15.నీటిగండం తప్పిన గురువు గారు
రామావధాన్లు ఏకాకి అవడం వల్ల, పోతూపోతూ మఠానికి రాసేసిన ఆస్తి యావత్తు పరమానందయ్య గారి పరమైంది. ఆ సామానులు బండిమీద వేసుకొని, ఇంటిదారి పట్టిన పరమానందయ్యకు తన శిష్యుల జాగ్రత్తమీద గల అపారమైన నమ్మకం కొద్దీ "నాయనా! బండిలోంచి ఏది క్రింద పడినా తీసి లోపల వేస్తారు కదా!" అని చెప్పి కునుకు తీయసాగారాయన. దానిక్కారణం ఉంది. అంతకు ముందొకసారి ప్రయాణంలో బండిలోంచి గురువు గారి మరచెంబు క్రింద పడినాకూడా గుర్వాజ్ఞ లేదని దాన్నట్లాగే చక్కా వదిలేసి వచ్చేశారు వాళ్ళు. ఆ తర్వాత ఇంకొకసారి బండి కుదుపులకి అంతకంటే విలువైన గురుపత్ని కాలి పట్టాలు జారిపోయాయి. అవీ అంతే. దాంతో ఆయన ఈ ప్రయాణం పెట్టుకోగానే శిష్యులకు జాగ్రత్తలు చెప్పి నిద్రపోసాగారు. కొంత సేపటికి ముఖంమీదకి మెత్తని జిగురు లాంటి ముద్దవంటి పదార్ధం కంపుకొడుతూ ఠాప్మని పడేసరికి ఉలిక్కిపడి లేచి చేత్తో తడిమి చూసుకోగా ఇంకేముందీ అసహ్యంగా తగిలిందాయన చేతికి. అది ఎద్దుపేడ
“ఇదేంట్రా?" అని విసుక్కున్నారాయన "మీరేకదండీ క్రింద పడిన ప్రతీదీ బండిలో వేయమన్నారు” అని శిష్యుల జవాబు.
వెంటనే బండి ఆపించి చెరువులో ముఖం కడుక్కుందామని వెళ్ళి, అది కొత్త ప్రదేశం కావడంతో ఊబిలో దిగబడి "నన్ను కాస్త పైకి లాగండర్రా" అంటూ నెత్తీ నోరూ మొత్తుకున్నారు. "అయ్యా! మీరువస్తువులే పైకి తీయమన్నారు గాని, మిమ్ములను లాగమని ముందు మాకు చెప్పలేదు" అంటూ తర్కానికి దిగబోగా "మీతర్కం తెలివి తగలయ్య! ముందు నన్ను పైకి తీయండర్రా" అని బ్రతిమాలి శిష్యుల సహాయంతో బ్రతికి బైటపడ్డారు పరమానందయ్య. ఆ విధంగా ఆయనకి పెద్ద జలగండ ప్రమాదం తప్పింది.