మానవ జీవితం


కాశీపురంలోని వేదశాస్త్రి వేదపండితుడు, అతడి ఏకైక పుత్రరత్నం పరమ శుంఠలా తయారై ఇల్లు విడిచి దేశాలు పట్టిపోయాడు. శాస్త్రి భార్య విశాలాక్షి మహాసాద్వి చేతికొచ్చిన కొడుకు చేజారి పోయాడనే దిగులుతో మంచం పట్టింది. కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి ఆమెకు కళ్ళు కూడా కన్పించుకుండా పోయాయి.
గర్భ దరిద్రుడైన వేదశాస్త్రికి కష్టాలు క్రొత్తవి కాకపోయినా ఎక్కువైనాయి. బ్రహ్మ ముహూర్తంలో లేచింది మొదలు దైవకార్యాలు చేయడం. ఆ పూటకు భిక్ష సంపాదించు కోవడం, వంట చేసి భార్యకు తినిపించడం ఆమెకి సేవచేయడం అతడి దినచర్య అయిపోయింది. మంచంలోనే కృశించి, కృశించి ఆమె ఓ రోజు తనువు చాలించింది.
తనకున్న ఆ ఒక్క పూరిల్లు అమ్మి, ఆ డబ్బుతో వేదశాస్త్రిగారు మరణించిన తన భార్యకి సాంప్రదాయంగా కర్మ క్రతువులు నిర్వహించాడు. కన్న కొడుకును, కట్టుకున్న భార్యను. చివరికి తనకంటూ వున్న పూరి గుడిసెను కూడా పోగొట్టుకొని నిర్మల చిత్తంతో, సుఖదుఃఖాలకు అతీతంగా వున్న అతడ్ని చూసి కార్యానికొచ్చిన కొందరు ఆ విషయమే అతడితో ఇలా అన్నారు.
"శాస్త్రి! అనేక జాతి పక్షులు ఓ మహావృక్షాన్ని ఆశ్రయించి, విశ్రమించి, సూర్యోదయంతోపలు దిక్కులకు వెళ్లిపోతుంటాయి. మానవ జీవితమూ అంతే! ఈ భూమ్మీద మన పని అయిపోగానే వెళ్లిపోతుంటాం. అశాశ్వతమైన ఇహలోక బాంధవ్యాల కోసం బాధపడట మెందుకురా?" అని. దాంతో జ్ఞానోదయమైన శాస్త్రి మనస్సులో నవచైతన్య కిరణాలు ప్రసరించి ఇహలోక మోహాలకు స్వస్తిచెప్పి దైవ సాన్నిధ్యంలో గడిపే నిమిత్తం హిమాలయాలకు పయనమయ్యాడు.
అశాశ్వతమని తెలిసీ కూడా ఇహలోక బాంధవ్యాలపై మక్కువ ఏర్పరచుకోవడం అవివేకం.

Responsive Footer with Logo and Social Media