అనుభవాన్ని మించిన పాఠం లేదు
పూర్వం సవ్యసాచి అనే గురువు ఉండేవాడు, సకల శాస్త్రాలలో ఆయన పాండిత్యం కలవాడు. శిష్యుల విద్యాస్థాయిని గుర్తించి, వారి మానసిక పరిస్థితిని గమనించి విద్యపట్ల వారికి గల ఏకాగ్రత, పట్టుదల తదితరాలకు తగినట్లుగా ఎవరికి ఏవిధంగా బోధించాలో. ఆ విధంగా బోధిస్తూ మంచి గురువని పేరు తెచ్చుకున్నాడు. ఇలా వుండగా గుణవర్మ అనే శిష్యుడు ఆయన ఆశ్రమంలోకి కొత్తగా వచ్చాడు. అతనికి ఎవరు ఏ పని చెప్పినా వెంటనే చేసే అలవాటు లేదు. అంతేగాక అతనికి అన్నీ అనుమానాలే.
ఒకరోజు గురువు గుణవర్మను వెంట తీసుకుని అడవికి వెల్లి దర్బలు సేకరించండం ప్రారంభించారు. దర్బలు జాగ్రత్తగా తుంచకపోతే చేతికి గుచ్చుకుంటాయి. అలవాటు లేని గుణవర్మ దర్బలు కోయబోయి చేతికి గాయం చేసుకున్నాడు. "గురువుగారు దర్బలు ఎలా తుంచాలో తనకు ముందే చెప్పవచ్చు కదా అని మనసులో అనుకున్నాడు. వారు తిరిగిచ్చే దారిలో ఒకచోట ఎత్తునుంచి పల్లపు ప్రాంతానికి దిగి నడవవలసి వచ్చింది. మామూలుగా నడుస్తూ గుణవర్మ కాలుజారి కిందకి దొర్లాడు.
గురువు పట్టి పట్టి అడుగులు వేస్తూ కిందకి చేరుకున్నాడు. అప్పుడు గుణవర్మ మళ్ళీ మనసులో ఇలాంటి ప్రదేశంలో జాగ్రత్తగా నడవాలని గురువుగారు నన్ను హెచ్చరించి వుంటే నేను. పడిపోయేవాడిని కాదుకదా అని అనుకున్నాడు.
గుణవర్మ మనోగతాలు పసికట్టిన సవ్యసాచి అతనితో ఇలా అన్నాడు. "చూడు నాయనా! కొన్ని విషయాలు చెప్పిన దానికంటే అనుభవం ద్వారానే బాగా అవగతమవుతాయి. ఒకవేళ నేను ముందుగా హెచ్చరించినప్పటికీ నువ్వు దర్బవల్ల చేతిని గాయపరచుకోవనిగాని, పల్లపు ప్రాంతంలోకి జారిపడకుండా వుండగలవని గాని నాకు అనిపించలేదు. అందువల్లనే నేను మిన్నకున్నాను. ఇప్పుడు ఆ విషయాలలో అజాగ్రత్తగా వుంటే ఏమవుతుందో నీ అంతట నువ్వు స్వయంగా తెలుసుకున్నావు కనుక ఇక పై అప్రమత్తంగా వుండగలవు, 'అనుభవాన్ని మించిన పాఠం లేదు' అని చెప్తారు.
గురువు మాటలు విన్న గుణవర్మ తన నిర్లక్ష్య ధోరణికి స్వస్తి చెప్పి ఆ తరువాత తెలివైన శిష్యుడని పేరు తెచ్చుకున్నాడు.