9.గుర్రం గుడ్డు బేరం



గురుపత్ని పేరిందేవి గారొక ఇద్దరు శిష్యులను పిలిచి, అప్పటికి రెండ్రోజులుగా మన ఇంట్లో పాడి ఆవు కనిపించడం లేదు వెతకమని సెలవిచ్చారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని, దానంలో దొరకని సరుకులు కొనుక్కొని రావడానికో ముగ్గురు: తగినంత వంట చెరకు సమకూర్చడానికో ముగ్గురు శిష్యులు చొప్పున నలుదిశలకూ బయల్దేరి వెళ్ళిపోయారు. గుర్రం బేరం చేయడానికి వెళ్ళిన శిష్యులూ, ఆవుని వెదకబోయిన శిష్యులూ కలుసుకొని “ఆవు ఎలాగూ కనిపించలేదు కనుక పనిలో పని ఓ ఆవును కూడా కొనేద్దామంటూ అశ్వనిపుణ శిష్యులతో కలిసి బయలుదేరారు.

అలా వెళ్ళిన నలుగురు శిష్యులకూ ఓచోట ఒక కోనేరు, దానిపక్కనే పచ్చని పొలం, పొలంలో కొన్ని గుర్రాలు మేయడం కనిపించాయి. వాటి పక్కనే కొన్ని బూడిద గుమ్మడికాయలు తెల్లగా నేలను కాసి ఉన్నాయి. మన ప్రబుద్ధులు ఆ గుమ్మడి కాయలనెన్నడూ చూడలేదు. * వారికి తెలిసిందల్లా తియ్య గుమ్మడి మాత్రమే! పైగా ఈ తెల్లని బూడిద గుమ్మడి గుర్రాల పక్కన చూసేసరికి, అవి గుర్రం గుడ్లు అయి ఉంటాయని వారికివారే నిర్ధారించేసుకున్నారు.

"గుర్రం ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది కదా! అందువల్ల గుర్రం గుడ్లుకొని పిల్లల్ని చేయిస్తే చౌకగా గిట్టుబాటు అవుతుంది"... అనుకొని, తిరుగుముఖం పట్టి గురువుగారి దగ్గరికెళ్ళారు. “పోయిన ఆవు ఎక్కడా కనిపించలేదు" అని గురువమ్మ గారికి తెలియజేసి, గురువుగారితో "గురువర్యా! ఒకచోట కొన్ని గుర్రాల్ని, గుర్రం గుడ్లని చూశాం. ఈ కాలాన్ని బట్టి చూస్తే గుర్రం ఖరీదు అధికంగా ఉండేలా తోస్తోంది. కనుక, గుర్రం గుడ్లు కొని పిల్లల్ని చేయిస్తే...." అని ఓ శిష్యుడు అంటుండగానే “ఓహో! భేష్! చాలా మంచి ఆలోచన, కాని గుడ్లు పొదగాలి కదా!" అంటూ సందేహాన్ని వెలిబుచ్చారు పరమానందయ్య.

"దానికేముంది? రోజుకొకరు చొప్పున గుడ్ల మీద వెచ్చగా కూర్చొని పొదిగేస్తే పోలా?" అనేసి సమస్య తేలిగ్గా తేల్చేశారు. గురువు గారికి తన శిష్యుల అసమాన ప్రతిభా విశేషాల మీద అపారమైన నమ్మకం కదా! “సరే కానివ్వండి” అంటూ గుర్రంగుడ్లు ఖరీదు చేయడం కోసం మన అశ్వ నిపుణులకు కొంత ధనం ఇచ్చి పంపించారు. దారిలో గుర్రం ఎక్కడం వల్ల గురువు గారి హుందాతనం ఎలా పెరిగేదీ ముచ్చటించుకుంటూ, ఇంతకు ముందు తాము గుర్రాలను ఎక్కడ చూసిందీ వెతుక్కుంటూ అవి నిలిచి ఉన్న పొలం దగ్గర కొచ్చారు. బూడిద గుమ్మడి కాయలూ అక్కడే అలానే ఉన్నాయి. అక్కడికి దగ్గరలో ఉన్న ఒక రైతును చూసి "ఈ గుర్రం గుడ్లు ఖరీదుకు ఇస్తారా? ఇస్తే ఎంత చెప్తున్నారు?" అని అడిగాడొక శిష్యుడు.

