అబద్ధం
పూర్వకాలంలో రాజమహేంద్రిలో ఒక నిరుపేద బ్రాహ్మణుడుండేవాడు. నాలుగు వేదాలు క్షణ్ణంగా చదువుకున్న పండితుడు. అందువల్ల రాజమహేంద్రిలోను ఆ చుట్టు పక్కల గ్రామాలలోను ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులుండేవి. ఎక్కడ యే శుభకార్యం జరిగినా, యజ్ఞాలు, యాగాలు, విద్వత్ సభలు ఏవి జరిగినా ఈ బ్రాహ్మణుడికి కూడా పిలుపు వస్తుండేది. అంతేగాని ఆ విప్రుని ఆదాయం మాత్రము ఏ రోజునా దినసరి బత్యానికి లోటు లేకుండా బ్రతుకు సాగిపోతుంది. అదే చాలు అని తృప్తిపడేవారు.
ఆ దంపతులకు ఒక్కొగానాక్క కొడుకు, అతడ్ని అల్లారుముద్దుగా పెంచుకుంటు న్నారు. తాను ఎక్కడకు, వెళ్ళినా ఆ పిల్లవాడ్ని వెంటతీసుకుని వెడుతుండేవాడు. పాఠాలు వల్లివేయడమే కాకుండా. సభలు శుభకార్యాలు, వివిధ తరహాల జనులు వారి వారి సంస్కారాలు అర్ధం చేసుకుని తన కొడుకు లౌకిక జ్ఞానం పొందాలన్నది ఆ తండ్రి ఆశ ఒక్కడు కావడం వల్ల విడిచి ఉండలేని మమకారం వల్లకూడా ఆ తండ్రి ఆ కొడుకును తన వెంట తిప్పుతుండేవాడు. తండ్రి ఎంత అదుపాజ్ఞలలో పెంచుతున్నా మమతలవల్ల, గారాబంవల్ల, ఆ పిల్లవాడు ఆకతాయిగా తయారయ్యాడు. ఇంటనున్నపుడు తండ్రి పిలుపుకైనా దొరికేవాడు కాదు. అల్లరి పిల్లలతో గూడి ఆటలాడుతూ గ్రామమంతా పోకిరిగా తిరుగుతుండేవాడు. అందువల్ల కూడా ఆ తండ్రి కొడుకును తనవెంట ఉంచుకోనేవాడు.
రాజమహేంద్రికి రెండు క్రోసుల దూరంలో ఉన్న వీరవల్లిలోని ప్రముఖ క్రౌష్టివ్రతం చేసుకుంటూ ఆ విప్రుడికి కూడా కబురు పెట్టేడు. విప్రుడు తన కుమారుడ్షి తీసుకొని వీరవల్లి కాలి నడకన బయలుదేరాడు. సమయానికి ఆ గ్రామం చేరుకుని క్రొష్టి ఇచ్చిన సంభావన, స్వయంపాకం అందుకుని తన గ్రామానికి తిరుగుముఖం పట్టేడు.
సాయం సమయం కావడం వల్ల, అరణ్య మార్గమైనందువల్ల, తొందరగా ఇల్లు చేరుకోవాలని విప్రుడు వేగంగా నడువసాగేడు. పిల్లవాడు తండ్రితో సమంగా నడవ లేక వెనకబడిపోవడం వల్ల తండ్రి హెచ్చరిస్తూ, పిలుస్తూ, ఆగుతూ నడుస్తున్నాడు. అంతలో ఆ కుర్రవాడికొక ఆలోచన కలిగింది. తండ్రి తనకోసమని ఆగుతున్నాడేకాని వెనుకకు రాడం లేదు. వెనక్కు వస్తాడో రాడో చూడాలని ఆకతాయితనంగా ఆలోచించాడు.
“నాన్నా పులి! అంటూ గావుకేక పెట్టేడు! ముందు నడచి వెడుతున్న తండ్రి గుండెలు గుభేలు మన్నాయి. పరుగు పరుగున వెనుకకు కొడుకు దగ్గరకు వచ్చేడు. రొప్పుతున్న తండ్రిని చూచి విజయగర్వంతో నవ్వేడు. కొడుకును చెంత చేర్చుకుని అలా అనకూడదు. అబద్ధమాడితే అనర్థం కలుగుతుంది అని చెప్పి వెంటబెట్టుకుని ముందుకు బయలుదేరాడు.
మరి కొంతదూరం పోయేసరికి కొడుకు మళ్ళీ వెనకబడ్డాడు. మళ్ళీ తండ్రిని ఆటపట్టించాలని “నాన్నా పులి” అంట్లూ కేక పెట్టాడు. ఈ సారి కూడా ఏమీ లేకపోవడం చూచి తండ్రికి కొడుకు ఆకతాయి తనానికి విసవిసలాడుతూ, “బాబూ! ఇలాగున పెద్దవాళ్ళతో వేళాకోళం ఆడడం అబద్ధాలు ఆడడం మంచిదికాదు. నీ వెకిలితనం కట్టిపెట్టి తొందరగా నడు, చీకటి పడకముందే అడవిని దాటెయ్యాలి నడు" అంటూ ముందుకు బయలుదేరాడు.
ఇద్దరూ వేగంగానే నడుస్తున్నారు. దురద్వష్రవశాత్తూ పొదల చాటునుంచి ఒక పులి రావడం జరిగింది. కుర్రవాడు భయపడి “నాన్నా! పులి” అంటూ బిగ్గరగా అరిచేడు. తండ్రి కుర్రవాడికి వెటకారం తగ్గలేదనుకుని చాలుగాని తొందరగా రా"! అంటూ ముందకు సాగిపోయాడు.
ఆ పులి వచ్చి పిల్లవాడిమీద పడింది “నాన్నా పులి' నిజంగానే వచ్చింది నన్ను చంపేస్తోంది రక్షించు నాన్నా పులి” అంటూ అరిచాడు. తండ్రి “పులిలేదు గిలిలేదు. అల్లరి మాని తొందరగా రా!” అన్నాడు. ఆ పులివాత పడ్డ బాలుడు “అయ్యో రెండుసార్లు పులి పులి అని అబద్ధమాడడం' వల్ల నిజంగా పులి వచ్చి కేకపెడితే అదికూడా అబద్ధమే అనుకున్నాడు నా తండ్రి, నా అబద్ధం నా ప్రాణాలనే తీసింది” అని వాపోతూ మరణించాడు.