరుగుతున్నట్టిది తీరా దాని కంటబడితే ఏమి మాట్లాడుతుందో ఏమంటుందో ఆ మాటల " దూకుడులో పౌరుషం చెంది కాటువేస్తే, ఆ విషానికి ప్రాణాలు కోల్పోవాలి ఎందుకొచ్చిన ముప్పు తప్పుక తిరిగితేనే మంచిదని జంతువులేవీ దాని సరసకు రాకపోవడం వల్ల అది తిరుగాడే పరిసరాలలో ఒక్క పిట్టయినా ఉండేదికాదు. ఒంటరి అయిపోయి పాము తను మామూలుగా తిరిగే తావులో తనకేమీ తోచక ఆ అడవి మార్గాన బయలుదేరి చాలాదూరం ప్రయాణం చేసింది. అంతలో ఆకస్మికంగా అది తిరుగుతున్న ప్రాంతంలో మంటలు లేచాయి. దాన్ని తప్పకుపోవాలన్న తొందరలో వెనక్కి మరలింది పాము. అంతలో అటు ప్రక్కకూడా మంటలు వ్యాపించినాయి. క్షణాలలో ఆ పాము చుట్టూవున్న పాదలంటుకుని ఆ మంటల మధ్య అది ఇరుక్కుపోయింది.
బయపడేమార్గం తోచలేదు. "నన్ను రక్షించండి... నన్ను రక్షించండి...” అంటూ గట్టిగా కేకలు పెట్టనారంభించింది. ఆ అడవి మార్గాన అటు ప్రక్కగా ప్రక్క గ్రామానికి పోతున్న ఒక రైతు చెవులకా కేకలు వినబడ్డాయి. యెవరో ఆపదలో ఉన్నారని ఆ రైతు ఆ కేకలు వినపడుతున్నా దిక్కుగా వెళ్ళాడు. మంటల మధ్య ప్రాణభయంతో తల్లడిల్లిపోతున్నపామును చూచాడు. అది దుష్టజంతువైనా సంకోచించకుండా, ఆ రైతు తన చేతికర్ర కొనకు సంచిని కట్టి ఆ మంటల మధ్యకు పెట్టి పట్టుకున్నాడు. బ్రతుకు జీవుడా అనుకుని ఆ పాము ఆ సంచిలో దూరింది. వెంటనే రైతాకర్రను పైకెత్తి చేతి సంచిని,మంటల కావలకు తెచ్చి నేలనుంచేడు.
ఆ సంచిలోనుంచి చర్రున ఈవలకొచ్చింది పాము. ప్రాణభిక్త పెట్టినవాడన్న ఆలోచనయినా ఆలోచించకుండా బునలు కొడుతూ కస్సున పైకి లేచి ఆ రైతును కాటు వేసింది. పాపం రైతు పాము విషం తలకెక్కి నోట నూరగలు కక్కుతూ నేలబడి ప్రాణాలు వదిలాడు. ఉపకారానికి పోయి మరణాన్ని తెచ్చుకున్నాడా రైతు. కనుక ఉపకారమే అయినా సజ్జనులకు చెయ్యాలిగాని దుష్టులకు చెయ్యకూడదు.