అల్లరి చేసే గాడిద


ఒకరోజు శ్రీకృష్ణ దేవరాయల కొలువులో పండిత సభ జరుగుతోంది. అనేక దేశాలనుండి చాలామంది పండితులు వచ్చారా సభకు రకరకాల ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నారు ఆ పండితులు. కానీ సభలో గుసగుసలు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంతో నిశ్శబ్దం కొరవడింది. చివరకు పండితులు చెప్పింది ఎవరికీ అర్ధంకాకుండా పోయింది. దాంతో రాయలువారికి విసుగనిపించి, తెనాలిరామకృష్ణ చెవిలో ఈ విషయం చెప్పాడు.
అంతట తెనాలి రామకృష్ణ ఆలోచించి సభనుద్దేశించి ఇలా అన్నాడు "పండితుల్లారా ఈ సభలో జరుగుతున్న కార్యక్రమం వల్ల ఎన్నో తెలియని విషయాలు మనకు తెలుస్తున్నాయి. కానీ ఇక్కడున్నవారు ఉద్ధండపండితులమన్న విషయం మరిచి సభలో గోల చేస్తున్నారు. ఇది మీకు తగునా?" అన్నాడు.

కొద్దిసేపు బాగానేవున్నా మరలా మామూలుగానే సభలో గుసగుసలు ప్రారంభమైనాయి. వెంటనే రామకృష్ణుడు గట్టిగా మాట్లాడుతూ "మీ కొక కథ చెబుతాను కాస్త వినండి" అని "ఒక అడవిలో ఒకరోజు అన్ని జంతువులకు సమావేశం ఏర్పాటు చేయబడింది. ఆ సమావేశంలో వాటి ప్రవర్తనను బట్టి ఏ జంతువునకు ఏ పేరు పెట్టాలో నిర్ణయించబడింది. హుందాగా ఠీవిగా వుండేదానికి సింహం అని. జిత్తులమారి పనులుచేసే దానికి నక్క అని, పిచ్చిపిచ్చి పనులు చేసేదానికి కోతి అని, విశ్వాసం చూపేదానికి కుక్క అని, గోడవ మరియు గోల చేసేదానికి గాడిద" అని అన్నారు. అనగానే సభలో నిశ్శబ్దం అలుముకుంది.

Responsive Footer with Logo and Social Media