36.రామాయణంలో పిడకలవేట
ఆరోజు ఉగాది. తెలుగువారికి పర్వదినం. పరమానందయ్యగారు తెల్లవారుఝామునే నిద్రలేచి, తమ శిష్యులకి దగ్గరుండి తలంటిపోయించి కొత్తబట్టలిచ్చి, "కట్టుకోరండర్రా...” అన్నారు. ఆయన వాత్సల్యానికి అమాయకులైన శిష్యుల కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. అంతలో కళ్యాణి కొత్తబట్టలు కట్టుకొని హంసలా నడుచుకుంటూ పక్కింటికి వెళ్ళి బ్రహ్మానందయ్యగారి చేతికి అక్షింతలిచ్చి "ఆశీర్వదించండి పెదనాన్నా..." అంటూ ఆయన పాదాలకి నమస్కరించింది. ఆయన జలజలా ఆనందభాష్పాలు రాలుస్తూ "శీఘ్రమేవ కళ్యాణప్రాప్తిరస్తు... సమస్త సన్మంగళాణి భవంతు" అని ఆశీర్వదించారు. అంతలో ఆయన భార్య బంగారమ్మ వస్తూనే "బంగారుబొమ్మలా వున్నావే నా తల్లీ! నా దిష్టే తగిలేను" అంటూ గబగబా ఉప్పుతో దిష్టి తీసేసింది. బ్రహ్మానందయ్యగారు పక్కింటికి వినపడేలా గొంతు పెంచి “ఏమే కళ్యాణీ!
ఈ ఏడు మీనాన్న నీకు పెళ్ళి చేస్తాట్టా...? చెప్పు ఆయనగారికి... ఆ డబ్బూ దస్కం మేము చూసుకుంటాం. పెద్దవాళ్ళం, మాకూ ఆమాత్రం బాధ్యత ఉందని చెప్పు" అన్నారు బిగ్గరగా, బంగారమ్మ నవ్వి "మాకు మాత్రం ఎవరున్నారే తల్లీ.... నా ఏడువారాల బంగారు నగలన్నీ నీవే... పెళ్ళికూతురికి పెట్టే పట్టుచీరలన్నీ కొనిపెట్టుంచాం. నీకు లోటు జరగనిస్తామటే...? చెప్పు మీ అమ్మకి" అంది. ఆ మాటలన్నీ పక్కింటికి స్పష్టంగా విన్పించాయి. పరమానందయ్యగారు భారంగా నిట్టూర్చి తన భార్యతో "అవునే... ఈ ఏడే కళ్యాణిని ఒకింటిదాన్ని చేసి మన బాధ్యత తీర్చుకోవాలి. ఇవాల్టి నుంచి ఎటూ వసంత నవరాత్రులు ఆరంభం. రోజుకో గ్రామంలో పురాణ పారాయణం చేయడం, వారిచ్చే సంభావనలు స్వీకరించడం మన ఆనవాయితీ... చూద్దాం అన్నింటికి ఆ పరమేశ్వరుడే వున్నాడు" అన్నారు. ఆయన మాటలు విన్న ఏడుగురు శిష్యులూ మొహాలు చూసుకున్నారు.
ఆనాటి సాయంత్రం శిష్య సమేతంగా రామాపురం అనే ఊరికి చేరుకున్నారు పరమానందయ్యగారు. అది దాయాది వారసత్వ గ్రామం. 'తాను వారసుడ్ని కానని' తెల్సికూడా, ఆ రహస్యాన్ని దాచిపెట్టి అక్కడికి వచ్చిన వీర్రాజు ముందు వరసలోనే ఒక ఆసనం మీద ఆశీనుడయ్యాడు. ఊరివారంతా అతడి వెనుకనే నేలమీద కూర్చున్నారు. దేవాలయం మండపం చాపమీద పరమానందయ్యగారు, ఆయన వెనుక ఆయన ఏడుగురు శిష్యులు ఆశీనులయ్యారు. ఆ
ఏడుగుర్నీ చూడగానే వీర్రాజుకి ఒళ్ళు మండిపోయింది. మునుపు అగ్రహారంలో తనని అవమానించిన శిష్యులని ఇప్పుడు ఈ జనం ముందు పరాభవించి పగ తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. పరమానందయ్యగారు ఓసారి గొంతు సవరించుకుని "ఈనాటి కథాకార్యక్రమం... వనవాసంలో సీతారాముల వసంతోత్సవం' గురించి చెప్పుకుందాం..." అనగానే “ఆగండాగండి...." అంటూ వీర్రాజు అడ్డుపడి "ప్రతేడూ మేము వినే ఏడుపిదేగా... చెప్పడానికి మీకు బుద్ధి లేకపోయినా వినడానికి మాకు సిగ్గు లేదనుకున్నారా?" అన్నాడు. పరమానందయ్యగారి ముఖం జేవురించింది. కోపాన్ని తమాయించుకుంటూ "ఇది రామాయణం. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు" అన్నారు. వీర్రాజు చటుక్కున లేచి "అదంతా మాకు అనవసరం. ఇది మా హక్కుభుక్తాల్లో గ్రామం. ఈ సంవత్సరం క్రొత్త కథ చెప్పాలి. 'రామాయణంలో పిడకల వేట' చేతనైతే ఈ కథ చెప్పండి, లేదా నెత్తిన చెంగేసుకుపొండి. మీరైనా... మీ శిష్యుల్లో ఎవరైనా ఈ కథ చెప్తే.... ఇవిగో ముప్పయి బంగారుకాసులు బహుమతి. చెప్తారా? పోతారా?" అన్నాడు.
