14.శొంఠికొమ్ము వైద్యం
గ్రామగ్రామానా ఉన్న అనేకానేక శిష్యకోటిలో రామావధానులు ఒక్కడు. అతడు అప్పుడప్పుడూ పరమానందయ్య గారిని సందర్శిస్తూ నాలుగు మంచి ముక్కలు చెప్పించుకుని వెళ్తూండేవాడు. నా అనేవాళ్ళెవరూ లేని అవధాన్లకి అన్యాయార్జితమైన ఆస్థి చాలా ఉంది. ఒకసారి తన ఇంటికి దయచేయమని అతడు గురువుగార్ని ఎప్పుడూ కోరుతూండడం, ప్రతీసారీ అలాగే అంటూ పరమానందయ్య వాయిదా వెయ్యడం జరుగుతూ వస్తోంది.
ఇక అంత్యదశ సమీపించడంతో..... అవధాన్లు తాను రాలేక గురువుగార్నే శిష్యసమేతంగా రమ్మని కబురంపాడు. ఇక తప్పదని బయల్దేరారు అందరూ. వెళ్ళాక వారూహించని విధంగా అవధాన్లు కన్నీళ్ళ పర్యంతమై "నేనిక బతకను గురువుగారూ!" అంటూ బావురుమన్నాడు. "భయపడకు" అని ధైర్యం చెప్పి “నా శిష్యులలో కొందర్ని వైద్యంలో పరిపూర్ణులను చేశాను. వారి వైద్యంతో నువ్వు ఎంచక్కా లేచి తిరగ్గలవు" అన్నారు పరమానందయ్య.
వైద్యంలో ఒకేఒక్క అంశం తెలిసిన నలుగుర్నీ అవధానికి వైద్యం చెయ్యమని పురమాయించారు. ఒకడు శొంఠిపొడుం మాత్రలుగా కట్టి ఇచ్చాడు. ఇంకొకడు శొంఠకొమ్ము గంధం అరగదీసి అవధాన్లుకి ఒళ్ళంతా పట్టించాడు. ఇంకొక శిష్యుడు శొంఠి కషాయం పట్టించసాగాడు. మరొక శిష్యుడు నిమ్మకాయంత శొంఠి ముద్దవలె నూరి నడినెత్తిన పట్టు వేశాడు. ఈ యావత్ శొంఠి వైద్యం అపారమైన వేడిమిని పుట్టించి, అవధాని హాహాకారాలు చేయసాగాడు. "చచ్చాను మొర్రో" అని గోల పెట్టసాగాడు. "ఎంత అరచి గీ పెట్టినా, చివరికి మీ ప్రాణాలు మాత్రం ఎటూ పోనివ్వం! మీ దేహంలోనే మీ ప్రాణాల్ని బందీలుగా చేస్తాం!" అంటూ అవధాని నవరంధ్రాల్లో శొంఠిముద్ద కూరారు పదిమంది శిష్యులూ కలిసి, ఎప్పుడో జరగాల్సిన పని తక్షణమే జరిగి అవధాని హరీమన్నాడు. శొంఠికొమ్ములు నాణ్యమైనవి దొరక్కపోవడం వల్లనే ఆయన ప్రాణాలు పోయాయని, లేకుంటే తప్పకుండా ప్రాణాలు నిలబడేవని శిష్యులు వాపోయారు. పరమానందయ్య వారితో ఏకీభవించారు.