అమాయకుడు
శ్రీరంగపురంలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం వుండేది. ఆ రోజుకు సరిపడే ఆదాయంతో వారి బ్రతుకులు గడుస్తుండడమే కాని ఆస్తిపాస్తులు, నగలు, నాణ్యాలు. పాడిపంటలు మొదలయినవేవీ వారికి లేవు, వారికి ఒక్కగానొక్క కొడుకు. వాడు శుద్ధ అమాయకుడు. వాడ్ని అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఎంతో గారాబంగా పెంచుకుంటు న్నారేగాని, అతడికి కాస్తయినా విద్యాబుద్ధులు నేర్పించలేకపోయారు నిరుపేదలు.
కొంత కాలానికా కుర్రవాడు పెద్దవాడై యుక్త వయస్కుడయ్యాడు. అతనికి పెళ్ళిచేసి వాళ్ళకు బిడ్డా పాపా కలిగితే చూచి ఆనందించాలని ఆశ కలిగిందా దంవతులకు సిరిసంపదలు లేకపోయినా చక్కనైన సాంప్రదాయాలు, కట్టుబాట్లు సంస్కారం కలిగిన కుటుంబీకులు కావడం వల్ల ఎక్కడెక్కడనుండో సంబంధాలు వస్తూండేవి. వచ్చిన వారంతా వాళ్ళ ఆర్థిక పరిస్థితులకు భయపడి వెళ్ళిపోతూండేవారు. అమాయకుడే అయినా ఆ కుర్రవాడు మంచివాడు కలుపుగోలుతనం కలిగినవాడు కావడం వల్ల ఇరుగు పారుగు వారికి కూడా వచ్చిన సంబంధాలన్నీ తిరిగి పోతూండడం బాధ కలిగింది. వాళ్ళూ ఆ ధంపతుల్ని కలుసుకొని “అయ్యా మీ పరిస్థితులు ఇల్లాగే గడిచిపోవచ్చు, పిల్లవాడికి భార్య వచ్చిన వేళావిశేషం వలన సంపన్నుడు కాకపోతాడా చూడవచ్చిన వారికి అలానే చూపిస్తే వారికేం నచ్చుతుంది. ఉన్నంతలో కాస్త దర్థాగానే చూపించండి. అబ్బాయిని” అని సలహా ఇచ్చారు.
అంతలో ఒకనాడొక సంబంధం వచ్చింది. వాళ్ళు కుర్రవాడ్ని చూస్తామన్నారు. తల్లిదండ్రుల ఆలోచించి ఇరుగుపారుగువారి సలహా ప్రకారం కుర్రవాడ్ని దగ్భాగా చూపించడానికే నిర్ణయించుకున్నారు. ప్రక్కింటివారిని అడిగి చెవుల పోగులు తెచ్చి కుర్రవాడి చెవులకు అలంకరించారు. పిల్లనివ్వవచ్చిన పెద్దల ముందు కూర్చోబెట్టారు. వారిలో ఒకాయన పిల్లవాడి గుణగణాదుల్ని పరిశీలిస్తూ “బాబూ! నీ పేరేమిటని ప్రశ్నించాడు” ఫలానా అని చెప్పేడు. ఏం చదువుకున్నావని అడిగాడు అదీ చెప్పేడు ఇంకా ఏమేమో అడిగేసరికి అన్నీ చెప్పి ఇంక దుద్దులు గురించి కూడా అడిగేస్తారని ఊహించుకుని నా చెవులకున్న ఈ దుద్దులు మా ప్రక్కింటి వారివన్నాడు . దానితో ఆ పెళ్ళిపారు సంబంధం వదులుకుని వెళ్ళిపోయారు.
తమ కొడుకు అమాయకతకు ఆ తల్లిదండ్రులు బాదపడి వాళ్ళతో అలా నావి కాదని అనకూడదు బాబు అని చెప్పేరు. మరికొంత కాలానికి మరో సంబందం వచ్చింది. అప్పడా తల్లిదండ్రులు మళ్ళీ ఆ దుద్దులు తెచ్చి అతనికి పెట్టారు. ఆ పెళ్ళివారు అతడితో ఏమేమో మాట్లాడుతూ అనేక ప్రశ్నలు వేశారు. వాటన్సిటికి ఎంతో జాగ్రత్తగా సమాధానాలు చెప్పేడు. అలా చెప్పిచెవులకున్న కమలాలు కూడా నావేనని అన్నాడు. ఆ పెళ్ళివారు లోలోన నవ్వుకుని వెళ్ళిపోయ్లారు. అలా అనకూడదు అని తల్లిదండ్రులతడ్ని మందలించారు, వాటి ఊసు నీకెందుకు? అన్నారు.
మళ్ళీ మరికొంతకాలం గడిచాక మరొక సంబంధం వచ్చింది, ఈసారి తల్లి దిద్దులతడికి పెడుతూ వీటిని గురించి నువ్వు మాట్లాడకూడదు బాబూ అన్నది. మరి వాళ్టడిగితేనో అన్నాడు. అడగరు అడిగినా నువ్వేం అనకూడదు అని హెచ్చరించింది. వచ్చిన పెళ్ళివారి ముందు కూర్చుంటూనే అన్నాడు గదా... “చూడండి మీరు నన్ను ఏమైనా అడగండి గాని నా చెవుల దుద్దుల గురించి మాత్రం అడగటానికి వీలులేదు. అడిగినా నేనేం చెప్పను అన్నాడు" తల్లిదండ్రులు వెళ్ళిపోతున్న పెళ్ళివారిని చూచి తలగొట్టుకున్నారు.
ఆ తరువాక చేసేదిలేక ఆ అమాయకుడిచేత అబద్ధమాడించడం తప్పని నిర్ణయించుకుని, తమలోనే ఒక నిరుపేద పిల్లను, ఓ వెర్రి బాగులదాన్ని తెచ్చి పెళ్ళిచేసి తృప్తిపడ్డారు.