పరమానందయ్యగారు ఏదో చెప్పబోయేలోగా "నే చెప్తా... నే చెప్తా... " నంటూ గురు చటుక్కున లేచి "నేను కవిని... కాదన్నవాడిని చెప్పుతో కొడ్తా... ఔనన్నవాణ్ణి గూబలదరగొడ్తా... "నంటూ చెంగున ఎగిరి వీర్రాజు ముందుకు దూకి “ఔనా? కాదా? ఏమంటావురా టవ్వా?" అనడిగాడు. ఆ ప్రశ్నవిని నివ్వెరపోయాడు వీర్రాజు. సమాధానం 'ఔనన్నా, కాదన్నా' ప్రమాదం తప్పదని తెల్సి గుటకలు మింగాడు. అతడి ఆలస్యాన్ని భరించలేనట్టు “ఎహె... 2 తొందరగా చెప్పేదవండి... చెప్పా? గూబా?" రెట్టించాడు బైరాగి, వీర్రాజు గుడ్లు మిటకరిస్తూ "ఏదో ఒకటి ఏడు" అనేశాడు. గురు ఒక అడుగు వెనక్కి వేసి "అయితే విను. సీతారామలక్ష్మణులు వనవాసం చేస్తూ అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అక్కడి మునులు, మహర్షులు, వారి పతులు సీతారాములని సేవించి ఎంతో ఆనందించారు. వారి ఆనందాన్ని, వారికి అలాంటి సంతోషాన్ని కలిగించిన సీతని చూసి కుళ్ళిపోయింది ఒక రాకాసి. దాని పేరు వీరణి, మునుల్ని, మునిపతుల్ని ఏడిపించాలన్న దుగ్ధతో ఆ రాత్రికి రాత్రే అక్కడున్న ఆవులని, పిడకల్ని మాయం చేసేసింది. తెల్లారింది. పసిబిడ్డలకి పాలు పితికి పట్టడానికి ఒక్క ఆవు కూడా లేదు. మునులు యజ్ఞయాగాది నిత్యానుష్ఠాన అగ్నిహోత్ర విధి నిర్వర్తించడానికి ఒక్క పిడక ముక్క కూడా లేదు. ఆవులు లేకుండా పాలెలా వస్తాయి? ఆవు పేడ లేనిదే పిడకలెలా చేస్తారు? అందరూ పరుగు పరుగున వెళ్ళి "అమ్మా! సీతాదేవి నిన్నటిదాకా మేమంతా సుఖంగా ఉన్నాం. నిన్న మీరొచ్చారు. తెల్లారేసరికి మా ఆవులు, పిడకలూ మాయమయ్యాయి. ఇహ మా బ్రతుకులు తెల్లారేదెలా?' అని వాపోయారు. ఆ నింద తన మీద పడేసరికి, అది రాక్షసమాయ అని గ్రహించిన సీతాదేవి ఆగ్రహంతో లేచి రాములవారి ధనుస్సు చివాల్న లాగి...." అంటూ సీతలా అభినయిస్తూ... పద్యం పాడినట్లు...
నేనే మహా పతివ్రతనైతినేనీ... నేనే శ్రీరాము నర్ధాంగి నైతినేనీ... నేనే లక్ష్మణు వదినమ్మ నైతినేనీ... ఈ శరము వీరడి దొక్కదించి పిడకల నేలకి దించుగాకా...." అని లేచి బాణం వదిలాడు. మరుక్షణం “చస్తినో..." అంటూ భయంతో గావుకేక పెట్టాడు వీర్రాజు. గురు వెంటనే "అలా చస్తూ వాడు నేలకూలాడు. ఆవులూ పిడకలూ క్రిందికి దిగొచ్చాయి. ఇదే రామాయణంలో పిడకలవేట..." అని ముగించాడు. జనం పెద్దపెట్టున కేరింతలతో చప్పట్లు కొట్టారు. బైరాగి, వీర్రాజు వైపు చురచురా చూస్తూ "సిగ్గుందా? బుద్దుందా? ఉంటే... ఆ ముప్పయికాసులు అయ్యవారి దోసిట్లో పోసి… టపటపా... టపాటపా... చెంపలు వాయించుకోండి" అని ఈసడించాడు. వీర్రాజు చెంపలేసుకుంటూ 'చెప్తా... చెప్తా... వీళ్ల పని రేపు చెప్తా...' అనుకున్నాడు లోలోపల ఉక్రోషంతో ఉడికిపోతూ...