మొదట వేళాకోళంగా అంటూన్నారేమో అనుకున్న ఆ రైతుకు ఇంకో శిష్యుడు కూడా ఇదే ప్రశ్న అడిగి “ఊరకే నాన్చుడు వ్యవహారాలు మాకు నచ్చవు. ఠకాఠక్! బేరం తేలిపోయే ఖరీదు చెప్పు!” అంటూ రెట్టించే సరికి, వీళ్ళెవరో వెర్రి బాపనయ్యల్లా ఉన్నారని గమనించేసిన ఆ రైతు బిగుసుక్కూర్చున్నాడు- బేరం చెప్పక. “అయ్యవార్లూ! ఇవి మహారాజుల గుర్రాలు, మేలుజాతి అశ్వాలు. వీటి గుడ్లు సాధారణంగా అందరికీ దొరికేవి కావు. మీరెంతో అక్కరలో ఉండి అడిగారు గనుక మీకు అమ్ముదామని నిర్ణయించుకున్నాను. ఎన్ని గుడ్లు కావాలి?" అన్నాడు. "ఎన్నో అక్కర్లేదు, ఒక్కటి చాలు!" అన్నాడో శిష్యుడు. "ఓహో! ఈ మాత్రానికేనా? గుడ్దు ఖరీదు నలభై వరహాలు అన్నాడు. రైతు. ఏదైనా కొనేటప్పుడు బేరంచేసి కొనాలని, గతంలో గురువుగారొక సారి అనడంతో, “చాలా ఎక్కువ చెబుతున్నావయ్యా!" అన్నాడు ఆ సంగతి గుర్తొచ్చిన శిష్యుడు.

"నేను ముందే చెప్పాను, ఇది మేలుజాతి గుర్రం గుడ్లని, ఆపైన మీ ఇష్టం. అంతగా మీరు అడుగుతున్నారనీ- పైగా బాపనయ్యలు అడిగితే లేదనకూడదనీ అమ్ముదామనుకున్నాను. సర్లెండి! ఓ ఐదు వరహాలు తగ్గించివ్వండి" అన్నాడు ఎంతో ఉదారంగా ఆ రైతు. అదే మహద్భాగ్యం అనుకొని లెక్కించి 35 వరహాలూ ఆ రైతు చేతిలో పోసి, అతడిచ్చిన గుర్రం గుడ్డును నెత్తిపై పెట్టుకుని వంతుల వారీగా మోసుకు వస్తున్నారా శిష్యులు. గుడ్డు నెత్తిపై పెట్టుకున్న వాని కాలికి రాయి తగిలేసరికి, అతడు తూలి పడబోయి నిలదొక్కుకున్నాడు గాని నెత్తిపైనున్న బూడిద గుమ్మడి (వారి లెక్క ప్రకారం 'గుర్రం గుడ్డు') దభేల్న పడి పగిలింది. చెక్కలైన బూడిద గుమ్మడి పొదల్లోకి వెళ్ళి పడేసరికి ఆ పొదల్లో తల దాచుకుంటూన్న ఓ చెవుల పిల్లి చెంగున గెంతుతూ పరుగులెత్తింది.

"ఓసి! దీందుంపతెగ! ఇది పగిలీ, పగలగానే పిల్ల బైటికొచ్చిందే! చూడు! ఎలా పరిగెత్తుతున్నదో! ఇదేగాని పెద్దదైతే రెక్కల గుర్రంలా ఆకాశంలో దూసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అనుకుంటూ తలోవైపు కాపు కాసి దాన్ని పట్టుకోజూశారు. అది వారిని ముప్పుతిప్పలు పెట్టి, బాగా అలుపొచ్చేక తప్పించుకు పారిపోయింది. ఇక, గుర్రపు పిల్ల చేజారిపోయిందని రూఢి చేసుకున్నాక, బాగా అలసిపోయిన శిష్యులు చెట్టుకింద మేను వాల్చారు. గుర్రం గురించిన సంగతులు తాము విన్నవీ, కన్నవీ ముచ్చటించుకుంటూ.

