అమాయక బ్రాహ్మడు- తెలివైన దొంగలు
చేజిక్కించుకున్న కర్పూరద్వీపానికి మేఘవర్ణుణ్ణి సామంతుని చేద్దామని రాజు చిత్రవర్ణుడు ముచ్చటపడితే వద్దని వారించాడు మంత్రి దూరదర్శి. అర్హతకు మించి మేఘవర్ణుణ్ణి సన్మానిస్తే మంచి కన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువన్నాడు. రాజునిఆలోచింపజేశాడు.‘సరే! అవసరార్థం సేవకుణ్ణొకణ్ణి సామంతుని చేసి వచ్చాం గాని, నిజానికి వాడు సరయిన రాజు కాడు. మేఘవర్ణుణ్ణి రాజుని చేద్దామంటే వద్దంటున్నావు. మరి ఇప్పుడెలా? కర్పూరద్వీపాన్ని చక్కగా ఏలే రాజు ఒకడు కావాలి. అలాంటి వాడు మనలో ఎవరున్నారో చెప్పు.’ అడిగాడు చిత్రవర్ణుడు.చెప్పడానికి ముందు వెనుకలు ఆలోచించాడు దూరదర్శి. తర్వాత చెప్పసాగాడిలా.‘మహారాజా! మనం హిరణ్యగర్భుని మీద పోరాడి గెలవలేదు. మోసం చేసి గెలిచాం. అది తప్పు. నిజానికి హిరణ్యగర్భుడు చాలా బలవంతుడు. అతని కోసం ప్రజలు ప్రాణాలిస్తారు. ఓడిపోయాడని హిరణ్యగర్భుణ్ణి తక్కువ అంచనా వేయకండి. అతను ఊరుకోడు. సైన్యాన్ని సమీకరించుకుని యుద్ధానికి వస్తాడు. తన రాజ్యం తను చేజిక్కించుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తాడు. అప్పుడు మన మోసాలు పని చెయ్యవు.ఇంకో విషయం. హిరణ్యగర్భుని మంత్రి బాగా తెలివయిన వాడు. అయితే మొన్న యుద్ధవేళ రాజుకీ మంత్రికీ అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆ అభిప్రాయ భేదాలే మన విజయానికి కారణమయ్యాయి. అయితే ఈసారి వారిద్దరూ ఒకటయ్యే అవకాశం ఉంది.
వాళ్ళొకటయితే, మనకి విజయావకాశాలు తగ్గుతాయి. పైగా రానున్నది వర్షాకాలం. నీటి పక్షులకి వానాకాలం అనుకూలం. మనం నేల పక్షులం. మనకి వానాకాలం అనుకూలించదు. ఇప్పుడు యుద్ధం వస్తే వారిదే గెలుపు. అందుకని...’ ఆగాడు దూరదర్శి.‘అందుకని? చెప్పు, ఏమిటి నీ ఉద్దేశం?’ అడిగాడు చిత్రవర్ణుడు.‘కర్పూర ద్వీపాన్ని మనం గెలుచుకున్నాం. ఆ పేరు మనకి ఉండనే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే...హిరణ్యగర్భుడితో సంధి చేసుకుని, అతని రాజ్యం అతనికే ఇచ్చి వేద్దాం. అప్పుడు యుద్ధం అన్న మాటే ఉండదు. మన కి ఓటమి కూడా ఉండదు. ఆలోచించండి. సంధి సర్వత్రా శ్రేయస్కరం.’ అన్నాడు దూరదర్శి.
