20.పరమానందయ్య పరలోక యాత్ర



మధ్యాహ్నం భోజనాలయి గురువుగారు, గురుపత్ని, ఇతర శిష్యులంతా కునుకు తీస్తున్న తరుణంలో ఓ శిష్యుడు తటాలున లేచి ఇంటికి ఓ మూల నిప్పంటించాడు. “ఏమిట్రా ఈపని?" అని అడిగిన ఇంకో శిష్యుడికి "ఆమాత్రం తెలీదా? ఉక్కబోత చంపేస్తుంది. ఎండాకాలం వేడి. 'ఉష్ణం ఉష్ణన శీతలం' అని కదా గురువుగారు చెప్పారు. ఈ వేడికి తగ్గ జవాబు అగ్గినిప్పే అని నిప్పెట్టేశాను" అన్నాడు అంటించిన శిష్యుడు మహా సంబరంగా. గ్రామం యావత్తూ ఈ అతితెలివి శిష్యుడి పనికి నొచ్చుకుని గురువు గారి మీదున్న గౌరవం వల్ల శిష్యులకు మెత్తగా చివాట్లు వేసి సరిబెట్టి తన్నకుండా వదిలారు. ఆశ్రమంతో పాటు తమ ఇళ్ళూ ఎక్కడ అంటుకుంటాయోనని వాళ్ళంతా ఏకమై మంటలను ఆర్పడంలో సాయపడ్డారు. అప్పటికే ఆశ్రమంలో మూడొంతులు తగులడిపోయింది.

కట్టుబట్టలు మిగిలాయి. దీంతో గురువు గారికి సగం ప్రాణం పోయింది. బెంగతో రోజులెలా గడపాలా అనే దిగులుతో ఇంకా నీరసించిపోయారు. శిష్యులందరూ ఆ స్థితిలో గురువుగార్ని చూడలేక బావురుమన్నారు. ఇంతకాలం వారి అమాయకత్వాన్ని భరిస్తూ వచ్చిన పరమానందయ్యకీ వారి పత్నికీ, "ఒకవేళ తామేదైనా అయితే, వీరి పరిస్థితి ఏమిటి?" అనే దిగులూ ఎక్కువైంది. దిగులు తగ్గడానికి కొన్నాళ్ళు పుట్టింటి కెళ్ళోస్తానని వెళ్ళింది గురుపత్ని.

ఓరోజు ఉన్నట్టుండి ఆయన కాళ్ళూ చేతులూ చల్లబడ్డాయి ఇంకేముందీ? ఆయనకు అంత్యకాలం సమీపించిందని నిర్ధారించేసిన శిష్యులు ఆయన్ని శ్మశానానికి మోసుకు పోయారు. 'అంత హఠాత్తుగా ఎలా జరిగిందబ్బా?' అనుకుంటూ "ఈ శిష్యుల తెలివి తెల్లారినట్టే ఉంది" అని పుట్టింట్లో ఉన్న పేరిందేవికి కబురందించి, తీరా శ్మశానానికి వచ్చి చూస్తే, మాట పడిపోయి కళ్ళనీళ్ళు కారుస్తున్న గురువుగారు వారి కంటబడ్డారు. 'ఇది పక్షవాత లక్షణంలా ఉందే' అని అనుభవగ్నుడొకడు అనడంతో, శిష్యులు చేసిన నిర్వాకానికి మండిపడి గ్రామస్తులు వార్ని ఊళ్ళోకి ఆశ్రమానికి రానివ్వక అట్నుంచటే వెళ్ళగొట్టారు.

                                                           ***
Responsive Footer with Logo and Social Media