ఆ దారిన పోతున్న ఓ బాటసారి వీళ్ళ మాటలు విని, సంగతి తెలుసుకొని "ఓయి మీ అమాయకత్వం కూల! గుర్రం ఎక్కడైనా గుడ్లు పెడుతుందా?" అని అడిగాడు. "ఏం? మేం నీ కంటికి వెర్రి వాళ్ళలా కనిపిస్తున్నామా? గుర్రం గుడ్లు ఖరీదు చెయ్యడానికి అవసరమైన సొమ్ము మా గురువుగారే ఇచ్చారు. తెల్సా!" అన్నాడో శిష్యుడు. "ఓహో! మీ గురువు మిమ్మల్ని మించిన అతితెలివి మంతుడన్న మాట అనుకుని, ఇక వీళ్ళని సమాధాన పర్చడం కష్టమని తెలిసి “సర్లెండి! ఇప్పుడు మీ గురువుగారికి ఏం చెబుతారు? సొమ్ము నష్టపోయి, గుర్రం కూడా దక్కకపోతే ఆయన ఆగ్రహించరా?" అన్నాడా బాటసారి.

"నిజమేనయ్యో! ఇంతసేపూ మాకు ఆ ఆలోచనే రాలేదు. ఎలా? ఇప్పుడేమిటి దారి?" అని వితర్కించుకోసాగారు ఆ శిష్యపరమాణువులు. దానికా బాటసారి, తనవద్ద ఓ గుర్రం ఉందనీ వారి భయం పోగొట్టేలా ఎంతో ఉదారంగా దాన్ని వారికి దానంగా ఇచ్చేయ దల్చుకున్నాననీ అన్నాడు. "ఆహా! విధి విలాసం! ఇంతలోనే భగవంతుడు మనకి భయం కల్పించి, అంతలోనే దాన్ని పోగొట్టాడు. ఈ అపరిచితుడెవరో మనకు తెలీకున్నా విలువైన గుర్రాన్ని దానంగా మనకే ఇస్తున్నాడంటే విధి విలాసం కాక ఇంకేమిటి?" అనుకొని శిష్యులు ఆ 'మహాత్ముని' వెంట వెళ్ళారు.

అతడు తన ఇంటికి తీసుకెళ్ళి, తనవద్ద ఉన్న గుర్రాన్ని వాళ్ళపరం చేశాడు. ఇది దానంగా ఇచ్చినది కనుక- దీన్ని మీరు దాన విక్రయాధికార సహితంగా ఉపయోగించుకోవచ్చు అన్నాడు. "గుడ్డు పోతే పోయింది, స్వారీకి సిద్ధంగా ఉన్న గుర్రమే దక్కింది. ఈ సంగతి తెలిస్తే గురువుగారెంత సంతోషిస్తారో కదా! సుముహూర్తం దగ్గర్లో ఉంటే, గురువు గారి గుర్రపు స్వారీ త్వరలోనే కళ్ళారా చూసే భాగ్యం మనదే" అనుకుంటూ దాన్ని తోలుకొని వెళ్ళి గురువుగారి ముందు నిలిపి సంగతంతా పూసగుచ్చినట్లు చెప్పారు. శిష్యుల ఆసక్తికరమైన కథనం వింటూ, గురువుగారు గుర్రాన్ని పరీక్షగా చూడకపోయినా, మరో ఇద్దరు శిష్యులు మాత్రం "ఇది అంత మేలుజాతిది కానట్టుంది. ఓ కన్ను కనబడదు, చూడబోతే వాతంతో దీనికో కాలు లాగేసినట్లు ఉంది" అని పరీక్షించి తేల్చారు. దాణా ఖర్చు దండగ అని అతడెవరో మనకి దీన్ని అంటగట్టి ఉంటాడనీ నిర్ధారించారు. 'ఎవరికెంత ప్రాప్తమో అంతే!" అని వేదాంతం పలికారు గురువు గారు.

Responsive Footer with Logo and Social Media