అనువుగాని చోట…



ఒకసారి దుర్యోధనుడు తన తమ్ముళ్ళయిన దుశ్శాసనుడు, దుస్తహుడు, దుర్విగాముడు, దర్శదుడుతో హిడింబీ వనానికి విహారార్థం వెళ్ళాడు. రాకరాక ఇన్నాళ్ళకు మరుదులు తనింటికొచ్చినందుకు హిడింబి సంతోషించి, విందు భోజనానికి ఏర్పాట్లు చేసింది. విందుకు ముందు దుర్యోధనుడు హిడింబితో తన పరాక్రమం గురించి, తన తమ్ముళ్ళ వరాక్రమం గురించి చాలాసేపు చెప్పాడు. భీముడు తన కాలిగోటికి పనికిరాడు అన్నాడు. హిడింబి అంతా ఓపికగా వింది.

చివరికి మరుదులు నలుగురికి విందు వడ్డించింది హిడింబి. అందరికీ తలా ఓ పళ్ళెం పెట్టి దాన్లో నువ్వులు కూడా వడ్డించింది. అందరూ అన్నీ కలుపుకున్నారు. “నెయ్యి ఏది?” అన్నాడు దుర్యోధనుడు. మేం నెయ్యివాడం. నువ్వుల నూనెనే వాడతాం అన్నది హిడింబి.

"ఈ నువ్వులనుండి నూనె ఎలా వస్తుంది?” అన్నాడు దుర్యోధనుడు ఆశ్చర్యంగా. “ఈ నువ్వుల్లోనుండి నూనె పిండుకో మరిదీ! దానినుండి నూనె కారుతుంది” అన్నది హిడింబి. దుర్యోధనుడు తన కుడిచేత్తో నువ్వులు చేతిలోకి తీసుకుని గట్టిగా పిండాడు. కానీ నూనె రాలేదు. దుర్యోధనుడు ఎంతో ప్రయత్నించాడు. ఫలితం శూన్యం! వెంటనే హిడింబి తన కుడి అరచేతితో దుర్యోధనుడి కుడి పిడికిలిని ఒడిసి పట్టి గట్టిగా పిండింది. నువ్వుల నూనెతో సహా దుర్యోధనుడి పిడికిలినుండి రక్తం కూడా కారి అన్నంలో పడింది.

"చూసావా మరిదీ! ఇందాక నీ పరాక్రమం గురించి చాలాసేపు చెప్పావు. నా బలం చూశావ్‌ కదా! భీముని భార్యను నేను. ఇక భీముని బలం గురించి నీకు నేను వేరే చెప్పనక్కర్లేదు. భీముని ముందు నువ్వెంత? భీముడెప్పడు ఇక్కడికొచ్చినా నువ్వుల నూనె పిండుకునే భోజనం చేస్తాడు. నా దగ్గర చెబితే చెప్పావ్‌ కానీ నీ సోదరుడు భీముని దగ్గర నీ ప్రతాపం గురించి చెప్పకు! ఆయన అసలే కోపిష్టి” అన్నది హిడింబి మందలింపుగా, దుర్యోధనుడు సిగ్గుతో చితికిన అరచేతికి కట్టుకట్టుకున్నాడు.

అనువుగాని చోట అధికులమనరాదు.

Responsive Footer with Logo and Social Media