అహంకారం
రామాపురంలో విష్ణుదత్తుడనే వేదాంతి వుండేవాడు. అతడు సకల కళలలోను ప్రావీణ్యం సంపాదించాడు. అయితే విష్ణుదత్తుడికి ప్రపంచంలోని వ్యక్తుల మీద నమ్మకం వుండేదికాదు. ఎవ్వరూ కూడా నిర్మల హృదయులు కారని అతడు భావించేవాడు.
ఆ విశ్వాసంతోనే అతడు లాంతరు చేతపట్టుకుని రామాపురంలో తిరుగుతుండేవాడు. అతని ప్రవర్తన అందరికీ వింతగా ఉండేది. కొందరికి అతని ప్రవర్తన ఆశ్చర్యం కల్లించడంతో వారంతా వెళ్ళి విష్ణుదత్తుడ్ని అసలు విషయం అడిగారు. అపుడు విష్ణుదత్తుడు "ఈ లోకంలో ఎవరైనా నిర్మల హృదయుడు వున్నాడా?" అని వెదుకుతున్నాను. ఆ అన్వేషణలో సూర్యుని కాంతి కూడా చాలకపోవడం వల్ల అదనంగా నా దీపాన్ని కూడా వెలిగించి వెదుకుతున్నాను. ఇంతవరకూ నాకు ఒక్కడూ కనిపించలేదు అని జవాబిచ్చాడు.
మహా పండితుడైన విష్ణుదత్తుడితో వాదించలేక అందరూ వెళ్లిపోయారు. విష్ణుదత్తుడు ఊరంతా తిరిగి తిరిగి గ్రామ శివారున గల ఒక పాక వద్దకు వచ్చాడు ఆ పాకలో నివసిస్తున్న ఒక వృద్ధురాలు అతని ప్రవర్తనకు విస్తుపోతూ "అతడలా తిరగడానికి కారణమేమిటని?" ప్రశ్నించింది. దానికి విష్ణుదత్తుడు అంతకుముందు ప్రజలకు చెప్పిన సమాధానాన్ని చెప్పాడు. దానికి వృద్ధురాలు నవ్వి "అయ్యా! ఈ మాత్రపు పనికి మీ వంటివారు ఇంత శ్రమపడాలా? లోకంలో ఎవరైనా నిర్మల హృదయులు ఉన్నారా? లేదా? అని వెదికేముందు మిమ్మల్ని మీరు ఆత్మపరీక్ష చేసుకోండి.
అప్పుడు మీరు నిర్మలహృదయులుగా తోస్తే ప్రపంచంలోని వారంతా మీ హృదయానికి నిర్మలంగానే కనిపిస్తారు. మీరే నిర్మల హృదయులు కాకపోతే మిగిలిన ప్రపంచమంతా మీకు మలినంగానే కనిపిస్తుంది. ఇంతకూ ప్రపంచంతీరు మన దృష్టిమీద ఆధారపడి వుంది కాబట్టి ఇలాంటి విషయంలో ఆత్మపరీక్ష కావాలి" అని అంది.
వృద్ధురాలి మాటలు విన్న విష్ణుదత్తుడు సిగ్గుపడుతూ ఆనాటినుంచి గర్వం విడిచి తనలాగే సాటివారు కూడా మనుషులేనని గ్రహించి మామూలుగా ఉండటం నేర్చుకున్నాడు.