రాజు ఆలోచనలో పడ్డాడు. దూరదర్శి పిరికి మందు నూరి పోస్తున్నాడనిపించింది. కొంచెం కోపం కూడా వచ్చింది. దాంతో ఇలా అన్నాడతను.‘బాగాలేదు దూరదర్శి. నీ మాటల్లో నాకు చాలా తేడాలు కనిపిస్తున్నాయి. గెలుచుకున్న రాజ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. తిరిగి శత్రువుకే దాన్ని అప్పజెప్పడం నా వల్ల కాదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, యుద్ధరంగం నుంచి పారిపోయి, ఎక్కడో తలదాచుకుంటున్న హిరణ్యగర్భుడు, కాళ్ళూ చేతులూ తప్ప, తోడంటూ లేని హిరణ్యగర్భుడు, సర్వసైన్య సమేతంగా ఉన్న నన్ను...నన్నేం చెయ్యగలడు? ఒంటరిపక్షి యుద్ధం ఏం చేస్తుంది? అయిపోయింది. హిరణ్య
గర్భుడి అధ్యాయం ముగిసిపోయింది.’దూరదర్శి తల వంచుకుని నిల్చున్నాడంతే! మాట్లాడడం లేదు.‘గెలుచుకున్న రాజ్యాన్ని వదిలిపెట్టేది లేదు. ఈ విషయంలో నువ్విక ఎక్కువగా కల్పించుకోకు.’ అన్నాడు అంతలోనే చిత్రవర్ణుడు. విసవిసా వెళ్ళిపోయాడక్కణ్ణుంచి.’’ ముగించాడు ధవళాంగుడు.‘‘తెలిసినవీ, తెలుసుకున్నవీ మహారాజుకి వివరించడం గూఢచారి కర్తవ్యం. నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను.’’ అన్నాడు ధవళాంగుడు. ఆకలిగా ఉన్నదని చెప్పి, సెలవు తీసుకున్నాడక్కణ్ణుంచి.హిరణ్యగర్భుడూ, సర్వజ్ఞుడూ ఇద్దరూ దీర్ఘంగా ఆలోచించసాగారు.
కొద్దిసేపు ఎవరికెవరూ మాట్లాడుకోలేదు. తర్వాత సర్వజ్ఞుడే గొంతు సవరించుకుని ఇలా అన్నాడు.‘‘ఇప్పుడీ పరిస్థితుల్లో మనం ఒంటరిగా యుద్ధం చెయ్యలేం. ఒకవేళ యుద్ధం చెయ్యాలంటే ఎవరయినా బలవంతుడయిన రాజుతో మనం ముందుగా స్నేహం చెయ్యాలి. చేస్తే, ఆ రాజు సాయంతో మనం శత్రువుని దెబ్బ తీయొచ్చు. ఊబిలో పడ్డ ఏనుగుని తీయాలంటే మరో ఏనుగు సాయమే కావాలి. అందుకని...సింహళ రాజు మహాబలునితో మనం స్నేహం చేద్దాం. అతని సాయం కోరదాం. అతనికీ మనమంటే చాలా ఇష్టం. మనతో స్నేహం చేసేందుకు ఎప్పటినుంచో ఉత్సాహపడుతున్నాడు.’’‘‘సింహాసనం మీద ఉన్నప్పుడు స్నేహం కావాలన్నాడు. ఇప్పుడూ కావాలంటాడా?’’ అనుమానం వ్యక్తం చేశాడు హిరణ్యగర్భుడు.‘‘స్నేహం కోరుకునే వారికి రాజు, పేద అనే తారతమ్యం ఉండదు ప్రభూ! అయినా మహాబలుడు అంత అల్పుడు కాదు. ఇప్పుడే అతని స్నేహాన్నీ, సహాయాన్నీ అర్థిస్తూ దూతను పంపుదాం.ఏమంటారు?’’‘‘నీ ఇష్టం.’’మహాబలునికి ఉత్తరం రాశాడు సర్వజ్ఞుడు. ఆ ఉత్తరాన్ని దూతకు అందజేశాడు. పంపించాడతన్ని.
