నచికేతుని కథ
విక్రమార్క మహీపాలా: మార్గాయాసం కలుగకుండా ఒక చక్కని కథ చెబుతా: వినుము. పూర్వం “వాజస్రవుడు" ఆను ముని ఉండేవాడు. అతడు సత్యపుత్రుడు. కలలోకూడ అసత్యము చెప్పుట యెరుగడు. అతని కుమారుడు నచికేతుడు; సకల విద్యాపరిపూర్ణుడు. తండ్రివద్దనే విజ్ఞానమును ఆర్జించినాడు.
వాజస్రవుడు ఒకప్పుడు "విశ్వజిత్తు" అనుయాగము చేయుటకు సంకల్పించుకొన్నాడు. ఆ యాగము చేయువారు తమకు ఉన్న దంతయు
దానము చేయాలి; చేయకపోతే యాగఫలము దక్కదు. మోక్షముకూడ లభించదు.
వాజస్రవుడు దానం చేయునప్పుడు - పుత్ర వ్యామోహంతో మంచి మంచివి కుమారునికి ఉంచుచు, తక్కినవి దానం చేస్తున్నాడు. ఆ మునికి గోసంపద చాలా ఉంది. ఆ గోవులలో పాలు సమృద్ధిగా యిచ్చు గోవులను, కుమారునికి ఉంచుతూ, బక్కచిక్కిన వానిని దానము చేయసాగెను.
నచికేతుడు ఈ దానములను చూచి మిక్కిలి విచారించాడు. అయ్యో! మా తండ్రి పుత్ర వ్యామోహంవల్ల దానంలోకూడ స్వార్థము చూపుతున్నాడు. ఇట్టిదానము వలన సద్గతి యెట్లు లభించును?" అని తలంచి; తండ్రిని చేరి "నాన్న గారూ! మీరు తలపెట్టిన కార్యము చాల పవిత్రమైనది. మోక్షము నొసగునది. కావున మీరు నాపై గల మమకారం విడిచి, మీ కార్యమును కొనసాగింపు" మని ప్రార్ధించెను.
తండ్రి వినలేదు. అతడు యధాప్రకారముగా - మంచి మంచివి ఉంచుచు. మిగిలినవానిని దానము చేయుచుండెను.
కుమారుడు అది చూచి సహింపలేకపోయాడు. "తండ్రీ: మీరీ వస్తువులు, గోవులను విశ్వజిత్తు యాగమునకని మహారాజుల నుండి ఆర్ధించి తెచ్చినవే గదా!" కాని, కొన్నిటిని మీరే సంగ్రహించుచున్నారు. "తస్కరులు, ఆసత్యవాధులు" అను పేరు కూడా మీరు ఈ దానాలవల్ల పొందనున్నారు. “ఇంత వరకు మగ వంశము నందు అనృతవాదులు జన్మించలేదు" అని మీరే అనేక సార్లు చెప్పి యున్నారు. మీ వాక్యంను మీరే విస్మరించుట మంచిది కాదు" అని హెచ్చరించాడు. తండ్రి అప్పటికి కూడా వినలేదు. పైగా మిక్కిలి కోపగించాడు.
నచికేతుడు ఊరుకోలేదు. యింకా యిలా అన్నాడు. "నా మీద గల మమకారము కొద్దీ, మీరిట్టి ఆకృత్యం చేయుచున్నారు. నేనీ దానములను చూడ బాలకొన్నాను. నన్ను కూడా ఎవరికైన దానమొసంగుడు; అప్పుడు మీరు సర్వసంగ పరిత్యాగులు కాగలరు అన్నాడు.
మునికి చాలా కోపం వచ్చింది. దూరం ఆలోచింపక "ఔను; నిన్ను మృత్యుదేవతకు దానం చేస్తాను; పిల్వు" మని అన్నాడు. నచికేతుడు సంతోషించాడు. "తండ్రీ! పిలుచుట యెందుకు? నేనే స్వయంగా యముని దర్శించెదను. మీరు యాగమును పూర్తిచేసి, మోక్షమును పొందుడు" అని పలికి యముని
దర్శించుటకై తండ్రియనుమతిని కోరెను. ముని-తాను కోపమున అన్న మాటలను మననం చేసికొన్నాడు. "అయ్యో ఎంతపని జరిగినది: యమునివద్దకు పంపకపోతినా, అసత్యవాదిని కాగలను; పితృ దేవతలు నాపై అలిగి శపింతురు. పంపించినచో ఉన్న ఒక్క కుమారుడు దూరమగుతాడు; ఇక నే జీవించుట ఎట్లు? ఎందుకు?" అని కుమారునికి యనుమతి నిచ్చుటకు వెనుకాడెను.
నచికేతుడు తండ్రి మనస్తానం గ్రహించి "నాన్నగారూ, మీరు అల్పుల వలె అవివేకములో మునుగుచున్నారు. ఎన్నిటికైనను ఈ మృత్యువు తప్పునది కాదు. పుట్టుట.--- గిట్టుట మానవనైజమే కదా! కావున, తాము నాపై మమకారమును విడిచి పెట్టుడు. సత్యవాక్పరిపాలనము గావించి యశస్సు గాంచుడు" అని ప్రార్ధించినాడు.
తండ్రి ఆలోచించాడు. "ఔను: నా పుత్రుడన్నది నిజమే. ఈ మమకారములన్నీ సత్యవ్రతముకంటే చాల ఆల్పములే "అని తలంచుకొని కుమారుని ఆశీర్వదించి యమలోకంనకు పంపించాడు."
"మహారాజాః కథ వింటివిగదాః తండ్రి యొక్క మోక్షమును వాంఛించి యమలోక మేగిన కుమారుడు (నచికేతుడు) గొప్పవాడా! లేక సత్య శీలమునకై కుమారుని విడనాడిన తండ్రి (వాజస్రవుడు) గొప్పవాడా?" అని భేతాళుడు మహారాజును ప్రశ్నించెను.
విక్రమార్కుడు ఆలోచించి "భేతాళా! నచికేతుడే గొప్పవాడు. తండ్రికి మాత్రమేగాక, తనవంశమునకెల్ల "ఆనృతదోషం కల్గకుండా ప్రవర్తించినాడు. ఇట్టి ఉత్తమాదర్శముగల నచికేతుని ఆ యముడు ఎట్లు స్వీకరించినెలా మరి" అని విక్రమార్కుడు తన సందేహమును వెల్లడించెను.
"సత్యం గ్రహించావు మహారాజా! యముడు నచికేతుని స్వీకరించలేదు. ఆతని శిలమును మెచ్చుకొని "ఆత్మస్వరూపం" అను ఆత్మజిజ్ఞానను బోదించి---ఆశిర్వదించి - తిరిగి అతనిని తండ్రియగు వాజస్రవుని వద్ద పంపివేసెను." అలా ) పలుకుచు ఎగిరి వృక్షంను చేరుకొన్నాడు.
విక్రమార్కుడు తిరిగి భేతాళుని బంధించి తెచ్చుటకు వెనుకకు మరలినాడు.
పట్టువదలని విక్రమార్కుడు తిరిగివచ్చి భేతాళుని బంధించి పట్టుకొన్నాడు. భుజంపై వేసుకొని సన్యాసి ఆశ్రమానికి బయలుదేరాడు. భేతాళుడు తిరిగి యిట్లు యింకొక కథ ప్రారంభించాడు.