ఆశపోతు నక్క కథ


ఒక అరణ్యము నందు వేటగాడు వేటాడుచూ ఒక జింకను చంపెను. దానిని వాడు భుజమున వేసుకుని పోవుతుండగా చూడక అటువైపుకు వచ్చిన పామును తొక్కెను. వేటగాని కాలికింద పడిన పాము చనిపోతూ ఆఖరిక్షణమున అతడిని -కాటువేసినది. దానితో ఆ వేటగాడు తక్షణమే మరణించాడు. ఇలా జింకా, పాము, వేటగాడి శవాలు ఆ అడవినందు పడి ఉన్నాయి.

అప్పుడే ఆహారము కొరకు అటువైపుగా వచ్చిన నక్క ఈ మూడింటిని చూసింది. అంతే దాని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. "ఈ రోజు లేచి ఎవరి ముఖం చూశానో ఒకేసారి జింకా, పాము, మనిషి దొరికినారు. ఈ ఆహారం నాకు ఎన్నో రోజులకు సరిపోతుంది. ఇక నాకు ఆహారం కోసం ఎటువంటి కష్టము ఉండదు. అనుకుని కొద్దిసేపు ఆనందంతో ఉకపెట్టుతూ అటు ఇటు గెంతినది.
ఇంతలో ఆకలి విషయం గుర్తొచ్చి ఈ పూటకు ఏది తిందామా అని మూడింటి వంకా చూసింది. అయితే ఆ మూడింటిలో దేనిని తినటానికి దానికి మనస్కరించ లేదు. ఈ పూటకు ఏదో ఒకటి దొరికినది తినేస్తాను. ఉదయాన్నే ఈ పాముతో మొదలుపెట్టి, జింకను ఒక పది రోజులు, మనిషిని ఒక నెలరోజులు తింటాను. అనుకుని సమీపంలో ఆహారం కోసం ఏదనా చిన్న జంతువు దొరుకుతుందేమోనని చూసింది.

వేటగాడికి సమీపంలోనే వాడి విలుత్రాడు పడి ఉన్నది. దానిని చూసి నక్క "ఇది జంతువు నరంతో చేసినది కనుక ఈ పూట దీనితో నా ఆకలిని తీర్చుకుంటాను". అని దాని దగ్గరకు చేరి విలుత్రాడును తన పంటితో గటిగా కొరికింది. ఆ విలుత్రాడు తెగడంతోనే దానికి కట్టిన పుల్ల వేగంగా వచ్చి సక్క గుండెలో గుచ్చుకుంది. అది బాధతో మెలికలు తిరుగుతూ తన ప్రాణాలు వదిలింది.

Responsive Footer with Logo and Social Media