అంగీరసుడి వంశం



అంగీరసునికి భార్య శివ వలన అతనికి బృహత్కీర్తి, బృహత్జ్యోతి, బృహద్బ్రహ్మ, బృహన్మనసుడు, బృహన్మంతుడు, బృహత్భానుడు, బృహస్పతి అనే ఏడుగురు కుమారులు కలిగారు. భానుమతి, రాగ, సినీవాలి, కుహువు, నశ్చిష్మతి, మహిష్మతి, మహామతి అను ఏడుగురు కుమార్తెలు జన్మించారు.

అంగీరసుని కుమారుడు బృహస్పతికి శంయుడు జన్మించాడు. యాగములలో నేతి హవిస్సును అతనికి సమర్పించే వారు. శంయుని భార్య సత్య. వారికి భరద్వాజుడు, భరతుడు అనే కుమారులు కలిగారు. భరతునకు భారతుడు అనే కుమారుడు, భారతి అనే కుమార్తె కలిగారు. భరద్వాజునకు వీరుడు పుట్టాడు. వీరునకు భానుడు అనే కొడుకు పుట్టాడు.

భానునికి నిశ్ఛ్యవనుడు పుట్టాడు. నిశ్చ్యవనునికి నిష్కృతి అనే కుమారుడు పుట్టాడు. నిష్కృతి అనే అగ్నిని ఆరాధించేవాడికి పాపాలన్నీ పోతాయి. నిష్కృతికి రుజస్కరుడు పుట్టాడు. రుజస్కరునకు క్రోధుడు పుట్టాడు. క్రోధునికి రుసుడు అనే కుమారుడు కలిగాడు. రుసునికి స్వాహా అనే కుమార్తె, కాముడు అనే కుమారుడు కలిగారు.

కామునికి అమోఘుడు, అమోఘునికి సక్థుడు పుట్టారు. కాశ్యపుడు, వాశిష్టుడు, ప్రాణుడు, అంగీరసుడు, చ్యవనుడు అనే అయిదుగురు తమకు తేజోవంతుడైన కొడుకు పుట్టాలని తపస్సు చేసారు. వారికి కలిగిన కుమారునికి తల నిప్పు రంగులోను, చేతులు సూర్యునిలా, కళ్ళు బంగారు రంగులో, శరీరం నలుపు రంగులో ఉంది. బలవంతుడైన అతడు అయిదుగురు తండ్రులకు జన్మించిన కారణంగా పాంచజన్యుడయ్యాడు.

అతడు పది వేల సంవత్సరాలు తపస్సు చేసాడు. అతని తల నుండి బృహద్రథంతరులు, ముఖమునుండి హరి, నాభి నుండి శివుడు, బలము నుండి ఇంద్రుడు, ప్రాణముల నుండి వాయువు, అగ్ని జనించగా భుజముల నుండి దంతముల నుండి సమస్త భూతములు సృష్టించబడ్డాయి. తపుడు అనే అగ్ని నిరంతరం తపస్సు చేసి పదునైదు మంది కుమారులను కన్నాడు. కాని వారంతా కపటులు అయ్యారు.

వారు వరుసగా సుభీముడు, అతి భీముడు, భీముడు, భీమబలుడు, అతి బలుడు, అను వారు ఒక పక్క సుమిత్రుడు, మిత్రవంతుడు, మిత్రజ్ఞుడు ఒక పక్క సురప్రవీరుడు, వీరుడు, సువేషుండు, సువర్చలుడు, సురహంత అను వారలు చేరి యజ్ఞ ఫలములు అపహరిస్తూ ఉండే వారు. వారి దుశ్చర్యలకు బ్రాహ్మణులు తరచూ అగ్ని శాంతి చేయవలసి వచ్చేది. వారి పనులకు బ్రాహ్మణులు మంత్రశక్తితో భయపెట్టి వారిని యజ్ఞశాలకు దూరంగా ఉంచే వారు. తపునకు మరి అయిదుగురు పుత్రులు ఉన్నారు.

వారిలో వైశ్వానరుడు బ్రాహ్మణులచే చాతుర్మాస వ్రతములో పూజింపబడే వాడు. రెండవ వాడు విశ్వపతి. అతడు జగత్ప్రభువు. మూడవ వాడు విశ్వకుడు. నాల్గవవాడు విశ్వభుక్కు అతను భూతములు తినే ఆహారాన్ని జీర్ణం చేసే వాడు. ఐదవ వాడు గోపతి అతడు సమస్త ధర్మక్రియలకు కారణ భూతుడు. భానుడు అనే అగ్నికి ఆరుగురు కుమారులు నిశ అనే కుమార్తె కలిగారు. పురంధరుడు అనే అగ్నికి మనువు అనే కుమారుడు కలిగాడు.

అతను నిశను వివాహమాడాడు. ఆ మనువుకే ప్రజాపత్యుడు అనే పేరు కూడా ఉంది. ఆ విధంగా సకల విధ అగ్నులు సకల ధర్మ కార్యాలకు కారణమయ్యాయి. ఆపుడు అనే అగ్నికి ముదిత అనే కన్యకు అగ్ని జన్మించాడు. మూడు లోకాలలో జరిగే అన్ని వ్యవహారాలను ఆ అగ్ని నిర్వహిస్తున్నాడు. యజ్ఞాలలో సమర్పించే హవిస్సును దేవతలకు అందిస్తుంటాడు.

Responsive Footer with Logo and Social Media