అంతా మన మంచికే



విదర్బా దేశాన్ని విష్ణుకేతుడు పరిపాలిస్తుండేవాడు. ప్రజలను కన్నబిడ్డలవలే సాకేవాడు. ఆ దేశ మహామంత్రి విష్ణుశర్మ విష్ణుశర్మ మహామేధావి. అతనికి రాజు మాటలంటే ఎంతో గౌరవం వుండేది. విష్ణుశర్మ ప్రతి పనికి 'అంతా మన మంచికే' అంటూండేవాడు. ఇది రాజుకు సుతారమూ ఇష్టముండేదికాదు.

ఒక రోజు విమ్ణుకేతుడు ఒరలోంచి కత్తిదూయబోయి తన వేలిని కోల్పోయాడు. రక్తం ధారలై ప్రవహించింది. ఇది గ్రహించిన విష్ణుశర్మ మామూలు ధోరణిలో 'అంతా మన మంచికే అన్నాడు.

విష్ణుశర్మ మాటలకు మండిపడ్డ రాజు వెంటనే అతనిని చెరశాలలో పెట్టించాడు. 'చెరశాలలో పెట్టిన అనంతరం కూడా విష్ణుశర్మ 'అంతా మన మంచికే' అన్నాడు ఇలా రోజులుగడుస్తున్నాయి. ఒకసారి విమ్ణుకేతుడు వేటకు వెళ్ళాడు. చాలాకాలం తర్వాత వెళ్ళాడేమో ' విపరీతంగా వేటాడి అలసిపోయాడు. వేటలో ఒక మృగం అతడ్ని నానా తిప్పలు పెట్టింది. చివరికి దానిని వేటాడి వస్తున్న విష్ణుకేతుడు ఓ కొండజాతివారి కంటపడ్డాడు.

అనాగరికులైన ఆ కొండజాతివారు తమ గూడెం దేవతకు బలివ్వడానికి మనిషికోనం వెతుకుతున్నారు.

రాజును చూడగానే వారు ఎగిరి గంతేసి, అతనిని బంధించి తమ గూడేనికి తీసుకుని పోయారు. అయితే రాజుకి వేలు తెగి వుండటాన్ని చూచి వారు రాజును బలివ్వకుండానే వదిలి వేశారు.

రాజు తనకు వేలు లేకపోవడం వల్లే తన ప్రాణాలు క్షేమంగా వున్నాయని గ్రహించాడు. సరిగ్గా ఇదే సమయంలో రాజుకు మంత్రి విష్ణుశర్మ మాటలు గుర్తొచ్చాయి.

అతడు వెంటనే తన రాజ్యానికి వెళ్ళి విష్ణుశర్మను కారాగారంనుంచి విడిపించి “మంత్రీ... అజ్ఞానంతో నా వేలు తెగినపుడు, మిమ్మల్ని చెరశాలలో పెట్టినపుడు మీరు 'అంతా మన మంచికే' అని అనడంలో ఆంతర్యమేమిటి అని అడిగాడు.

దానికి విష్ణుశర్మ “రాజా... మీకు వేలు తెగబట్టేకదా మిమ్మల్ని వికలాంగుడనుకుని బలివ్వకుండా కొండజాతివారు వదిలేసింది” అన్నాడు.

“మరి మిమ్మల్ని చెరశాలలో పెట్టినపుడు కూడా 'అంతా మన మంచికే' అన్నారు. దాని ఆంతర్యమేమిటి అని అడిగాడు.

“రాజా...నన్ను చెరశాలలో పెట్టకపోయి వుంటే ఆ కొండజాతివారు మిమ్మల్ని వదిలి, అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న నన్ను బలి ఇచ్చేవారు. నన్ను చెరశాలలో ఉంచబట్టే నా ప్రాణాలు రక్షింపబడ్డాయి. కనుక ఏదైనా జరిగితే అది మన మంచికోసమే జరిగిందనుకుని భావించి జీవించాలి తప్ప, జరిగిన దానిని గురించి ఆలోచించి కృంగి పోకూడదు' అని ముగించాడు.

మంత్రి మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన రాజు అతని దూరదృష్టికి మెచ్చుకున్నాడు.

Responsive Footer with Logo and Social Media