8.గురువు గారికి గుర్రం కోసం వెతుకులాట
శిష్యుల ఐకమత్యం పుణ్యమా అని, అంతా కలసి పరమానందయ్య గారి కాలు కుళ్ళబొడిచిన కారణంగా, అది చీముపట్టి మూడవనాటికి కాలు ఇంత లావున వాచిపోయింది. కాలు క్రింద పెట్టలేక నానా అవస్థ పడుతూంటే, చురకత్తి లాంటి శిష్యుడొకడికి చురుక్కుమనే ఆలోచన స్ఫురించింది.
"ఇక గురువు గారి పని అయిపోయింది. ఆయన నడిచెల్లడం కల్ల. ఆయన స్వంతంగా వైద్యం తెలిసిన వాళ్ళు కనుక కాలు కుళ్ళిపోకుండా కాపాడుకున్నా, వృద్ధాప్యం మీద పడుతూన్నందున పూర్వం మాదిరిగా నడవలేరు. మనం ఎలాగైనా ఒక గుర్రాన్ని సంపాదించాలి. అదీగాక రాజులు-రాజాధికారులు సైతం గురువుగార్ని సలహాల కోసం కబురంపు తారు. వాళ్ళదగ్గర కెళ్ళేటప్పుడు నడిచివెళ్తే చిన్నతనంగా ఉంటుంది. అదే గుర్రంమీద అయితే, కొంత ఠీవీ-దర్పమూనూ..." అని ఆ శిష్యపరమాణువు అందర్నీ ఉద్దేశించి ఉపన్యసించాడు.
అందరూ అతడి ఆలోచన ప్రశస్త్యంగా ఉందని ప్రశంసించారు. ఇంతమంది ఏకగ్రీవంగా చెపుతుంటే, అది దివ్యమైన అలోచనే అయి వుంటుందని అంచనాగా లెక్కలుకట్టే పరమానందయ్య కూడా అవునవునని తలవూపి “అలాగే కానివ్వండి! మీ అందరి దయా ఉంటే నాకు లోటేమిటీ?" అన్నారు.
"హమ్మమ్మమ్మ! ఎంతమాట గురువుగారు! మీరు పెద్దలు. మీ దయ మాయందు ఉండేలా మీరే అనుగ్రహించాలి" అనడంతో తన శిష్యుల వినయానికి మురిసి ఓ మంచి గుర్రం ఎత్తు, లావు, రంగు అన్నీ సరిగ్గా ఉండేలాగ చూసి కొనుక్కు రావడానికి ఇద్దరు శిష్యులను నియమించారు.