కొలువుదీరాడు చిత్రవర్ణుడు. పాలన గురించి ఎవరెవరో ఏదో చెబుతున్నారు. ఏదీ తలకెక్కట్లేదతనికి. దూరదర్శి మాటలే అతని బుర్రని దొలిచేస్తున్నాయి. గెలుచుకున్న రాజ్యాన్ని తిరిగి ఇచ్చేయాలి. శత్రువుతో సంధి చేసుకోవాలి. తట్టుకోలేకపోతున్నాడతను. మేఘవర్ణుణ్ణి చూశాడు. ఇలా అడిగాడు.
‘‘మేఘవర్ణా! చాలా రోజుల పాటు కర్పూరద్వీపంలో నువ్వు ఉన్నావు కదా, అక్కడి రాజు గురించి, మంత్రి గురించి నీ అభిప్రాయం ఏమిటి?’’‘‘చెప్పాలంటే వారిద్దరి గురించి ఎంతయినా చెప్పవచ్చు. కాకపోతే రెండు ముక్కల్లో చెబుతాను. హిరణ్యగర్భుడు మంచివాడు. మహానుభావుడు. సజ్జనుడు. సత్యసంధుడు. ఇక సర్వజ్ఞుడయితే అనుభవజ్ఞుడు. సమర్థుడు.’’ అన్నాడు మేఘవర్ణుడు.‘‘సర్వజ్ఞుడు సమర్థుడయితే నీ చేతిలో ఎలా మోసపోయారంతా?’’ అడిగాడు చిత్రవర్ణుడు. సభలోని వారంతా రాజు మాటలకి పెద్దగా నవ్వారు. వారిని వారించాడు మేఘవర్ణుడు. ఇలా అన్నాడు.‘‘వారు మోసపోలేదు. నేను మోసం చేశాను. నమ్మించి మోసం చెయ్యడం పెద్ద కష్టం కాదు. మనల్ని నమ్మి, మన పక్కనే నిద్రిస్తున్న అరివీర భయంకరుడు, మహావీరుడయిన స్నేహితుణ్ణి మనం ఇట్టే మట్టుబెట్టొచ్చు. కత్తికో కండగా నరికేయొచ్చు. దానికి వీరత్వం అవసరం లేదు. పెద్ద బలమూ అక్కర్లేదు. పూర్వం ఒక బ్రాహ్మణుణ్ణి, దొంగలు ఎలా వంచించారో మీకో కథ చెబుతాను. వినండి.’’ అన్నాడు మేఘవర్ణుడు. చెప్పసాగాడిలా.
పూర్వం ఒకానొక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. పాపం అతను అమాయకుడు. యజ్ఞం చేసుకునేందుకు ఓ నల్లమేక కావాల్సి వచ్చిందతనికి. కష్టపడి నాలుగు డబ్బులు పోగు చేశాడు. సంతలో ఓ నల్లమేకను కొనుగోలు చేశాడు. దాని మెడకి ఓ తాడుగట్టి, ఊరికి తీసుకు రాసాగాడు. వస్తోంటే దారిలో చెరువు దగ్గర చాటుగా కూర్చున్న దొంగలు గమనించారతన్ని. నల్లమేకని చూడడంతోనే వారికి నోరూరింది.మేక బలేగా ఉంది. బాగా బలిసి ఉంది. తింటే దీన్నే తినాలి అనుకున్నారు. ఎలాగయినా బ్రాహ్మణుణ్ణి దగ్గర్నుంచి మేకను దొంగిలించాలనుకున్నారు.‘ఎలా దొంగిలిస్తాం? మేకకి తాడు కట్టి లాక్కెళ్తున్నాడు బ్రాహ్మడు.’’ అన్నాడు ఓ దొంగ.
