ఆలీబాబా నలభై దొంగలు
ఎన్నో ఏండ్లనాటి మాట. పర్షియాదేశంలో ఒక పెద్ద పట్టణంఉండేది. పురాతనమైనది కావడం వలన పట్టణమైనప్పటికీ అక్కడ పల్లెటూరి వాతావరణం అలుముకుని ఉండేది. ఆపట్టణంలో తోళ్ళ వ్యాపారస్తుడయిన ఒక మహమ్మదీయు డున్నాడు. అతనికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడి పేరు కాశీంబాబా. చిన్న వాడి పేరు ఆలీచాబా. తండ్రి ముసలివాడయినాడు. అవసానకాలం ప్రాప్తించింది.
అప్పుడా వృద్ధుడు తనవద్ద ఉన్న కొద్దిపాటి ఆస్థిని, కుమారులిద్దరికీ సమానంగా పంచియిచ్చి కష్టపడి బ్రతకండని చెప్పి కన్నుమూశాడు. ఒకతల్లి కడుపున పుట్టినా కాశింబాబాకు ఆలీబాబాకు ఎంతోవ్యత్యాసంఉంది. కాశీం స్వార్ధపరుడు. పిల్లికిబిచ్చం పెట్టడు. పైగా అపరిమిత మైన ధనాశ. బుద్ధిమంచిది కాదు. దుర్మార్గపు ఆలోచన. తమ్ముడంటే అతనికి అంతగా ప్రేమ కూడా లేదు. అయితే ఆలీ ఇందుకు పూర్తిగా విరుద్ధం.
అతనిది జాలిగుండె. ఎవరు కష్టంలో ఉన్నా చూడలేడు. అన్నగారంటే అతనికి ఎంతో ప్రేమ, గౌరవం. ఉన్నంతలో తృప్తిపడే గుణం. సాధుస్వభావం. ఇలా ఉండగా కలిసొచ్చే రోజులలో అన్నీ కలిసొస్తాయన్నట్లు కాశీం ఒక ధనవంతుల పిల్లను పెళ్ళి చేసుకున్నాడు.
ఒక్కతే కూతురు కావడం వలన భోలేదంత ఆస్థికి ఆమె వారసురాలయింది. ఇంకేం? భార్య ఆస్తి రావడంతో కాశీం చాలా ధనవంతుడైనాడు. పెద్దభవనాలు కట్టించాడు. స్థలాలు, పొలాలుకొన్నాడు. డబ్బు రావడంతో అతనికి అహంకారం కూడా పెరిగింది. పలుకుబడి, పేరు ప్రతిష్టలు హెచ్చాయి. భర్తకు తగినట్లే కాశిం భార్యకూడా గర్విష్టి.
ఇతరుల బాగు చూచి ఏమాత్రం ఓర్వలేని గుణం. చిన్న వాడయిన ఆలీబాబా కూడా పెళ్ళి చేసు కున్నాడు. అతని అదృష్టం అలాఉంది. అతని భార్య పేడయింటిపిల్ల. మాయలు మర్మాలు తెలియని పాతకాలపు మనిషి. అయినా ఆలీబాబా ఆ పేదరికంలోనే ఆనందంగా ఉంటూ వచ్చాడు. అన్నగారి ఐశ్వర్యం చూచి అతను ఏనాడూ అసూయపడలేదు. రోజూ పట్టణానికి సమీపంలో ఉన్న అడవికి వెళ్ళేవాడు.
అక్కడ ఎండు కట్టెలు కొట్టి, వాటిని తనదగ్గరున్న గాడిదపై వేసుకొని అమ్ము కుంటూ ఆ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అయి నప్పటికీ కాశీంకు, అతని భార్యకు ఆలీబాబా అన్నా, అతనిధార్యఅన్నా సరిపడేది కాదు. వారిద్దరి ఇళ్ళూ, ఒకే వీధిలో దగ్గరదగ్గరగా ఉన్నప్పటికీ కాశీం కుటుంబం, ఆలీబాబా కుటుంబాన్ని ఏనాడూ ఆప్యాయతతో పలకరించండగాని, అతని కష్ట సుఖాలు విచారించడంగాని చేయలేదు. ఆయినా ఆలీబాబా అతనిభార్య అందుకు బాధపడలేదు. భగవంతుని నమ్ముకుని బ్రతుకు తెల్లవారుస్తున్నారు. కొన్నాళ్ళకు ఆలీబాబాకు ఒక కొడుకు పుట్టాడు.
తల్లి పాలులేనందువలన బిడ్డను పెంచడం కష్ట మైనది. కుటుంబంలో ఖర్చు ఎక్కువైంది సంపాదసమాత్రం పెరగలేదు. దరిద్రము అనుభవిస్తూ ఆలీబాబా, భగవంతుడిపై భారంపేసి, సంసారము ఈదుతున్నాడు.