This Story is a Part of Potana kavithalu click here for more stories
రుక్మిణీ కళ్యాణం (Rukmini Kalyanam)
విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజుకి రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు. వీరికి రుక్మిణి అనే సోదరి ఉంది. రుక్మిణీదేవి శరత్కాల చంద్రబింబం వలే దిన దిన ప్రవర్థమానమై యవ్వన వయస్సుకు వస్తుంది. వసుదేవ నందనుడు శ్రీకృష్ణుడు రుక్మిణి దేవి గురించి విని ఆమె తన భార్య కావాలి అని అనుకుంటాడు. అదే విధంగా రుక్మిణీ దేవి కూడా శ్రీకృష్ణుడి గురుంచి విని శ్రీకృష్ణుడినే తన భర్తగా పొందాలని అనుకుంటుంది.
రుక్మిణీ దేవి పెద్దలు దీనికి అంగీకారం తెలిపి పెళ్ళి దిశగా పనులు మొదలు పెడుతుండగా రుక్మి ఈ మాటలు విని తన సోదరిని శిశుపాలుడికిచ్చి పెళ్ళి చేయాలని తీర్మానిస్తాడు. రుక్మి ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు. ఈ విషయం తెలుసుకొన్న రుక్మిణీ దేవి చాలా చింతిస్తుంది.
కొద్ది సేపు ఆలోచించి తన శ్రేయస్సు కోరే అగ్నిద్యోతనుడు అనే విప్రవరుడిని రప్పించి తన మనస్సు విప్పి విషయం చెప్పి ద్వారకపురమునకు వెళ్ళి శ్రీకృష్ణునకు తన అభీష్టము తెలిపి ముహూర్తమునకు ముందే ఇక్కడకు వచ్చి తనని చేపట్టమంటుంది. అగ్నిద్యోతనుడు హుటాహుటిన ద్వారకకు వెళ్ళి రుక్మిణీ దేవి పలికిన పలుకులు శ్రీకృష్ణునకు విన్నవిస్తాడు.
అంతేకాక శ్రీకృష్ణుడికి ఆ విప్రవరుడు రుక్మిణీ దేవి ఏవిధంగా చేపట్టాలో ఆలోచన ఈ విధంగా చెబుతాడు. "యదువంశ నందనా! రుక్మిణీ దేవి వారి వంశములోని వారి ఆచారము ప్రకారం పెళ్ళి కుమార్తె పాణిగ్రహణానికి ముందు నగరం పొలిమేరలలో ఉన్న దేవాలయానికి గౌరీ పూజకు వస్తుంది. ఆ సమయములో యదువంశ నందనా, నువ్వు ఆమెను తీసుకొని వెళ్ళవచ్చు. ఆమెతో పాటు ఎవ్వరు ఉండరు కావున యుద్ధము జరిగే ప్రసక్తి కూడా ఉండదు." శ్రీ కృష్ణుడు అందుకు అంగీకరిస్తాడు. వారిరువురు విదర్భ దేశము వైపు బయలు దేరుతారు.
అగ్నిద్యోతనుడు రుక్మిణి వద్దకు వెళ్ళి శ్రీ కృష్ణుడితో జరిగిన సంభాషణ చెబుతాడు, శ్రీకృష్ణుడు ఆమెని సర్వలోకేశ్వరి దేవాలయంలో కలవనున్నట్లు కూడా చెబుతాడు. అనుకున్న ప్రకారము రుక్మిణీ దేవి నగరపొలిమేరలలో ఉన్న సర్వలోకేశ్వరి ఆలయానికి వస్తుంది. అర్చనలు పూర్తి చేసి తిరిగి రాజధాని వైపు వస్తోంది. రాజధాని వీథులలో అనేక రాజ్యాల రాజులు ఉన్నారు. అందరు చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆమెని తన రథం మీద ఎక్కించుకొని హుటహుటిన ద్వారక వైపు బయలుదేరతాడు. అలా రుక్మిణీ దేవిని తిసుకొని వెళ్ళుతున్న శ్రీకృష్ణుడిని చూసి అందరు తెల్లబోయారు. తేరుకొని శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయలుదేరారు.
అప్పుడు బలరాముడు మొదలైన యదువీరులు ఆ రాజులను చెల్లాచెదురు చేశారు. ఆ రాజులు పిక్కబలం చూపి పారిపోతూ, శిశుపాలుని చూసి "నాయనా! బతికి ఉంటే కదా భార్య! ఇప్పుడు ఇంటికి వెళ్ళి మరో రాచకన్యని పెళ్ళి చేసుకో" మని చెబుతారు. కాని రుక్మి తన సేనతో దూకుడుగా వెళ్ళి శ్రీకృష్ణుడి రథానికి ఎదురుగా నిలిచి దండయాత్ర చేస్తాడు. అనేక విధాల శ్రీకృష్ణుడిని దుర్భాషలాడి బాణాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు ఒక్క బాణం విసిరి, వాడి ధనస్సు ఖండించాడు. మరికొని నిశిత శరాలతో గుఱ్ఱలను చంపాడు.
శిశుపాలుడు పరిగ, గద ఆదిగా గల అనేక ఆయుధాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు అన్నింటిని ఛేదిస్తాడు. శ్రీకృష్ణుడు రుక్మి శిరస్సు ఖండించదలస్తుంటే, రుక్మిణీ దేవి శ్రీకృష్ణుడి కాళ్ళపై పడి తన సోదరుడిని క్షమించి విడిచిపెట్టమంటుంది. శ్రీకృష్ణుడు శాంతించి రుక్మికి తల గొరిగించే సన్మానం చేస్తాడు. అది చూసి రుక్మిణీ దేవి విచారిస్తుండగా, బలరాముడు రుక్మిణీ దేవిని ఓదారుస్తాడు.
ఆ తరువాత శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని ద్వారకకు తీసుకొని వెళ్తాడు. ద్వారకకు వెళ్ళాక అక్కడ పెద్దలు విద్యుక్తంగా రుక్మిణీ శ్రీకృష్ణులకు వివాహం జరిపిస్తారు.