‘దొంగిలించినట్టుగా తెలిస్తే రాజభటులు ఊరుకోరు. మన తోలు తీస్తారు.’ అన్నాడు ఇంకో దొంగ.వాళ్ళల్లో వయసు మళ్ళిన ముసలి దొంగ ఒకడున్నాడు. వాడు, వీళ్ళ మాటలకు తెగ నవ్వుకున్నాడు. తర్వాత ఇలా అన్నాడు.‘తలచుకుంటే నేనా మేకను ఇట్టే కొట్టేయగలను. ఆ బ్రాహ్మణుణ్ణి సులువుగా మోసం చేసి, మేకను సొంతం చేసుకోగలను. అప్పుడు దొంగతనం అన్న ప్రసక్తే ఉండదు. దేనికయినా అనుభవం కావాలి. వంచన ఒక కళ. కోతి-మొసలి కథ వినే ఉంటారు. మొసల్ని కోతి ఎలా వంచిందో తెలుసుకదా?’‘తెలియదు’ అన్నారు దొంగలు.
‘చెప్తాను, వినండయితే’ అన్నాడు ముసలి దొంగ. చెప్పసాగాడిలా.పశ్చిమదేశంలో ఓ సముద్రతీరంలో ఓ అడవి ఉండేది. ఆ అడవిలో ఓ కోతి ఉండేది. దాని పేరు బలవర్ధనుడు. పేరుకే బలవర్ధనుడు కాని, నిజానికి అతను బలహీనుడు. ముసలివాడు. ఆ ముసలితనం వల్లే అతని ఆస్తిని దాయాదులు దోచుకున్నారు. ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. దాంతో బలవర్ధనుడు, తపతీ నదీతీరంలో ఓ మేడిచెట్టు మీద ఒంటరిగా కాలక్షేపం చేస్తున్నాడు. కోతి బుద్ధికదా! మేడిచెట్టు మీది పళ్ళన్నీ కోసి కిందికి, నదిలోనికి ఒకొక్కటీ విసరసాగాడు. పండు నీళ్ళలోపడి ‘టప్ టప్’మని శబ్దం చేస్తోంటే ఆనంద ంగా ఉందతనికి. ఆ నదిలో ఓ మొసలి ఉంది. దాని పేరు క్రకచుడు. టప్‌టప్‌మని నదిలో శబ్దం అవుతోంటే ఏమిటా అని అటుగా చూశాడతను. మేడిపళ్ళు పడుతున్నాయి. అందుకున్నాడు వాటిని. తినసాగాడు.
రుచిగా బాగున్నాయనుకున్నాడు. పైనుంచి కోతి పండు విసరడం, మొసలి అందుకోవడం ఆటగా సాగింది. ఆ ఆట అలా అలా స్నేహంగా మారింది.మేడిపళ్ళు తింటూ, కోతితో కబుర్లాడుకుంటూ క్రకచుడు ఇంటికి వెళ్ళడం మానుకున్నాడు. ఇవతలి తీరంలోనే ఉండిపోయాడు. పెళ్ళాం బిడ్డల్ని మరచిపోయాడు. అవతలి తీరంలోని క్రకచుని భార్య, చాలా రోజులుగా భర్త ఇంటికి రాకపోవడానికి కారణం ఏమిటో కనుక్కోవాలనుకుంది. బంధువు మొసలిని ఒకదాన్ని పిలిచి, విషయం కనుక్కుని రమ్మని పంపించింది. బంధువు మొసలి క్రకచుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది. ఇవతలి తీరాన్న బలవర్ధునితో కబుర్లాడుతూ, కులాసాగా ఉన్న అతన్ని చూసింది. మేడిపళ్ళు తింటూ పెళ్ళాం పిల్లల ఆకలిని పట్టించుకోని వైనం కనిపెట్టింది. చకచకా ఈదుకుంటూ వచ్చి, అసలి సంగతి ఇలా చెప్పింది.‘మీ ఆయన అవతలి తీరంలో ఓ కోతిని కట్టుకుని హాయిగా కాపురం చేస్తున్నాడు. నిన్నూ, నీ పిల్లల్నీ పూర్తిగా మరచిపోయాడు.’‘అయ్యయ్యో’ అంది భార్య మొసలి. గగ్గోలుగా ఏడ్చింది.