18.పట్టుబట్టల దహనం



ఒకానొక సందర్భంలో పరమానందయ్య గారి పట్ల అపరిమితాభిమానంతో, రాబోయే శ్రీరామ నవమి వేడుకలలో ఐదు రోజులపాటు పురాణ కాలక్షేపం విన్పించాలంటూ దగ్గరి గ్రామస్తులు కొందరు పట్టుపట్టారు. వారి కోరికను కాదనలేక పరమానందయ్య గారు పత్నీ సహితంగా వేంచేస్తామన్నారు. "అంతకంటే మహద్భాగ్యమా?" అని గ్రామస్తులు వారందరికీ విడిది ఏర్పాట్లు ఘనంగా చేశారు. పరమానందయ్య గారికి నిజానికి రామాయణగాధ ఒక్కటే బాగా చెప్పడం వచ్చు! భారత భాగవతాల జోలికెళ్ళక ముందే, తండ్రిగారు కాలం చేసినందున, అవి అంతంతమాత్రం స్వంత ప్రజ్ఞతో అలవర్చుకున్నవే గనుక, పురాణం చెప్పమని ఎవరడిగినా “రామాయణం చెప్పుకుందాం" అనేవారు. సందర్భం కూడా కలసి వచ్చింది గనుక, ఐదురోజులే అన్నారు గనుక మొదట్లోని బాల, అయోధ్యా కాండలూ, చివర్లోని యుద్ధకాండా వదిలేసి అరణ్య - సుందరకాండలు ఎత్తుకున్నారు.

ఓరోజు పురాణంలో లంకాదహన ఘట్టం వివరించి చెప్తూ “ఆ ప్రకారం.... హనుమ చూచిరమ్మంటే కాల్చివచ్చినాడు అనే వాక్యంతో ఆ నాటికి పురాణం చాలించారు. ఆ మాట శిష్యుల మనస్సు మీద బాగా ముద్రపడిపోయింది. చివరిరోజు గ్రామస్తులు గురువు గారికి పట్టు పీతాంబరాలు, గురుపత్నికి పట్టుచీరా రవికె పెట్టి దక్షిణతో సహా సత్కరించారు.

తిరుగు ప్రయాణమై వెళ్ళాక ఓరోజు పట్టుబట్టలు ఆరబెట్టారు గురుపత్ని. "నాయనా! బట్టలు ఆరాయో లేదో చూడు" అన్నారు. అంతే! శిష్యుడికి పురాణంలో ఓరోజు ముక్తాయింపుగా గురువుగారు అన్న వాక్యం గుర్తుండిపోయి, చూడ్డానికి వెళ్లినవాడు పట్టుబట్టకు నిప్పంటించి చక్కా వచ్చాడు. క్షణాల్లో అంత విలువైన పట్టుబట్టలూ భస్మం అయిపోవడం చూసి, నోట మాటరాక నిలువు గుడ్లేసుకుని చూస్తూ పేరిందేవి “మళ్ళీ జన్మలో ఇలాంటివి సంపాదించ గలమా?" అని కంటతడి పెట్టింది.

Responsive Footer with Logo and Social Media